రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణంగా పేరుగాంచిన కరీంనగర్ బస్టేషన్ భద్రత డొల్లగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో కొంతకాలంగా దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, విజిలెన్స్ విభాగం ఉన్నా సిబ్బంది కొరత వేధిస్తుండడం, పోలీసు ఔట్ పోస్టు ఉన్నా అంతంత మాత్రంగానే పర్యవేక్షిస్తుండడం జేబు దొంగలకు కలిసివస్తున్నది. నిత్యం చోరీలు జరుగుతూనే ఉండగా, ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
కరీంనగర్ తెలంగాణచౌక్, జూన్ 7: జిల్లా కేంద్రంలో బస్టేషన్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లే లక్షలాది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రయాణికుల తరలింపులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలోనే ఉంది. రీజియన్ పరిధిలోని 11 డిపోలకు చెందిన 911 బస్సులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీజియన్ల నుంచి నిత్యం 1800 బస్సులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి.
బస్టాండ్‌లో 43 ప్లాట్ ఫారంలు ఉండగా, వచ్చీపోయే వారితో సందడిగా ఉంటుంది. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయా ణం కల్పించడంతో ఏడాదిన్నరగా రోజూవారీ ప్రయాణికుల సంఖ్య 60వేల నుంచి 90 వేలకు పెరిగింది. పండుగలు, వారంతపు సెలవుల్లో ఈ సంఖ్య మరో 20 వేలు ఎక్కువగా ఉంటున్నది. ఇంత మంది ప్రయాణికుల రద్దీతో కళకళలాడే బస్టేషన్లో భద్రత లోపించడంతో కొన్ని రోజులుగా దొంగతనాలకు కేరాఫ్‌గా మారిపోగా, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
విజిలెన్స్‌లో సిబ్బంది కొరత
ఆర్టీసీలో విజిలెన్స్ ప్రత్యేక విభాగం ఉన్నా సిబ్బంది కొరత వేధిస్తున్నది. 14 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సి ఉండగా, కేవలం ఆరుగురే ఉన్నారు. పని ఒత్తిడితో పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించలేకపోతున్నారని తెలుస్తున్నది. సీఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఉన్నా సరిపడా సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. జోనల్ విజిలెన్స్ అధికారి నెల రోజులుగా సెలవుపై వెళ్లడంతో పర్యవేక్షణ లోపం కనిపిస్తున్నది. లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బస్టేషన్లో భద్రత పెంచాలని, దొంగతనాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రయాణికుల భద్రతకు అన్ని రకాల చర్యలు..
బస్టేషన్లో ప్రయాణికుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. పోలీసుల ఆధ్వర్యంలో ఔట్ పోస్టు కూడా ఏర్పాటు చేశాం. ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది పగలూ రాత్రి పనిచేస్తున్నారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. పాడైన సీసీ కెమెరాలను వెంటనే సరిచేస్తున్నాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సిబ్బందిని సంప్రదించాలి.
– రాజు (కరీంనగర్ రీజియన్ మేనేజర్)
పనిచేయని కెమెరాలు.. ఔట్ పోస్టుతో నిష్ప్రయోజనం..
బస్టేషన్లో జేబు దొంగల బెడద ఎక్కువైంది. ప్రయాణికుల బంగారు నగలు, బ్యాగులు, సెల్ఫోన్ల దొంగతనాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రయాణికుల భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ సిటీ నిధులతో బస్టేషన్లో 65 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, అందులో మెజార్టీ పనిచేయడం లేదు. కొన్ని పనిచేసినా పోలీసులకు ఆపరేటింగ్ రాకపోవడంతో ఘటన జరిగినప్పుడు వెనువెంటనే స్పందించలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, దొంగతనాల అడ్డుకట్టకు పోలీసు శాఖ తరపున బస్టాండ్‌లో గత ఏప్రిల్ 29న పోలీసు ఔట్ పోస్టును ఏర్పాటు చేశారు. షిఫ్ట్‌కు ముగ్గురు సిబ్బంది చొప్పున రోజు మూడు షిఫ్ట్‌లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా దొంగతనాలు ఆగడం లేదు. గత మే నెల 23న నగరానికి చెందిన శారద అనే మహిళ హైదరాబాద్ బస్సు ఎక్కి టికెట్ తీసుకునే సమయంలో బ్యాగులోని 5 తులాల బంగారం కనిపించలేదు.
సమాచారం మేరకు పోలీసులు వచ్చి బస్సులను తనిఖీ చేసినా, బంగారం లభించలేదు. అదే వారంలో సిద్దిపేట వెళ్తున్న ప్రయాణికుడి జేబులోంచి రూ.లక్షను కొట్టేశారు. ఇలా రోజూ రెండు,మూడు ఘటనలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఇటవలి కాలంలో పోకిరీల వేధింపు ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఘటన జరుగగానే వెంటనే స్పందించాల్సిన ఔట్ పోస్టు పోలీసులు బాధితులను పోలీసుస్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రయాణికులు ఠాణాల చుట్టు తిరగలేక తిరుగు ప్రయాణమతున్నారు.