సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ సర్కారు దవాఖానకు సుస్తీ చేసింది. ఓవైపు రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుండగా, మెరుగైన వైద్యం అందని ద్రాక్షే అవుతున్నది. డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలుతుండడం, అదే స్థాయిలో వందలాదిగా ఇన్, ఔట్ పేషంట్లు వస్తుండగా వైద్యుల కొరత వేధిస్తున్నది. మరోవైపు ఉన్న వైద్యులు సమయపాలన పాటించకపోవడం నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది.
ఇంకోవైపు బెడ్స్ సరిపడా లేకపోవడం, రోగం పూర్తిగా నయం కాకముందే డిశ్చార్చి చేస్తుండడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. జ్వరం వచ్చినా, మరేదైనా వ్యాధి సోకినా వైద్యుడు రాసే ప్రిస్కిప్షన్‌లో కొన్నింటికి మాత్రమే ట్యాబ్లెట్స్ ఇస్తుండగా, మిగతావి బయట కొనే దుస్థితి ఉన్నది. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ కరీంనగర్ ప్రభుత్వ దవాఖానను విజిట్ చేయగా.. ఇవన్నీ బట్టబయలయ్యాయి. ఎటు చూసినా రోగులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలే కనిపించాయి. కనీసం పేషెంట్ కేర్, ఎంఎన్‌వో, ఎఫ్‌ఎస్‌వోలు కూడా అందుబాటులో లేక రోగుల బంధువులే వీల్ చైర్లు, స్ట్రెచ్చర్స్పై తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కరీంనగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరోగ్య కేంద్రంగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన రోగులతో కిటకిటలాడుతున్నది. గతంలో ఐదారు వందల వరకు వచ్చే ఓపీకి ఇప్పుడు రోజుకు 1,300 మందికిపైగా రావడం కనిపిస్తున్నది. జ్వరాల సీజన్ కావడంతో బెడ్స్ సరిపోవడం లేదు. ఫోల్డింగ్ బెడ్స్ వేసి ఇతర వార్డుల్లో సర్దుబాటు చేస్తూ చికిత్స అందిస్తున్నారు.
సుమారు 300 బెడ్స్ ఉంటే మంగళవారం 428 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారు. అందులో జ్వర పీడితులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నెల 5న మేల్, ఫిమేల్ ఫీవర్ వార్డులు ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డులో 30 చొప్పున 60 బెడ్స్ ఏర్పాటు చేయగా, అవి కూడా పూర్తిగా నిండిపోయాయి. మరో ఆరుగురు బాధితుల కోసం పోల్డింగ్ బెడ్స్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఐడీ, ఎంఎస్ వార్డుల్లో కూడా జ్వర పీడితులను చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి వచ్చిన పేషెంట్లకు కూడా ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. డెంగ్యూ, జ్వర బాధితులు కూడా చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నుంచి డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే చిన్న పిల్లలు కూడా ప్రభుత్వ దవాఖానకు వస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 110 మంది ఓపీకి వచ్చారు. వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు దవాఖానలో సరైన మందులు లేవు. ఇటు సరిపడా సిబ్బంది అందుబాటులో లేక సేవలు ఆలస్యమవుతున్నాయి.
దవాఖానలో సరైన మందులు లేవు. జ్వర పీడితుల సంఖ్యకు సరిపడా లేక ఉన్న వాటినే సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. సరిపడా మెడిసిన్ ఉంటేనే రోగులు త్వరగా కోలుకునే అవకాశముంటుంది. జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల ప్రభుత్వ దవాఖానల నుంచి మందులు తెప్పించుకుని రోగులకు చికిత్స చేస్తున్నారు. ముఖ్యంగా ఆంటీబయాటిక్ సంబంధించిన అజిత్రోమైసిన్, పెయిన్ కిల్లర్ డైక్లో వంటి మందులు పూర్తిగానే లేనట్టు తెలుస్తున్నది. జ్వరాలు త్వరగా తగ్గాలంటే ఈ మందులే కీలకమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇవి అందుబాటులో లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క ఓపీ చూపించుకున్న రోగులు బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కుంటున్నారు.
