Auto Overturn | తిమ్మాపూర్ రూరల్, ఆగస్ట్ 14 : తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామశివారులో ఓ ప్రయివేట్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్నఆటో అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం మన్నెంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు అదే గ్రామానికి చెందిన ఆటోలో రోజు తిమ్మాపూర్‌లోని ఓ ప్రయివేట్ పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఊరికి సమీపంలోకి రాగానే విద్యార్థులు ప్రయాణిస్తున్నఆటోకు కుక్క అడ్డు వచ్చింది.
ఆటోడ్రైవర్ ఆ కుక్కను తప్పించబోయే క్రమంలో ఆటో బోల్తా పడి కొద్ది దూరం వరకు రోడ్డుకు రాసుకుంటూ పోయింది. దీంతో ఆటోలో కుడివైపు కూర్చున్న నాంపల్లి హర్షవర్ధన్ (11)4వ తరగతి విద్యార్థి తల నేలకు రాసుకుంటూ వెళ్లింది. దీంతో విద్యార్థికి తలకు తీవ్రగాయాలు కాగా స్థానికులు వెంటనే అతన్ని కరీంనగర్ ఆస్పత్రి తరలించారు. విద్యార్థిని పరిశీలించిన డాక్టర్లు అప్పటికే హర్షవర్ధన్ మృతి చెందాడని తెలిపారు.
హర్షవర్ధన్ తల్లిదండ్రులు నాంపల్లి శ్రీనివాస్, సమత ఆసుపత్రికి చేరుకొని రోధించిన తీరు అందరిని కలచివేసింది. ఈ సంఘటన జరిగినప్పుడు మృతుడు విద్యార్థి హర్షవర్ధన్ అక్క కూడా తమ్ముడితో కలిసి అదే ఆటలో పాఠశాలకు వెళ్తొంది. తన కళ్ళ ముందే తమ్ముడు మృతి చెందడంతో ఆమె రోదనలు మిన్నంటాయి.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇతర విద్యార్థుల్లో కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు . ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ అనిల్‌ను ఎల్ఎండీ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.