Karimnagar | ముకరంపుర, ఫిబ్రవరి 20 : ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలనే డిమాండ్‌తో ”అర్టిజన్ కన్వర్షన్ జేఏసీ” ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విధులకు గైర్హాజరైన అర్టిజన్ కార్మికుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. విధులకు హాజరుకాని కార్మికులను రిమూవ్ చేయాలని అన్ని సర్కిల్ కార్యాలయాలకు ట్రాన్స్ కో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కరీంనగర్ సర్కిల్ కార్యాలయ అధికారులు గురువారం ఉదయం అర్టిజన్ కార్మికుల హాజరును తీసుకున్నారు.
మొత్తం సర్కిల్ పరిధిలో 320 అర్టిజన్ కార్మికులకు గాను 299 మంది విధులకు హాజరయ్యారు. మరో 14 మంది ఇది వరకే సెలవులో ఉండగా ఉదయం ఏడుగురు విధులకు హాజరు కాలేదు. విద్యుత్ సౌధకు వెళ్లకుండా కరీంనగర్ సర్కిల్ పరిధిలో ఐదుగురుని వన్ టౌన్, త్రీ టౌన్, ఒకరిని సిరిసిల్లలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో విద్యుత్ అర్టిజన్ కన్వర్షన్ కరీంనగర్ జేఏసీ చైర్మన్ శివ కృష్ణ, నాయకులు మద్దెల శ్రీనివాస్, పీ సంతోష్, జీవన్, ధర్మేందర్ ఉన్నారు. విధులకు హాజరు కాని అర్టిజన్ల వివరాలతో కూడిన నివేదికను కరీంనగర్ సర్కిల్ కార్యాలయ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.