ధర్మారం, మే 19 : బొమ్మారెడ్డిపల్లిలో మరణించిన గొర్రెలకు కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా పరిహారం చెల్లించాలని, బాధిత గొర్రెల పెంపకందారులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కోరారు. గ్రామానికి చెందిన ఐదుగురు గొర్రెల పెంపకందారులకు చెందిన 96 గొర్రెలు ఇప్పటికే మృతి చెందగా, సోమవారం మరో ఏడు గొర్రెలు మరణించాయి. సమాచారం తెలుసుకున్న కొప్పుల ఈశ్వర్ సోమవారం ఆ గ్రామానికి వెళ్లి గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు. గొర్రెల మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వందకు పైగా గొర్రెలు మేతకు వెళ్లి విషాహారం తిని మరణించడం బాధాకరమన్నారు. మూగజీవాల మృతి వల్ల గొర్రెల పెంపకందారులకు తీవ్రమైన నష్టం వచ్చిందన్నారు.
వారు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక గొర్రెల పథకం ప్రస్తుతం లేనందున కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి తన నిధి ద్వారా పరిహారం చెల్లిస్తేనే నష్టపోయిన బాధిత గొర్రెల పెంపకందారులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక గొర్రెల పథకం ఉండడం వలన ప్రమాదవశాత్తు సామూహికంగా పెద్ద సంఖ్యలో మరణిస్తే గొర్రెల స్థానంలో తిరిగి వారికి తమ ప్రభుత్వం ఇచ్చేదని అన్నారు. కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు. కొప్పుల వెంట నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నాయకులు పూస్కూరు రామారావు, గుర్రం మోహన్‌రెడ్డి, గాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి,దాడి సదయ్య, మిట్ట తిరుపతి, ఎగ్గెల స్వామి, గడ్డం మహిపాల్‌రెడ్డి, సంకరి నర్సింగం, పాక వెంకటేశం, ఆవుల లత, దేవి నళినీకాంత్, దేవి వంశీక్రిష్ణ, ఆవుల వేణు,ఐత వెంకటస్వామి,అజ్మీర మల్లేశం పాల్గొన్నారు.