సీతారాముల కల్యాణం జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఊరూరా వేలాదిగా వచ్చిన భక్తుల సమక్షంలో కనుల పండువగా సాగింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ రాజన్న, ధర్మపురి నృసింహస్వామి, కొండగట్టు అంజన్న, ఇల్లందకుంట రామాలయం, గోదావరిఖని కోదండ రాముని ఆలయాలు కిక్కిరిసిపోగా, ఎటు చూసినా సందడి కనిపించింది. ఇల్లందకుంటలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మండలి విప్ కౌశిక్‌రెడ్డి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించగా, సుమారు 80వేల మందితో దేవస్థానం పోటెత్తింది.
ఇల్లందకుంట/ కమాన్‌చౌరస్తా, మార్చి30 : సీతారాముల కల్యాణం జిల్లా వ్యాప్తంగా గురువారం కమనీయంగా జరిగింది. ముఖ్యంగా అపర భద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట దేవాలయంలో అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీచైర్ పర్సన్ కనుమల్ల విజయాగణపతి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీపీ సుబ్బరాయుడు, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్(సీఎఫ్‌వో)చంద్రశేఖర్ హాజరై ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు సమర్పించారు. ముందుగా ఎదుర్కోళ్లను మహిళల నృత్యాల మధ్య నిర్వహించారు. కల్యాణ ఘట్టాన్ని అర్చకులు కలకుంట్ల సీతారామాచార్యులు, శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, హరికృష్ణమాచార్యులు జరిపించారు. రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు 80 వేల భక్తులు తరలివచ్చారు. కల్యాణం అనంతరం స్వామి భక్తులకు తలంబ్రాలు అందజేశారు. జమ్మికుంట రైస్‌మిల్లులు, కాటన్‌మిల్లు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రా సర్పంచ్ శ్రీలత, ఎంపీటీసీ విజయ, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, ఆర్డీవో హరిసింగ్, తహసీల్దార్లు మాధవి, రాజేశ్వరి, వెంకట్‌రెడ్డి, రాజయ్య, ఎంపీడీవోలు వెంకటేశ్వర్లు, కల్పన, విజయలక్ష్మి పాల్గొన్నారు.
పలుచోట్ల పాల్గొన్న ప్రముఖులు
సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌తోపాటు తీగలగుటపల్లి, జూబ్లినగర్ జరిగిన వేడుకలకు హాజరయ్యారు. శంకరపట్నం మండలం ఇప్పలపల్లి, ఆముదాలపల్లి, కాచాపూర్, మానకొండూర్ మండల కేంద్రంతో పాటు గంగిపల్లి, అన్నారం, లలితాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, గంగాధర మండలంలోని బూరుగుపల్లి, మధురానగర్, కురిక్యాల, ఉప్పరమల్యాల గ్రామాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు.