విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో వణికిస్తున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, గోదావరిఖని దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఆయాచోట్ల పడకలు సరిపోక రోగులు ఇబ్బంది పడున్నారు. అయితే, ప్రత్యేకంగా మంచాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
పెద్దపల్లి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. మరోవైపు రోజురోజుకూ జ్వర పీడితులు పెరుగుతున్నారు. పెద్దపల్లి జిల్లా దవాఖాన, రామగుండం మెడికల్ కాలేజీ, మంథని, సుల్తానాబాద్ సామాజిక వైద్య శాలలతోపాటు జిల్లాలోని 17 రూరల్, 6 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతి రోజూ దాదాపుగా వెయ్యి మంది వరకు విషజ్వరాలకు సంబంధించిన రోగులు వస్తున్నారు.
దీంతో అక్కడ ఉన్న పడకలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో 100 పడకల దవాఖాన నిర్మాణ పనులు సాగుతుండగా.. తాత్కాలికంగా ఎంసీహెచ్‌లో ప్రత్యేకంగా బెడ్స్‌తోపాటు అదనంగా మంచాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్‌లో సైతం విషజ్వరాల పీడితుల సంఖ్య అధికంగానే ఉంటుండగా, రోగులు ఎక్కువగా మందులు రాయించుకొని ఇళ్లకు వెళ్తున్నారు.
పెరుగుతున్న బాధితులు
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణంగా ఓపీ పెరుగుతుండగా.. అందులో వైరల్ ఫీవర్స్‌కు సబంధించిన రోగుల సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది. దీంతో ప్రతి రోజూ దవాఖానలకు విషజ్వరాల బాధితుల తాకిడి అత్యధికంగా ఉంటున్నది. వైరల్ ఫీవర్స్‌కు సంబంధించిన బాధితుల సంఖ్య జిల్లా వ్యాప్తంగా వెయ్యికిపైగానే ఉంటున్నది. వాంతులు, విరేచనాలు, కొంత మందికి ప్లేట్ లెట్స్ తగ్గడం లాంటి కేసులు సైతం ఉన్నాయి. వానల కారణంగా గ్రామాల్లో పరిశుభ్రత లోపించి దోమలు, ఈగలు వ్యాప్తి చెందడంతోపాటు కలుషిత నీరు, శుభ్రతలేని ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే దవాఖానకు పరుగులు తీస్తున్నారు. అయితే అందుకనుగుణంగా సేవలందడం లేదని, ఇన్పెషేంట్లకు సరిపడా మంచాలు లేక ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తున్నది.
ఓపీకి తగ్గట్టుగా మంచాలు
పెద్దపల్లి జిల్లా దవాఖానను విస్తరిస్తున్నాం. వంద పడకల దవాఖాన పనులు వేగంగా జరుగుతున్నాయి. వర్షాకాలం కారణంగా కొంత ఓపీ పెరిగింది. అందులో వైరల్ ఫీవర్స్ బాధితులు ఎక్కువగానే ఉన్నారు. పడకలు తక్కువగా ఉన్నాయి. కానీ, ప్రత్యేకంగా మంచాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాం. వైద్యం అందించాకే, జబ్బు నయం అయ్యాకే ఇంటికి పంపుతున్నాం. ఏ ఒక్కరిని కూడా వెనక్కి పంపడం లేదు. దవాఖానలో మందులతోపాటు అన్ని పరీక్షలు ఉచితంగానే అందిస్తున్నాం.
– కొండా శ్రీధర్, పెద్దపల్లి జిల్లా దవాఖాన సూపరింటెండెంట్