Odela | ఓదెల, జూన్ 13: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ సర్కారు బడిలో పిల్లలను చేర్పిస్తే రూ.2వేల నగదు అందజేస్తానని సర్పంచ్ జీల రాజు యాదవ్ ప్రకటించారు. శానగొండ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న స్థలానికి వెళ్లి కూలీలకు బడిబాట కార్యక్రమంపై శనివారం వివరించారు. సర్కారు బడులలో విద్యార్థులకు అందుతున్న ఉచిత పథకాలు, విద్యాబోధన గురించి తెలియజేశారు.
ప్రైవేటు బడుల మోజులో సర్కారు బడులను నిర్లక్ష్యం చేయవద్దని కూలీలకు వివరించారు. ఇక్కడి బడిలో అడ్మిషన్ తీసుకున్న ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులకి రూ.2 వేల నగదును అందజేయనున్నట్లు సర్పంచ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.