Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 20 : కన్నవాళ్లను కాదు పొమ్మంటే.. ఆ మమకారంను తల్లిదండ్రులు చంపుకొని తిరగబడితే ఎదురయ్యే పరిస్థితులను ఇతివృత్తంగా నిరీక్షణ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘తిరగబడ్డ మమకారం’ టైటిల్ తో లఘుచిత్రం తెరపైకి ఎక్కిస్తున్నారు. గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ లో గల నిరీక్షణ స్టూడియోలో గురువారం ఇష్టా జాతీయ సమితి, ప్రజానాట్య మండలి కళాకారుడు కవ్వంపల్లి స్వామి, సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ, ఎన్పీడీసీఎల్ రిటైర్డ్ ఏడీఈ కే. వెంకటేశ్వర్లు ముఖ్యతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి సన్నివేశంను క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. దర్శకుడు పోతుల చంద్రపాల్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సందేశాత్మక చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందాలని అతిథులు ఆకాంక్షించారు.
సమాజానికి చక్కటి సందేశాన్ని అందించే ఉద్దేశంతో నేటి పరిస్థితులను అధ్యయనం చేసి పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను నిరాశ్రయులను చేసినప్పుడు ఆ కన్నవారు తమ మమకారాన్ని కడుపులో చంపుకొని తిరగబడితే పర్యవసానాన్ని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్న దర్శకుడిని అభినందించారు. ఇటీవల కాలంగా లఘుచిత్రాల పేరుతో కొందరు ఇబ్బందికర దృశ్యాలతో చిత్రాలను రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సందేశాత్మక చిత్రాలను మాత్రమే ప్రేక్షకులు స్వాగతిస్తారని పేర్కొన్నారు. గతంలో పలు సామాజిక అంశాలపై లఘుచిత్రాలను నిర్మించిన చంద్రపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కళాకారులు మేజిక్ రాజా, పోతు శంకరయ్య, సిరిపురం శ్రీనివాస్, సతీష్, శ్రీలత, రజిత, వేదశ్రీ, అస్మిత్ పాల్గుణ, రియాలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.