కోరుట్ల, జనవరి 7: కోరుట్ల మున్సిపాలిటీ స్వచ్ఛతలో మెరిసింది. మున్సిపల్ అధికారుల కృషి ఫలించి మేటిగా నిలిచింది. పారిశుధ్య నిర్వహణలో చేసిన కృషికి గాను ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ పట్టణంగా గుర్తింపు సాధించింది.
స్వచ్ఛ సర్వేక్షన్ – 2023లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో బహిరంగ మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్ ప్లస్ ప్లస్) పట్టణంగా పురస్కారానికి ఎంపికైంది.
స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మున్సిపల్ అధికారులు ఇటీవల టాయిలెట్ క్లీన్ క్యాంపెయిన్ చేపట్టారు. బహిరంగ మల, మూత్ర విసర్జనతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతోపాటు టాయిలెట్లు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు పురస్కారం రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.