సీజనల్ వ్యాధుల వేళ సర్కారు దవాఖానలకు నిర్లక్ష్యపు రోగం పట్టుకున్నది. డెంగీ, విషజ్వరాలు, ఇతర రోగాలు ప్రబలుతున్న తరుణంలో మందుల కొరత భయపెడుతున్నది. జలుబు చేసినా, జ్వరం వచ్చినా ఒకటే మందు బిల్ల చేతిలో పెట్టి పంపుతుండడం కలవరపెడుతున్నది. దాదాపు 45 రోజులుగా జిల్లాలోని ఏ వైద్యశాలకు వెళ్లినా ఇలాంటి దుస్థితే ఉంటున్నది. మరోవైపు డెంగీ పాజిటివ్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. రోగులు చేసేదేం లేక తప్పసరి పరిస్థితిలో ప్రైవేట్ వైద్యం కోసం పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడగా, పేద, మధ్యతరగతి వర్గాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తున్నది.
కరీంనగర్, జూలై 15 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: కరీంనగర్ జిల్లాలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, 139 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, నాలుగు బస్తీ దవాఖానలు ఉన్నాయి. వీటికి తోడు జిల్లా కేంద్రంలో ఒక ప్రభుత్వ జనరల్ దవాఖాన, హుజూరాబాద్‌లో ఒక ఏరియా దవాఖాన, జమ్మికుంటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నాయి. సగటున ఒక రోజుకు ప్రభుత్వ జనరల్ దవాఖానలో వెయ్యి, హుజూరాబాద్ ఏరియా దవాఖానలో 400, పీహెచ్‌సీల్లో 100, యూపీహెచ్‌సీల్లో 70, జమ్మికుంట సీహెచ్‌సీలో 200, బస్తీ దవాఖానల్లో 60 మంది చొప్పున రోగులు వైద్యం కోసం వస్తున్నారు.
ఈ మొత్తం దవాఖానల్లో రోజుకు సగటున 8 వేలకు పైగా రోగులకు ఓపీ చూస్తున్నారు. దవాఖానలో ఒంటి నొప్పులు, దగ్గు, జలుబు, జ్వరాలతో వచ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఈ లక్షణాలు సీజనల్ వ్యాధులకు దారి తీస్తున్నాయి. అయితే ఇలాంటి రోగులకు ముందుగానే మంచి మందులు ఇస్తే సీజనల్ వ్యాధులను ఆదిలోనే అరికట్టే అవకాశాలున్నాయి. కానీ ప్రభుత్వ దవాఖానల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.
అందుబాటులో లేని మందులు.
సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులు ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబుతో బాధపడుతూ వచ్చే రోగులకు సీపీఎం ట్యాబ్లెట్, సిరప్ ఇస్తారు. కానీ, గత 45 రోజులుగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ఈ మందులు అందుబాటులో లేవు. అంతే కాకుండా యాంటిబయాటిక్‌గా ఇచ్చే అజిత్రోమైసిన్ కూడా అందుబాటులో లేదు. యాంటిబ యాటిక్ వాడినప్పుడు కడుపులో మంట రాకుండా ఇచ్చే ప్యాంటప్ ట్యాబ్లెట్స్, నొప్పుల కోసం డైక్లో, బీపీ కోసం టెల్మా వంటి మందులు 45 రోజులుగా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్‌లోనే లేకుండా పోయాయి. వైద్యులు మాత్రం అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.
నిజానికి ఈ మందులు ఏ పీహెచ్సీలో కూడా అందుబాటులో లేవని స్పష్టమవుతున్నది. కొన్ని పీహెచ్‌సీల్లో వైద్యులు పాత స్టాక్‌తో నెట్టుకొస్తున్నట్టు తెలుస్తున్నది. చాలా పీహెచ్‌సీల్లో జలుబు, దగ్గు, జ్వరానికి పారాసిటమాల్ ఒక్కటే చేతిలో పెట్టి పంపిస్తున్నారు. నొప్పులతో బాధపడుతూ వచ్చే రోగులకు కూడా సంబంధిత మందులు అందుబాటులో లేవు. అనేక పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో మానసిక రోగులకు అవసరమైన మందులు లేవు. మరో పక్క డెంగీ జ్వరాలు జిల్లాను భయపెడుతున్నా యి.
కేవలం ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన పరీక్షల్లో 15 రోజులుగా రోజుకు సగటున 2 చొప్పున 30 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి రోగులకు సరై న వైద్యం అందించాలంటే పూర్తి స్థాయిలో మందులు అవసరం ఉంటాయి. కానీ, అనేక చోట్ల సీజనల్ వ్యాధులకు అవసరమైన పూర్తి స్థాయి మందులు లేక పోవడంతో రోగులు ప్రైవేట్ దవాఖానలకు వెళ్తున్నారు. వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తున్నది.
