కరీంనగర్ నడిబొడ్డున ఉన్న రెవెన్యూ క్లబ్ నిర్వహణ గాడి తప్పింది. నెలనెలా లక్షల్లో రెంట్ వస్తున్నా దశాబ్దాలు గడిచినా పైసా ఆస్తి పన్ను చెల్లించకపోవడం అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఒకటికాదు రెండు కాదు 80లక్షలు బకాయి ఉందని పేర్కొంటూ రెండ్రోజుల కింద క్లబ్ ఆధీనంలోని దుకాణాల సముదాయాలను నగరపాలక సంస్థ సీజ్ చేయగా, ఇన్నేండ్ల నుంచి వచ్చిన ఆదాయం ఏమైందనే ప్రశ్న తలెత్తుతున్నది. స్వాహా జరిగిందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కార్యవర్గం ఎప్పటికప్పుడు మారుతున్నా వచ్చే ఆదాయ, వ్యయాలపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడంతో నెలనెలా వచ్చే సొమ్మును హాంఫట్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 2: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ క్లబ్ ఆధీనంలోని దుకాణాల సముదాయం సీజింగ్ వ్యవహారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్లబ్ ఆధీనంలోని దుకాణాల సముదాయంలో 30కి పైగా గదులు, వీటిపైన 2వేల చదరపు ఫీట్ల విస్తీర్ణానికి పైగా మరో భవనం, రెవెన్యూ గార్డెన్, మరికొంత ఖాళీ స్థలం ఉన్నది. వీటిని రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభించి, వివిధ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అద్దెకు ఇస్తుండగా, నాటి నుంచి నేటి వరకు నయాపైసా కూడా మున్సిపాల్టీకి ఆస్తి పన్ను రూపేణా చెల్లించనట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో వీటన్నింటికీ మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించిన ప్రకారం గత నెల 31లోపైతే రిబేటుతో కలిసి 30,85,653 చెల్లించాలని గడువు విధించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో సీజ్ చేసినా.. క్లబ్ ఖాతాలో డబ్బులు లేక చెల్లించలేదని క్లబ్ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. అయితే గడువు ముగిసిన తర్వాత అధికారులు మాత్రం మొత్తం 80,93,067 చెల్లిస్తేనే సీజ్ తొలగిస్తామని స్పష్టం చేస్తుండగా, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చెల్లింపులు చేసేదెలా..? అని క్లబ్ కార్యవర్గం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో అద్దెకు ఉండి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారంతా ఆందోళన చెందుతున్నారు.
రెవెన్యూ క్లబ్ ఆధీనంలో 30కి పైగా అద్దె గదులు, రెవెన్యూ గార్డెన్ పేర ఓ ఫంక్షన్ హాల్, ఖాళీ ప్రదేశం, అద్దె గదులపైన రెండు వేల చదరపు ఫీట్లకు పైగా భవనం ఉన్నది. కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న గదులకు 7వేలు, రెవెన్యూ క్లబ్ వైపు గదులకు 6,500 చొప్పున నెలవారీ అద్దె క్లబ్‌కు వస్తున్నట్టు తెలుస్తున్నది. కేవలం గదుల ద్వారానే నెలకు 2.25లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నది. ఒకటో అంతస్తులోని భవనం, రెవెన్యూ గార్డెన్, ఖాళీ స్థలంలో కొనసాగుతున్న సర్వీసింగ్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయం అదనం. వీటన్నింటి ద్వారా మొత్తంగా సగటున నెలకు 3లక్షల దాకా ఆదాయం వస్తున్నట్టు క్లబ్ సభ్యులే లెక్కలేసి చెబుతున్నారు. ఏడాదికి కనీసం 36 లక్షలు అవుతుంది. 20 ఏళ్ల నుంచి నేటి వరకు అన్ని ఖర్చులు పోను 5కోట్లకు పైగానే నికర ఆదాయముండాల్సి ఉండగా, ఆస్తి పన్ను కూడా చెల్లించని స్థితికి చేరడంపై ఆశాఖలోని కిందిస్థాయి ఉద్యోగులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. క్లబ్ కార్యవర్గం ఎప్పటికప్పుడు మారుతున్నా వచ్చే ఆదాయ, వ్యయాలపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడంతో నెలనెలా వచ్చే ఆదాయాన్ని ఎవరికి వారే అన్నట్లుగా హాంఫట్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికయ్యే కార్యవర్గం ప్రతి ఆర్థిక సంవత్సరంలో క్లబ్ లావాదేవీలపై ఆడిట్ చేయించాల్సి ఉండగా, ఎన్నడూ ఆదిశగా ఆలోచించనే లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రతి నెల క్రమం తప్పకుండా లక్షల్లో వచ్చే ఆదాయం ఎటు మళ్లిందనే అనుమానాలు సభ్యుల్లో వ్యక్తమవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ఆస్తి పన్ను చెల్లించకున్నా అధికారులు ఎందుకు మౌనం వహించారని, దీని వెనుక ఆంతర్యమేమిటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్లపై కొన్ని నెలల క్రితమే కమిషనర్‌గా వచ్చిన ఐఏఎస్ అధికారి చాహత్ బాజ్‌పాయ్ ప్రత్యేక దృష్టి సారించడంతో బకాయి ఉదంతం వెలుగులోకి వచ్చింది. 80లక్షలకు పైగా పెండింగ్‌లో ఉండడాన్ని ఆమె సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తున్నది. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న రెవెన్యూ క్లబ్ నిర్వహణ, క్లబ్‌కు ఉన్న ఆస్తుల ద్వారా వస్తున్న ఆదాయ, వ్యయాలపై సరైన లెక్కలు లేకపోవడంపై అన్ని వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతున్నది. దీనిపై కలెక్టర్ దృష్టి సారించి లోతుగా విచారణ జరిపిస్తే, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని రెవెన్యూ వర్గాలే పేర్కొంటుండడం కొసమెరుపు. దీనిపై సంబంధిత బాధ్యులను వివరణ కోరగా నిరాకరించారు.