కరీంనగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యలపై నాలుగు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆరు రాష్ర్టాలకు విస్తరించిన ఈ రాకెట్‌ను వెలుగులోకి తెచ్చి, అబార్షన్లు జరుగుతున్న తీరుపై ప్రచురించిన కథనాలు కలకలం రేపుతున్నాయి. ఇవి రాష్ట్రంలోనే సంచలనం కాగా.. ఏకంగా ప్రభుత్వమే సీరియస్ అయింది. దీంతో జిల్లా వైద్య యంత్రాంగం రంగంలోకి దిగి, అబార్షన్లు చేస్తున్న మాధవి నర్సింగ్ హోంను సీజ్ చేసింది. అయితే ఇంతటితో ఆగిపోకుండా మరింత లోతుగా వెళ్తేనే ఒక నెట్వర్క్లా సాగుతున్న దందాకు బ్రేక్ పడే అవకాశముంటుంది.
జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అబార్షన్లపై ‘నమస్తే తెలంగాణ’ నాలుగు రోజులుగా వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌లోని మాధవి నర్సింగ్ హోమ్‌లో అబార్షన్లు జరగడాన్ని వెలుగులోకి తేవడంతో హుస్నాబాద్ పోలీసులు స్పందించి ఇప్పటికే దవాఖాన నిర్వాహకులతోపాటు నర్సులు, ఆపరేషన్ థియేటర్ ఆపరేటర్‌ను అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్య శాఖ చోద్యం చూస్తున్నదని, లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటేనే అడ్డుకట్ట పడుతుందన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కథనాలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుండగా, ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ మేరకు కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం రాత్రి హుజూరాబాద్‌లోని శ్రీ మాధవి దవాఖానను తనిఖీ చేసి, సీజ్ చేయడంతోపాటు నర్సింగ్ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు. ఆ మేరకు సంబంధిత ఉత్తర్వులను యాజమాన్యానికి డీఎంహెచ్‌వో సుజాత అందించారు.
నర్సింగ్ హోమ్‌లో అన్నీ లోపాలే..
డీఎంఅండ్‌హెచ్‌వో సుజాత ఆధ్వర్యంలో ఎంసీహెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సనా జువేరియా, హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో బీ చందు పోలీసుల సహాయంతో హుజూరాబాద్‌లోని శ్రీ మాధవి నర్సింగ్ హోంను తనిఖీ చేశారు. దవాఖాన రికార్డులను తనిఖీ చేసి, అన్ని లోపాలే ఉన్నట్టు గుర్తించారు. స్కానింగ్ రూం, ల్యాబ్, బెడ్స్, ఇతర గదులను పరిశీలించి, నిబంధనల ప్రకారం లేవని స్పష్టం చేశారు. దవాఖాన ముందు ప్రదర్శించిన డాక్టర్ల పేర్లు, ఇక్కడకు వచ్చే డాక్టర్ల పేర్లకు సరిపోవడం లేదని, రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన డాక్టర్లకు బదులుగా వేరే వారు వస్తున్నారని చెప్పారు. బాత్రూంలు, రోగులు ఉండే గదులు, ఇతర గదులు సక్రమంగా లేకపోవడంపై ఆగ్రహించారు. దవాఖాన నిర్వహణ సక్రమంగా లేకపోవడమే కాకుండా, రికార్డులు కూడా పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నర్సింగ్ హోమ్‌లోనే అబార్షన్ చేసినట్టు గుర్తించి చర్యలు తీసుకున్నారు.
లోతుగా వెళ్తేనే అడ్డుకట్ట
హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రంగా సాగిన ఈ అబార్షన్ల రాకెట్ ఆరు రాష్ర్టాలకు విస్తరించినట్టు తెలుస్తున్నది. అయితే, వైద్యారోగ్యశాఖ మరింత లోతుగా వెళ్తేనే ఈ దందాకు అడ్డుకట్ట పడే అవకాశముంటుంది. ప్రధానంగా హుజూరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా డాక్టర్లే భ్రూణహత్యల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ శుక్రవారం ప్రచురించిన కథనంలో వెల్లడించింది. ఒక నెట్వర్క్లా సాగుతున్న ఈ రాకెట్‌కు అడ్డకట్ట వేయాలంటే కేవలం హుజూరాబాద్ దవాఖానను సీజ్ చేసి వదిలిపెడితే ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వైద్యాధికారి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించి, లోతుగా విచారణ చేయిస్తేనే భ్రూణహత్యలు పూర్తిగా ఆగే అవకాశాలున్నాయి. ఈ వ్యవహారాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తులు, వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ దందాకు బ్రేక్ పడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లోని దవాఖానల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని డీఎంఅండ్‌హెచ్‌వో సుజాత హెచ్చరించారు. జిల్లా, హుజురాబాద్ డివిజన్లో దవాఖానల తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని తెలిపారు. హుజూరాబాద్‌లోని దవాఖానను సీజ్ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. డీఆర్ఏ చట్టం ప్రకారం దవాఖానలు నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ ప్రైవేట్ దవాఖానలు నడుపుతున్నట్టు తమ దృష్టికి వస్తే సీజ్ చేయడానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అబార్షన్ల వ్యవహారంలో ముగ్గురు రిమాండ్‌కు వెళ్లారని, వైద్యురాలు ఎవరనేది? విచారణ జరుగుతుందని తెలిపారు. విచారణ అనంతరం సదరు డాక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంఅండ్‌హెచ్‌వో చెప్పారు.