కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 15 : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ (డీఆర్ఏ)లో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తున్నది. దీర్ఘకాలంగా జిల్లాలో కొనసాగుతున్న వారంతా విధిగా పకజిల్లాల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉన్నా, ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లానే మొదటి ప్రాధాన్యతలో ఎంచుకున్నట్లు తెలిసింది.
తమను యథాస్థానంలో కొనసాగించేలా రాజకీయ ఒత్తిళ్లకు కూడా దిగుతున్నట్టు డీఆర్ఏ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. వివిధ రకాల కారణాలతో కొన్నేళ్లుగా సెర్ప్‌లో బదిలీలు జరగకపోగా, వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పలు కేటగిరీలకు చెందిన ఉద్యోగులు ఆయా విభాగాల్లో గట్టి పట్టు సంపాదించినట్టు పేరొంటున్నాయి. వాటిలో జరిగే లోటుపాట్లు కూడా వారికి క్షుణ్ణంగా తెలియడంతో ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్నట్లు తెలుస్తున్నది.
అలాగే అత్యధిక మంది ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట, ఉద్యోగానికి సమాంతరంగా పలు వ్యాపారాలు కూడా మొదలుపెట్టి నాలుగు చేతులా సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత స్థానాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయితే ఆదాయ ఆర్జనకు భారీగా గండి పడుతున్నది. క్షేత్రస్థాయి సందర్శనలు లేకుండానే ఉన్నచోట నుంచే విధులు నిర్వర్తించే అవకాశానికి కూడా దూరమవుతారు.
ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లి ఆదాయ మార్గాలు దూరం చేసుకుని శారీరక శ్రమను కొని తెచ్చుకునే బదులు, ఎలాగోలా అధికారులను ఒప్పించి యథా స్థానాల్లో కొనసాగేందుకు ఉమ్మడి జిల్లాలోని పలువురు సెర్ప్ ఉద్యోగులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో వివిధ కేడర్లలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు బదిలీలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఎల్ 5 కేటగిరీ కింద అదనపు డీఆర్డీవోల బదిలీలు పూర్తి చేయగా, ఎల్ ఫోర్ కేటగిరీ కిందికి వచ్చే డీపీఎంలకు కూడా నేడో రేపో బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
అలాగే ఎల్ వన్, ఎల్ టు, ఎల్ త్రీ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు కూడా బదిలీలు చేపట్టేందుకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలో ఎల్ 5 నుంచి ఎల్ 1 వరకు 700 పై చిలుకు ఉద్యోగులు ఉండగా, ఎల్ 5 కేటగిరీ అధికారులకు కౌన్సెలింగ్ పూర్తయి, బదిలీ ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. అనంతరం ఎల్ 4 కేటగిరీ పరిధిలోకి వచ్చే డీపీఎం లకు ఒకటిరెండ్రోజుల్లో కౌన్సెలింగ్ చేయనున్నారు.
స్థాన చలనానికి సుముఖంగా లేని పలువురు డీపీఎంలు అధికార పార్టీ పెద్దల వద్దకు పరుగులు తీస్తున్నట్టు తెలుస్తున్నది. కుంటిసాకులు చెబుతూ తమను ఉన్న స్థానాల్లోనే కొనసాగించేలా ఆదేశించాలని వేడుకుంటున్నట్టు, మరి కొంత మంది సిఫారసు లేఖలతో సెర్ఫ్ సీఈవోను ముందే కలుస్తున్నట్టు వినికిడి. గ్రామీణ ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా విధులు నిర్వర్తించాల్సిన గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదిలీల్లో పైరవీలకు తావు కల్పిస్తే, ఆ సంస్థ లక్ష్యం నీరుగారి పోయే అవకాశాలున్న దృష్ట్యా పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.