Tribal festival | రుద్రంగి, జూలై : రుద్రంగి మండల కేంద్రంతో పాటు బడితండా, దేగావత్ తండా, హర్యానాయక్ తండాల్లో గిరిజనుల ఆరాధ్య పండుగైనా సీత్ల భవానీ పండుగ వేడుకలను నాయకులు, గిరిజనులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. రుద్రంగి ఎస్సై శ్రీనివాస్ నాయకులతో కలిసి సీత్లా భవానీ పండుగకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ గిరిజనుల ప్రాముఖ్యతను తెలిపే సీత్లా భవానీ పండుగను ఖరీఫ్ పంటకు ముందుగా గిరిజనులు జరుపుకుంటామన్నారు. బంజారాల జీవణసరళిపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్న ప్రత్యేక పండుగను గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు.
వరుణదేవుడు కరుణించి సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు, పశుపక్షాదులు ఆరాధ్యంగా ఉండాలని కోరుతూ ప్రతీ గిరిజన తండాల్లో సీత్లా భవానీ పండుగను జరుపుకుంటామన్నారు. పాడి పశువులకి ఎలాంటి వ్యాధులు రాకుండా పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ఏడుగురు భవానీ దేవతల ప్రతిమలను తూర్పు అభిముఖంగా ప్రతిష్టించి ప్రతిమలకు పూలు, ఆకులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పెళ్లికాని యువతులు ఏడుగురు భవానీ దేవతలకు బెల్లంతో వండిన నైవేద్యాన్ని సమర్పించి తమ కోరికలు తీరాలని దేవతలను వేడుకుంటారని చెప్పారు. సీత్లా భవానీ వేడుకలకు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేగావత్ తిరుపతి, రాందాస్, నరేష్ నాయక్, గజన్లాల్, మధన్లాల్, మహేంధర్, హార్డు, ప్రకాష్, లావుడ్య మోహన్, రాజునాయక్, బన్సిలాల్, లింబా, సంతోష్, దేవనాయక్, గిరిజన నాయకులు, మహిళలు, యువతీయువకులు పాల్గొన్నారు.