Chigurumamidi | చిగురుమామిడి, మే 24 : చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్దారులు బతికున్నట్లు నిర్ధారించుకునేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన చేయూత లైవ్ అథెంటిఫికేషన్ సర్వేలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పింఛన్దారులు గ్రామపంచాయతీకి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రధాన కూడల వద్దకు వెళ్లి లైవ్ అథెంటికేషన్ సర్వే కు వెళ్లినప్పటికీ ఎండ తీవ్రతకు వృద్ధులు బయటకు రాలేకపోతున్నారు.
దీంతో పంచాయతీ కార్యదర్శులు ఇంటింటా వెళ్లి లైవ్ అథెంటికేషన్ సర్వేలో ఆలస్యమవుతోంది. మరోవైపు పింఛన్ దారులు ముఖ్యంగా వృద్ధులకు కంటి చూపు మందగించడంతో పాటు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానం రెండు లైవ్ అథెంటికేషన్ సర్వేకు సహకరించకపోవడంతో అనర్హులుగా ఆయా వృద్ధులను నిర్ధారించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అలాంటివారు గ్రామానికి 30 మంది చొప్పున ఉన్నారని పలువురు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. వారు బతికున్నప్పటికీ వారి నిర్ధారణకు గుర్తింపు లేకపోవడంతో వారినీ అర్హులుగా గుర్తించేందుకు వెంటనే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. మండలంలోని 17 గ్రామాలకు గాను అన్ని గ్రామాల్లో అథెంటికేషన్ సర్వే నిర్వహిస్తున్నామని ఎంపీడీవో తూమట్ల విజయ్ కుమార్ తెలిపారు.