Nregs | కరీంనగర్ కలెక్టరేట్,ఏప్రిల్ 26 : దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, నిర్వీర్యం చేసే పరంపర జిల్లాలో కొనసాగుతున్నది. ఇప్పటికే ఏటేటా ఈ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల సంఖ్యతో పాటు, కూలీలకు పనులు కల్పించేందుకు సవాలక్ష నిబంధనలు అమల్లోకి తెచ్చిన కేంద్రం, తాజాగా వారికి పని దినాల కల్పనలో భారీగా కోత విధించింది. దీంతో, జిల్లాలో గతేడాదికంటే సగం పని దినాలు తగ్గగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జాబ్ కార్డులు ఉన్న కూలీలందరికీ పని కల్పన గగనకుసుమమనే చర్చ అధికార వర్గాల్లో కొనసాగుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా కోత విధించిన నేపథ్యంలో జిల్లాకు కేవలం 14.17 లక్షల పనిదినాలను మాత్రమే కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 28 లక్షల 35 వేల పని దినాలు కల్పించేందుకు అనుమతించగా, 29.57 లక్షల పని దినాలు నమోదయ్యాయి.104 శాతం లక్ష్యాన్ని సాధించగా, 92,163 మంది కూలీలు పనులను సద్వినియోగం చేసుకున్నారు. లక్ష్యానికి మించి పనులు కల్పిస్తున్న నేపథ్యంలో, ఈసారి పనిదినాలు పెంచుతారనే ఆశతో కూలీలు, అధికారులు ఉండగా, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పని దినాల్లో భారీగా కత్తెర పెట్టడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు జరగటం లేదనే సాకుతో పని దినాలు తగ్గిస్తుండగా, జిల్లాలో లక్షకు పైగా ఉన్న క్రియాశీల కార్యకర్తలకు ఈసారి పూర్తిస్థాయిలో ఉపాధి లభిస్తుందా లేదా అన్న అయోమయం నెలకొంది.
రెండు నెలల్లో సగానికి పైగా పూర్తి చేసేలా లక్ష్యం
ఈ ఆర్థిక సంవత్సరం కేటాయించిన 14 లక్షల17వేల 500 పనిదినాలలో ఎప్రిల్లో 4.5 లక్షలు, మే నెలలో 5 లక్షల పనిదినాలు కల్పించేలా అధికారులకు లక్ష్యం విధించారు. మేనెల అంతా పనులు జరుగుతాయి. జూన్లో వ్యవసాయ పనులు ప్రారంభమైతే ఉపాధి పనులకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గుముఖం పట్టినా, నాలుగైదు నెలల్లోనే లక్ష్యం చేరుకునే అవకాశముంది. ఆ తర్వాత ఏడు నెలలు ఉపాధి పనులకు విరామం ఇస్తారా లేక సర్దుబాటు చేసి పనులు కల్పిస్తారా అన్నది తేలడం లేదు.
గతంలో లక్ష్యానికి మించి కూలీలు హాజరైతే పనిదినాలలో కొంత సర్దుబాటు చేసి అందరికీ పనులు కల్పిం చేవారు. కానీ, ఈ ఏడాది మాత్రం నిర్దేశించిన మేరకు మించి పనులు చేయించొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు అందాయి. దీంతో, డిమాండ్ ను బట్టి పని కల్పించడం కాకుండా, ఉన్న పని దినాలకు అనుగుణంగా మాత్రమే కూలీలకు పనులు సూచిస్తూ, పనులు కొనసాగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో, రాష్ట్రంలో ఉపాధి ఆధారిత పనిదినాలు తగ్గుతాయని, ఈ ప్రభావం కూలీలపై పడే అవకాశాలు మెండుగా ఉంటాయనే ఆందోళన వెల్లువెత్తుతున్నది.
పనిదినాలు తగ్గాయి : వేణుగోపాల్, డిఆర్డీవో
గతేడాది ఉపాధి హామీ పథకం కింద 29.57 లక్షల పనిదినాలు జరిగాయి. 104 శాతం పని దినాలు నమోదయ్యాయి. ఈసారి జిల్లాకు 14.17లక్షల పని దినాలు మాత్రమే కేటాయించారు. సగానికి సగం పనిదినాలు తగ్గాయి. రాబోయే నాలుగైదు నెలల్లో లక్ష్యం పూర్తవుతుంది