గ్రామీణ విద్యార్థులకు అక్షరజ్ఞానం పంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలలు.. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో విద్యాబోధనకు దూరమయ్యాయి. మూడు, నాలుగేండ్ల క్రితం వరకు పదుల సంఖ్యలో విద్యార్థులతో కళకళాడిన లచ్చక్కపేట, రంగసాగర్ స్కూళ్లు.. రెండేళ్లుగా పిల్లల ప్రవేశాలు లేవన్న సాకుతో మూతపడ్డాయి. ఇవే కాదు, తుంగూర్కు అనుబంధంగా ఉన్న కొత్తపేట, రంగపేటలోని బతుకమ్మకుంట ప్రాథమిక పాఠశాలు సైతం బంద్ అయ్యాయి. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోనే కాదు, జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలలు మూత పడినా పట్టించుకునే వారు కరువయ్యారు. ఆయా గ్రామాల నుంచి పిల్లలను ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నా.. అక్కడి బడులు తెరిపించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేయకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
– జగిత్యాల, జూన్ 14 (నమస్తే తెలంగాణ)/సారంగాపూర్
బీర్పూర్ మండలం మారుమూల, అటవీ మండలంగా పేరుగాంచింది. జిల్లాలో అక్షరాస్యత శాతం అతి తక్కువగా ఉన్న మండలాల్లో ఇదే మొదటిది. ఈ మండలంలోని రంగసాగర్ కూడా అటవీ గ్రామమే. ఇక్కడ 700 జనాభా ఉన్నది. గ్రామానికి అరకిలోమీటర్ దూరంలో విశాలమైన స్థలంలో గిరిజన ప్రాథమిక పాఠశాల ఉన్నది. ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేసేవారు. విద్యార్థులు సైతం ఏటా 50 నుంచి 60 మంది విద్యాభ్యాసం కోసం వచ్చేవారు. అయితే బడి గ్రామానికి కాస్తా దూరంగా ఉండడంతో క్రమంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గడం మొదలైంది. 2024 జూన్‌లో విద్యా సంవత్సరం ఆరంభం అయ్యాక విద్యార్థులు రావడం మానేశారు. ఇదే సాకు చూపి ఆ ఇద్దరు ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు డిప్యూటేషన్ చేశారు. దీంతో రెండేండ్లుగా రంగసాగర్ ప్రభుత్వ పాఠశాలలోను బోధన లేకుండాపోయింది.
సారంగాపూర్ మండలం లచ్చక్కపేట జనాభా 1200కు పైగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నడుస్తూ వచ్చింది. ప్రతి విద్యా సంవత్సరం 80 నుంచి 100 మంది పిల్లలు విద్యాభ్యాసం చేసేవారు. 2024 ఏప్రిల్ వరకు ఇద్దరు ఉపాధ్యాయులు, 60 మంది పిల్లలతో స్కూల్ నిర్వహించారు. భవనంతోపాటు ఇతర వసతులు సైతం మెరుగ్గానే ఉన్నా.. రెండేళ్ల క్రింతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు బదిలీపై, మరొకరు ప్రమోషన్‌పై వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గ్రామస్తులు మండల విద్యాధికారిని కలిసి వివరించగా, ఎంఈ వో స్పందించి ఒక ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై నియమించారు. ఒకే టీచర్ ఉండడం, ఆయ న రాకపోతే ప్రత్యామ్నాయం లేకపోవడం, అలా గే మధ్యాహ్న భోజనం ఇతర సౌకర్యాల విషయం లో ఇబ్బందులు ఏర్పడగా.. తల్లిదండ్రులు తమ పిల్లలను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగునూర్ పాఠశాలలో చేర్పించారు. మరికొందరు జగిత్యాలలోని ప్రైవేట్ పాఠశాలకు పంపించారు. దీంతో లచ్చక్కపేట పాఠశాలలో విద్యార్థులు లేకుండా పోయారు. పిల్లలు లేరన్న సాకుతో డిప్యూటేషన్‌పై నియమించిన ఉపాధ్యాయుడిని మరో చోటికి పంపించారు. సార్లు లేక, పిల్లలు రాక 2024లో లచ్చక్కపేట స్కూల్ మూతపడింది. రెండేళ్లుగా తెరుచుకోవడమే లేదు.
ప్రభుత్వ పాఠశాలను తెరిపించాలి
లచ్చక్కపేట ప్రభుత్వ పాఠశాల రెండేళ్లుగా మూతపడింది. పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులు, తరగతి గదులు ఉన్నయి. అధికారులు స్పందించాలి. గ్రామంలోని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. కనీసం ఈ సంవత్సరంలోనైనా ఉపాధ్యాయులను నియమించి మళ్లీ తెరిపించాలి.
– చెట్లపల్లి రమ, సర్పంచ్ (లచ్చక్కపేట )
యథావిధిగా నడిపించాలి
పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై వెళ్లారు. గ్రామానికి కొద్దిగా పాఠశాల దూరంగా ఉండడంతో విద్యార్థులు నడిచివెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. పాఠశాల మూతపడింది. గ్రామంలో కొద్ది రోజుల కిత్రం అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలను నడిపించేందుకు కృషి చేస్తున్నాం. పాఠశాలకు యథావిధిగా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించి పాఠశాలను నడిపించాలి.
– బోడ సాగర్, సర్పంచ్ (రంగసాగర్ )