అధికారపార్టీ కాంగ్రెస్‌లో ‘స్థానికం’ చిచ్చు మొదలైంది. ఇటీవల ప్రకటించిన ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లపై జగిత్యాల జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నది. తాము ఆశించిన చోట కావాలనే అవకాశం లేకుండా చేశారని, రిజర్వేషన్లన్నీ పథకం ప్రకారం చేయించారంటూ కాంగ్రెస్ కీలక నేతలపై ఆరోపణలు చేస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మండల స్థాయిలో బలమైన ద్వితీయ శ్రేణి నాయకులు, సీనియర్లు లేకుండా వ్యూహం ప్రకారం పన్నిన పన్నాగమని వాపోతున్నది. ఇన్నాళ్లూ తమను వాడుకొని, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సరికి కుట్రపూరితంగా వ్యవహరించారని రగిలిపోతున్నది. ఏదో ఒకటి రెండు చోట్ల కాదు.. దాదాపు జిల్లా అంతటా ఇలాంటి వ్యతిరేకత రాగమే వినిపిస్తున్నది.
జగిత్యాల, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఓ నియోజకవర్గానికి సంబంధించి రెండు మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో నాలుగు ప్రధాన పదవులు ఉండగా, పదేండ్లుగా మూడు పదవులు (రెండు జడ్పీటీసీ, ఎంపీపీ) జనరల్‌కు కేటాయింపు జరిగాయి. మరో ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ‘స్థానిక సంస్థల చట్టం 2018’ ప్రకారం రెండు పర్యాయాలు అంటే వరుసగా పదేండ్ల కాలానికి అవే రిజర్వేషన్లు వర్తింపజేస్తామని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘స్థానిక సంస్థల చట్టం’లో మార్పులు తెచ్చింది. 42శాతం బీసీలకు రిజర్వేషన్లు అన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని కొత్తగా రిజర్వేషన్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
2011 ఎస్సీ జనాభా ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు, 2024లో ప్రభుత్వం నిర్వహించిన సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు చేయాలని ఆదేశించింది. ఈ పద్ధతిలో రిజర్వేషన్లను ప్రకటించగా, ఆ రెండు మండలాల్లోని నాలుగు పదవులు ఎస్సీ రిజర్వేషన్ పరిధిలోకి వెళ్లడం వివాదాస్పదంగా మారింది. స్థానిక సంస్థల కీలక పదవులు ఆశించిన జనరల్, బీసీ కేటగిరీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. రెండేండ్ల క్రితం వరకు బీఆర్ఎస్లో కీలకంగా పనిచేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, మండలం రిజర్వు కేటగిరీలోకి వెళ్తుందని తెలిసినప్పటి నుంచి తీవ్ర నిరాశకు లోనుకావడమే గాక, కాంగ్రెస్ తనను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహించినట్టు తెలుస్తున్నది. తనను పార్టీలోకి రమ్మని పిలిచి ఇంత అన్యాయం చేస్తారా..? అంటూ ఎమ్మెల్యే సన్నిహితుడి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
సదరు ఎమ్మెల్యే సన్నిహితుడు సైతం.. ‘నేను పదేండ్లుగా పార్టీకి, ఎమ్మెల్యేకు అన్ని సేవలు చేశాను. మంత్రితో సైతం ఎమ్మెల్యేకు చెప్పించా. రెండు మండలాల్లో ఏదో ఒక్క స్థానం బీసీకి కేటాయిస్తే నేను పోటీ చేస్తానని అనుకున్నా. తీరా చూస్తే రెండు మండలాల్లో ఏ ఒక్కటి బీసీ కాకుండా చేశారు. నేను ఎవరికి చెప్పుకోవాలే’ అని వాపోయినట్టు తెలిసింది. పదవులు ఆశించిన ఈ రెండు మండలాలకు చెందిన మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఈ క్రమంలో చీఫ్ సెక్రెటరీకి రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదని, మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్యే లేఖ రాసినప్పటికీ.. పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా తమకు అన్యాయం చేసేందుకే ఇలా చేశారని, గాయం చేసి, ఇప్పుడు వెన్నరాసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ‘ఇది చేస్తాం. అది చేస్తాం. మీకు సముచిత స్థానం ఇస్తాం’ అని చెప్పిన నాయకులు ఇప్పుడు తమను నట్టేట ముంచారని వాపోతున్నారు.
