రాజన్న సిరిసిల్ల, మే 27(నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత పోసింది. సాయంత్రం మూడు గంటల సమయంలో ప్రారంభమైన వాన సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా పడింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామంలో పిడుగు పడి దాసరి లక్ష్మణ్ (26) అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి, రాజన్న ఆలయ పరిసర రహదారులు, జాతర గ్రౌండ్ రహదారులపై వరద నీరు పొంగి ప్రవహించింది.
అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందుర్తి మండలంలోని గుడిపేట, రుద్రంగి మండలకేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పల చుట్టూ వరద నీరు చేరింది. వీర్నపల్లి పెద్దవాగు, గర్జనపల్లి మూల వాగు ప్రవాహం పెరిగింది. వట్టివాగు ఉధృతికి గర్జనపల్లి, వన్‌పల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్, నేతన్నచౌక్, వెంకంపేట, సర్దార్‌నగర్, ప్రగతి నగర్ వార్డులన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి.
పాతబస్టాండ్ నుంచి కొత్తచెరువు వరకు రోడ్డు వాగును తలపించింది. వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పోలీసులు పాతబస్టాండ్ నుంచి సంజీవయ్యనగర్, అనంతనగర్ నుంచి పద్మనగర్, చిన్నబోనాల, రాజీవ్‌నగర్ వెళ్లే రహదారిని మూసి వేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో వర్షం దంచికొట్టింది. సూరంపేట నుంచి గంగారాంతాండ వెళ్లేరోడ్డులో వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మల్యాల మండలంలోని తాటిపల్లి గ్రామశివారులోని ఓ ఇంటిపైకప్పుపై పిడుగు పడడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో దాదాపు గంటన్నరకు పైగా భారీ వర్షం పడడంతో పలు వార్డులు, లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించింది. బస్టాండ్, ఎంఈవో కార్యాలయ ఆవరణలు వరద నీటితో నిండి పోయాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాసారం గ్రామంలో పెద్ది తిరుపతికి చెందిన బర్రె పిడుగుపడి మృతిచెందింది.