కోల్‌సిటీ, మే 14: గోదావరిఖని బస్టాండ్ ఏరియా రాజీవ్ రహదారి వెంట ఉన్న వ్యాపారులు రోడ్డున పడ్డారు. దాదాపు 20 ఏండ్లుగా హోటళ్లు, పాన్ టేలాలు పెట్టుకొని జీవిస్తుండగా, సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం బుధవారం ఉదయం అధికారులు అర్ధంతరంగా జేసీబీ సాయంతో కూల్చివేయడంతో రేపటి సంది బతుకుడెట్ల్లా..? అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇన్నాళ్లు అన్నం పెట్టిన దుకాణాలు కళ్లెదుటే నేలమట్టం అవుతుంటే బరువెక్కిన గుండెలతో లబోదిబోమన్నారు. సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికే దుకాణాలు కూల్చివేయాల్సి వచ్చిందని నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పారు. అయితే బస్టాండ్ మూలమలుపు వద్ద ఉన్న ఓ మద్యం దుకాణాన్ని మాత్రం వదిలిపెట్టి ఆ పక్కన ఉన్న షాపులను కూల్చివేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ సంఘటన స్థలానికి చేరుకొని కూల్చివేతల చర్యలను ఖండించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండంలో అభివృద్ధి పేరుతో విధ్వంసకాండ ఇంకెంత కాలం సాగుతుందో..? ఓపిక పడుతున్నామనీ, ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఇప్పటికే ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్‌లో మొబైల్ దుకాణాలను, ఓల్డ్ అశోక్ థియేటర్‌ను కూల్చివేసి అనేక మంది వ్యాపారుల బతుకులను ఆగమాగం చేశారని, ఇంకెంత మంది జీవితాలను రోడ్డుపాలు చేస్తారని ప్రశ్నించారు.