జిల్లా నుంచి కీలక నేతగా గుర్తింపు పొందిన ప్రజాప్రతినిధి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ సీనియర్ నాయకులకు కత్తెర పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల పరిధిలో పదేండ్లుగా కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధి గెలుపు కోసం అహర్నిశలూ కృషి చేసిన ఐదారుగురు రెండో శ్రేణి నాయకులు స్థానిక రిజర్వేషన్లను చూసి కంగుతిన్నారు. గతంలో ఎస్సీకి రిజర్వు చేయబడిన జడ్పీటీసీ స్థానం ఈ సారి జనరల్ కేటగిరికి వస్తుందని, అక్కడి నుంచి పోటీ చేసి, జడ్పీలో కీలక బాధ్యతలు దక్కించుకుంటామని అధికార పార్టీకి చెందిన ఇద్దరు ద్వితీయ శ్రేణి నాయకులు భావించారు. అయితే ఆ స్థానం ఈ సారి బీసీలకు రిజర్వు కావడంతో హతాశులయ్యారు.
ఎంపీపీ స్థానం సైతం దక్కించుకునేందుకు వీలు లేకుండా చేయడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. నియోజకవర్గంలో మొన్నటి వరకు ఎస్సీ రిజర్వుగా ఉన్న జడ్పీటీసీ స్థానం ఇప్పుడు జనరల్‌కు రిజర్వు అయ్యింది. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఒక సీనియర్ నాయకుడు భావిస్తుండగా, నాలుగైదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు లేదా అతడి బంధువులు ఇక్కడి నుంచి పోటీ చేసి జడ్పీ చైర్పర్సన్ పదవిని దక్కించుకోవాలనే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో ఇన్నాళ్లూ కీలక ప్రజాప్రతినిధి కోసం పనిచేసిన తనకు న్యాయం జరుగుతుందా.. లేదా? అన్న అనుమానాన్ని సదరు నాయకుడు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. రిజర్వేషన్లు ఇలా రావడం వెనుక పెద్ద కుట్ర ఉందని, తమకు పదవులు ఇస్తే, ఎక్కడ ఆధిపత్యానికి ఇబ్బంది అవుతుందో అన్న ఉద్దేశంతో కావాలనే తమను నమ్మించి మోసం చేశారంటూ ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కీలకమైన నాయకులు, వారి రక్త సంబంధీకుల కోసం రెండు మూడు మండలాలను కావాలనే జనరల్ కేటగిరికి కేటాయించారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడి కుటుంబసభ్యుల నుంచి ఒకరిని జడ్పీ చైర్పర్సన్ స్థానంలో కూర్చోబెట్టేందుకు అనుగుణంగా రిజర్వేషన్లు వచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐదు గ్రామాలతో ఉన్న జిల్లా ప్రాదేశిక స్థానం మొన్నటి వరకు ఎస్సీ జనరల్ కేటగిరిలో ఉండగా, ఈ సారి అనూహ్యంగా జనరల్ మహిళ కేటగిరీలోకి వచ్చింది. జనరల్ మహిళ రిజర్వేషన్లో ఉన్న మరో గ్రామీణ జిల్లా ప్రాదేశిక స్థానం ఈ సారి జనరల్ కేటగిరి అయింది. ఇక్కడి నుంచి సీనియర్ నాయకుడు తన రక్త సంబంధీకులు లేదా బంధువును పోటీ చేయించే అవకాశం కనిపిస్తున్నది. అయితే దీనిపై కొందరు సీనియర్ నాయకులు ఆగ్రహిస్తున్నారు. బీసీకి రిజర్వు అయితుందని ఇన్నాళ్లూ ఆశపడ్డామని, అలాంటిది ఇప్పుడు జనరల్‌కు కేటాయిస్తే ఎలా పోటీ చేయగలమని, చేసినా ఉన్నత వర్గాలను తట్టుకొనే బలం తమకు ఎక్కడిదని వాపోతున్నారు.
