Rachchapalli | ధర్మారం, ఫిబ్రవరి14: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలో శనివారం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఈనెల 10 నుంచి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 10న మల్లన్న కథ కార్యక్రమంతో ఉత్సవాలు మొదలైనాయి. ఈ ఉత్సవాలలో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా భక్తులకు ఆలయం తరఫున తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పెర్క రవీందర్, సభ్యులు, గ్రామ సర్పంచ్ సూర రజిత – వెంకటేశం, వార్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కాగా ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆలయంలో రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా శివపార్వతుల ఉత్సవమూర్తులతో గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రవీందర్, ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.