ఓపీల్లో ప్రధాన వైద్యులు లేకుండానే రోగులను పరీక్షిస్తున్నారు. పీజీ విద్యార్థులే మేల్, ఫిమేల్ ఓపీ చూస్తున్నారు. ఆయా విభాగాలకు అధిపతులుగా ఉన్న ప్రధాన వైద్యులు ఎక్కడికి వెళ్లారని అడిగితే రౌండ్స్‌కు వెళ్లారని సిబ్బంది చెప్పారు. నిజానికి వార్డుల్లో కూడా సదరు వైద్యులు కనిపించ లేదు. ఈ సమయంలో అక్కడ నర్సులే వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ నిర్వహించాలని ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఉన్నా కొన్ని ఓపీలు మధ్యాహ్నం 12.30గంటలకే తాళం వేసి కనిపించాయి. రూం నంబర్ 121లో ఉన్న ఈఎన్టీ ఓపీకి తాళం వేసి ఉన్నది. ‘నమస్తే తెలంగాణ’ బృందం గమనించి ఫొటో తీయగా, వెంటనే అక్కడికి వచ్చిన సిబ్బంది మేడం ఇప్పుడే ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లారని, మళ్లీ వస్తారని చెప్పారు. తన కూతురు ఉమెరాకు చెవి నొప్పి రావడంతో వెంట తీసుకుని వచ్చిన రేష్మా మాత్రం.. ‘మేడం వెళ్లిపోయారు. రేపు వస్తారు’ అని ఇంతకు ముందే చెప్పారు కదా? అని సిబ్బందితో వాదనకు దిగారు. తాళం తీయగానే ఒక డాక్టర్ వచ్చి ఉమెరా చెవిని పరీక్షించారు. ఇక 120లోని దంత చికిత్స ఓపీలో కూడా ఇదే పరిస్థితి. డాక్టర్ ఎక్కడికి వెళ్లారంటే రౌండ్స్‌కు వెళ్లారని షరా మామూలుగానే సిబ్బంది చెప్పుకొచ్చారు. కేశవపట్నం నుంచి రౌతు సంగీత పంటి నొప్పితో బాధపడుతూ రాగా, డాక్టర్ లేరని రేపు రమ్మని సిబ్బంది చెప్పారు. ఇలా కొన్ని ఓపీల్లో సమయ పాలన లేక రోగులు ఇబ్బంది పడ్డారు.
జిల్లా దవాఖానలోని రూం నంబర్ 104లో నిర్వహిస్తున్న ఓపీ ల్యాబ్ రిజిస్ట్రేషన్ గందర గోళంగా మారింది. మేల్, ఫిమేల్కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌కు ఒకే కౌంటర్ ఏర్పాటు చేశారు. దీంతో మగవారితో మహిళలు పోటీ పడాల్సి వచ్చింది. పరీక్షించిన రిపోర్ట్స్ కూడా ఇదే కౌంటర్లో ఇస్తున్న కారణంగా ఇక్కడ రద్దీ బాగా ఉన్నది. రెండు రకాల సేవలు ఒకే చోట, అందులోనూ స్త్రీ, పురుషులకు రక్త, మూత్ర పరీక్షల నమూనాలు సేకరించడం కూ డా ఒకే చోట పెట్టడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా దేనికవే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నది. రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించడంలో కూడా ఆలస్యం జరుగుతున్నదని రోగులు వాపోతున్నారు. ప్రస్తుతం జ్వరాల సీజన్ అయినందున ప్లేట్ లెట్స్ (సీపీపీ), మలేరియా, వైడల్, డెంగ్యూ, చికున్ గున్యా వంటి పరీక్షలు తప్పని సరిగా చేయిస్తున్నారు. ల్యాబ్‌లో సిబ్బంది సరిపడా లేకపోవడం, ఉన్న కొందరు మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్న కారణంగా పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతున్నాయి. ల్యాబ్‌లో సిబ్బందిని పెంచాలని రోగులు కోరుతున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు మల్లి కొంరమ్మ. ఊరు చిగురుమామిడి మండలం రేకొండ. తలలో రక్తం గడ్డ కట్టి ఉండడం, హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం, మెడ నరాలు వీక్‌గా ఉండడం వంటి రోగాలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నది. చికిత్స కోసం మంగళవారం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. ఓపీ చూసిన డాక్టర్లు ఆమెకు నాలుగైదు రకాల గోలీలు రాశారు. ఫార్మసీకి వెళ్లి చీటీ చూపిస్తే కేవలం రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఆస్స్పీన్, బలానికి బీ కాంప్లెక్ మాత్రలు రెండు చేతిలో పెట్టి పంపించారు. మిగతా గోలీలు ఇవ్వరా..? అని అడిగితే ఇక్కడ లేవు బయట కొనుక్కోవాలని చెప్పారు. దీంతో కొంరమ్మ ‘నాలుగు రోగాలు ఉంటే రెండే గోలీలు ఇస్తరా’ అని ప్రశ్నించింది. ఇలా ఒక్క కొంరమ్మకే కాదు చాలా మంది రోగులకు అవసరమైన ట్యాబ్లెట్స్ అందలేదు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తున్నది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జన్నారం చంద్రయ్య. ఊరు కేశవపట్నం. ఈయనకు గతంలో పక్ష వాతం వచ్చింది. రెండు నెలలుగా ప్రభుత్వ దవాఖానకు వచ్చి వైద్యం చేయించుకుంటున్నాడు. సోమవారం తన కోడలిని వెంట తీసుకుకొచ్చాడు. రెండు మూడు రకాల గోలీలు ఇచ్చారు. కానీ, అవసరమైన బీపీ గోలీలు (టెల్మా-40 ఎంజీ) ఇవ్వలేదు. ‘రెండు నెలల నుంచి నా పరిస్థితి ఇదే. బీపీ గోలీలు లేవని అంటున్నరు’ అని చంద్రయ్య వాపోయాడు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో బీపీ పేషెంట్లు వచ్చి పరీక్షలైతే చేయించుకుంటున్నా మెడిసిన్ మాత్రం అందడం లేదు. బీపీ మాత్రలు రెండు నెలలుగా సీడీఎస్ నుంచే అలాట్ కావడం లేదని, టెల్మా-20 టాబ్లెట్స్ వస్తున్నాయని చెబుతున్నారు. కానీ, ఇవి కూడా రోగుల చేతికి అందడం లేదనే విమర్శలున్నాయి. ఈఎన్టీకి సంబంధిన మందులు కూడా నిండుకున్నాయి. చెవి నొప్పితో బాధపడుతూ మంచిర్యాల నుంచి వచ్చిన ఓ మహిళకు సైతం మాత్రలు లేవని, బయట కొనుక్కోవాలని చెప్పడంతో ఆమె నిరాశగా వెనుదిరిగింది.
మాది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట. నిన్ననే అచ్చిన. ఇంకా పెయ్యన్ని నొప్పులే ఉన్నయి. కాళ్లు ముడుసుకోవత్తలేదు. లేసెతానికి సాతనైత లేదు. కూసోవత్తలేదు. కాళ్లు, చేతులు ఈడ్సుకత్తన్నయ్. నిన్ననే మా అక్కతోని వచ్చి సెరీకైన. ఇయ్యల్లనే పొమ్మంటున్నరు. పాణం పురాంగ మంచిగ కాంది ఎట్లపోవాలే. పైసలు లేకనే ఈడికత్తిమి. ఎల్లిపొమ్మంటే ఏంజేసుడు.
– ఆర్నకొండ ఎల్లమ్మ, జ్వర పీడితురాలు
మాది మంచిర్యాల. చెవి నొప్పికి అక్కడ సర్కార్ దవాఖాన్ల చూయించుకున్న. ఇక్కడికి రాసిన్రు. ఇక్కడ ఓపీ చూయించుకున్న. మందులు రాసిన్రు. చీటీ పట్టుకుని మందులు ఇచ్చేకాడికి పోతే ఇవీ ఇక్కడ లేవు. బైట కొనుక్కోవాలని చెబుతున్నరు. పైసలు ఉంటే ఇవే మందులు మంచిర్యాలనే కొనుక్కోపోదునా..?
– రాజేశ్వరి, మంచిర్యాల
నెల రోజులుగా జ్వర పీడితులు విపరీతంగా వస్తున్నరు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. మందుల కొరత కొంత వరకు ఉన్నది. అయితే ఉన్నవాటిని సర్దుబాటు చేసి రోగులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. బయట మందులు ఎవరూ కొనడం లేదు. కొన్ని మందులు లేకున్నా ఇతర దవాఖానల నుంచి తెప్పించి ఇస్తున్నాం. దవాఖాన నిత్యం రోగులతో రద్దీగా ఉంటోంది. ఫివర్ వార్డులు నిండిపోతే ఇతర వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నాం. ఏ ఒక్క రోగికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం.
– డాక్టర్ గుండా వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్