ఇక జనరల్‌కు కేటాయించిన మరో స్థానం నుంచి గత ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయి, ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న నాయకుడి సోదరుడు లేదా బంధువులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. దీనిపై ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్ల తర్వాత తమ మండలం జనరల్ అయ్యిందని, తమకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే కీలక నాయకులు, వారి కుటుంబీకులే పోటీ చేస్తామని చెబుతుండడం సరికాదంటున్నారు. జిల్లా ప్రాదేశిక స్థానాల్లోనే కాదు, మండల ప్రాదేశిక స్థానాల్లో సైతం అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు అన్యాయం జరిగిందన్న ఆరోపిస్తున్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు కాకుండా తమను కట్టడి చేసేందుకే పక్కా వ్యూహం పన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉండే మరో మండల జడ్పీటీసీ స్థానం గతంలో బీసీ మహిళకు కేటాయించారు. అయితే ఈ మండల కేంద్రానికి సర్పంచ్‌గా పనిచేసిన ఓసీ వర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడు, చాలా రోజులుగా జడ్పీటీసీ స్థానాన్ని ఆశిస్తూ వస్తున్నాడు. అవకాశం వస్తే జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానం వస్తుందని భావించాడు. కానీ, ఎంపీపీ స్థానం ఎస్సీ రిజర్వు కావడం, జడ్పీ స్థానం జనరల్ మహిళకు కేటాయించబడడంతో తీవ్ర నిరాశ చెందాడు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పాడు. దీంతో ఓ కీలక ప్రజాప్రతినిధి బుజ్జగించి, ఆయన ముందే జిల్లా ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడి.. ‘మా వాళ్లు బాధపడుతున్నారు సార్. రిజర్వేషన్ మార్చే అవకాశం ఉందా..?’ అని అడిగినట్టు తెలుస్తున్నది. అయితే ఆ ఉన్నతాధికారి ‘అలా చేయరాదు సార్’ అని చెప్పడంతో ‘ఇప్పుడు ఏం చేయలేం తమ్మి. మరోసారి చూద్దాం. వేరే పదవులు లేవా..? ఎందుకు తొందర!’ అని సముదాయించినట్టు సమాచారం.
ఓ కీలక ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఇంకో మండలం కథ మరోలా ఉన్నది! గతంలో జడ్పీటీసీ స్థానం జనరల్ కేటగిరిలో ఉండగా, ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు కేటాయించబడింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన జడ్పీటీసీ ప్రభుత్వం మారిన వెంటనే పార్టీ ఫిరాయించాడు. మరోసారి జడ్పీటీసీకి పోటీ చేయాలని భావించాడు. ఇదే మండలాలనికి చెందిన ఒక గ్రామ మాజీ సర్పంచ్, జడ్పీ మాజీ సభ్యురాలు సైతం ఈ సారి జడ్పీటీసీకి పోటీ చేసి, జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక ప్రజాప్రతినిధి గెలుపు కోసం పెద్ద మొత్తంలో డబ్బులు వ్యయం చేసిన మరో నాయకుడు సైతం జడ్పీటీసీ లేదా ఎంపీపీ పదవులను ఆశించాడు. వీరంతా ఆ మండలం జనరల్ కేటగిరీకి కేటాయిస్తారనే ఊహించారు. అయితే అనూహ్యంగా జడ్పీటీసీ స్థానాన్ని బీసీ మహిళకు, ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో వారంతా తలలు పట్టుకొంటున్నారు.