కేసీఆర్ సర్కారు హయాంలో కరీంనగర్ జనరల్ ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన టీ హబ్‌లో పది రోజులుగా పలు సేవలు నిలిచి పోయాయి. ఈ సెంటర్‌కు వివిధ పీహెచ్‌సీల పరిధిలో రోగుల నుంచి సేకరించి తెచ్చిన రక్త, మూత్ర పరీక్షలు పూర్తిగా నిలిపివేశారు. కేంద్రంలోని కొన్ని ఎక్విప్మెంట్ పనిచేయక పోవడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తున్నది. రోగ నిర్ధారణ పరీక్షలు ముఖ్యంగా సీబీపీ, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ పరీక్షలు నిర్వహించడం వల్ల పేద రోగులకు ఎంతో వెసులుబాటు ఉండేది. టీ హబ్‌లో ప్రస్తుతం కేవలం థైరాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. మిగతా పరీక్షలన్నింటికీ పది రోజులుగా అటకెక్కించారు.
కొన్ని నెలల నుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న. డాక్టర్లు నన్ను పరీక్షించి, ఎక్స్‌రేలు తీసిన్రు. వరంగల్‌కు పోవాలని చెప్పిన్రు. నొప్పులు తగ్గడానికి మందులు రాసినా ఇక్కడ ఒక్క గోలీ లేదని, బయట కొనుక్కోవాలని అంటున్నరు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తే మళ్లీ వరంగల్‌కు వెళ్లాంటున్రు. ప్రైవేట్ దవాఖాన్లకు పోతే పరీక్షలు, మందులకు వేలు ఖర్చయితున్నయి. అధికారులు అన్ని రకాల పరీక్షలు, మందులు అందుబాటులో పెడితే మాలాంటి పేదోళ్లకు సాయంగా ఉంటుంది.
– రాములమ్మ, పెద్దాపూర్
మా అమ్మకు కుక్క కరిచింది. కరీంనగర్‌లోని దవాఖానలో ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం మందులు రాసినా అందులో పూర్తిగా ఇవ్వలేదు. లేవన్నరు. మళ్లీ గాయం ఎక్కువై వాపు ఉండడంతో వైద్యులు మరిన్ని మందులు రాశారు. డిస్పెన్సరీలో వాపు తగ్గే మందు లేదని చెప్పారు. దీనిని బయట కొనుక్కున్నాం.
– రవీంద్రాచారి, జీలకుంట
జ్వరం, తల తిప్పుతుందని దవాఖానకు వస్తే డాక్టర్ నాలుగు రకాల మందులు రాసిండు. ఇక్కడికి వస్తే ఒక్కటే రకం గోళీలు ఉన్నాయని, మిగితావి బయట కొనుక్కోవాలని అంటున్నరు. అధికారులేమో దవాఖానలో అన్ని పరీక్షలు చేస్తరు, మందులు ఉన్నయని అంటుంటే ఇక్కడ మాత్రం ఏం లేదు. రోటీన్‌గా ఉండే మందులు కూడా దొరుకుతలేవు. పూర్తి స్థాయిలో మందులను అందుబాటులోకి తేవాలి.
– రిజ్వానా, కరీంనగర్
నా కూతురు అనారోగ్యంతో ఉండడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ దవాఖానకు తీసుకెళ్లిన. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి థైరాయిడ్ ఉన్నట్టు గుర్తించిన్రు. రెండు నెలలకు సరిపడా మందులు ఇచ్చిన్రు. అవి ఇప్పుడు అయిపోయినయి. సుల్తానాబాద్, కరీంనగర్ ప్రభుత్వ దవాఖానల్లో తిరిగితే థైరాయిడ్ మాత్రలు దొరకవని, బయట కొనుక్కోవాలని సమాధానం చెబుతున్నరు. మాలాంటి పేదోళ్లకు ఇలాంటి మందులు బయట కొనుగోలు చేయాలంటే ఇబ్బందే కదా.
– గడ్డం రాజు, సుల్తానాబాద్
కడుపునొప్పిగా ఉందని కరీంనగర్ దవాఖానకు వచ్చిన. వైద్యులు స్కానింగ్ చేసి మందులు రాసిన్రు. నడుంనొప్పి, కడుపు నొప్పికి నాలుగు రకాల మాత్రలు రాసినా ఒక్కటే మాత్ర ఇచ్చి మిగితావి అందుబాటులో లేవని అన్నరు. జ్వరాలకు, నొప్పులకే మాత్రలు లేకపోతే ఇంకా దేనికి ఉంటయి. మాలాంటోళ్లకు ప్రభుత్వ దవాఖానల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలి.
– లత, కరీంనగర్