HomeKarimnagarSchool Education Is Becoming Chaotic Due To Shortage Of Teachers
సరిపుచ్చితే ఎలా..?
పాఠశాల విద్య బోధకుల కొరతతో అస్తవ్యస్తంగా మారుతున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజులకే టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ ఇవ్వాల్సి ఉండగా, సగం విద్యాసంవత్సరం పూర్తయిన తర్వాత ఈ నెల 20న జారీ చేసింది.
ఇటీవలే ఉమ్మడి జిల్లాలో డీఈవోల ఉత్తర్వులతో కొంతమేర సర్దుబాటు
అప్పటికీ 25 శాతం స్కూళ్లలో బోధన సిబ్బంది లోటు
నాయకుల అండతో రిలీవ్కాని 72 మంది ఉపాధ్యాయులు
సగం విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత తేరుకున్న విద్యాశాఖ
సర్దుబాటుకు జీవో ఉత్తర్వులు.. అందులోనూ స్పష్టత కరువు
ఇబ్బందుల్లో హెచ్ఎంలు
వెంటనే సిబ్బందినైనా, వలంటీర్లనైనా ఇవ్వాలని విజ్ఞప్తులు
పాఠశాల విద్య అస్తవ్యస్తంగా మారుతున్నది. బోధకుల కొరతతో కొట్టుమిట్టాడుతుండగా, సగం విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత రాష్ట్ర విద్యాశాఖ తేరుకున్నది. పిల్లలున్నచోట ఉపాధ్యాయులు లేకపోవడం, టీచర్లు ఉన్న స్కూల్లో పిల్లలు లేకపోవడం, కనీసం వలంటీర్లను ఇవ్వకపోవడం వంటి కారణాలతో విద్యావ్యవస్థ గాడితప్పి విమర్శలు వెల్లువెత్తుతుండగా, టీచర్ల అడ్జస్ట్మెంట్కు ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సర్దుబాటు ప్రక్రియ నిర్వహించినా.. 25 శాతం స్కూళ్లలో బోధన సిబ్బంది లోటు కనిపిస్తున్నది.
అందులో 72 మంది టీచర్లు ప్రతిప్రతినిధులతో అండతో రిలీవ్కాకుండా దర్జాగా అక్కడే విధులు నిర్వర్తిస్తుండగా, అధికారులూ షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం, ప్రక్రియ అంతా రాజకీయమయం కావడం విమర్శలకు తావిస్తున్నది. మళ్లీ రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ అస్పష్టత ఉండడం, వందలాదిగా విద్యావలంటీర్లు అవసరం ఉన్నా ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతున్నది. ఈ ప్రభావం అంతా రిజల్ట్పై పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఖాళీలు భర్తీ చేయకుండా ఫలితాలకు తమను బాధ్యులను ఎలా చేస్తారన్న ప్రశ్న ఉపాధ్యాయుల్లో తలెత్తుతున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాఠశాల విద్య బోధకుల కొరతతో అస్తవ్యస్తంగా మారుతున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజులకే టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ ఇవ్వాల్సి ఉండగా, సగం విద్యాసంవత్సరం పూర్తయిన తర్వాత ఈ నెల 20న జారీ చేసింది. నిజానికి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయడంతో పాటు అధిక విద్యార్థులున్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని, లేదా విద్యా వలంటీర్లును నియమించాలని కోరుతూ అనేక వర్గాల నుంచి గతంలోనే ప్రభుత్వానికి విజప్తులు అందాయి. అయినా ప్రభుత్వం వాటిని లెక్క చేయలేదు.
ఈ నేపథ్యంలో స్థానికంగా వచ్చిన ఒత్తిళ్ల మేరకు డీఈవోలు ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సర్దుబాటు చేసినా, ఇంకా మెజార్టీ పాఠశాల్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్టు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి ఉమ్మడి జిల్లాలో 2,465 పాఠశాలలున్నాయి. వీటిలో కేవలం 68 శాతం బడుల్లో మాత్రమే పూర్తి స్థాయి బోధకులున్నారని, ఇంకా 32 శాతం బడుల్లో ఖాళీలు ఉండడం వల్ల బోధన సరిగా జరగడం లేదని ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. నిజానికి సర్దుబాటు చేసిన తర్వాత చూస్తే ఇంకా 25 శాతానికిపైగా బడుల్లో బోధకుల కొరత ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, విద్యావలంటీర్లను ఇవ్వాలని ఆయా పాఠశాలల హెచ్ఎంలతోపాటు ఉపాధ్యాయ సంఘాలు కొన్నాళ్లుగా మొర పెట్టుకుంటున్నాయి.
ఈ విషయంపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం, కేవలం మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు మాత్రమే విద్యా వలంటీర్లను నియమించుకోవడానికి అవకాశం ఇచ్చింది. నిజానికి క్షేత్రస్థాయి పరిస్థితులు చూసినా, లేదా ఉపాధ్యాయ వర్గాలు, ఆయా జిల్లాల మండల, విద్యాశాఖ కార్యాలయాల ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలో సుమారు 600కుపైగా విద్యా వలంటీర్ల పోస్టులు తక్షణం అవసరం ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తే సర్కారు బడుల్లో చదువులు సజావుగా సాగేవి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో మెజార్టీ పాఠశాలల్లో సబ్జెక్టు బోధించే వారు లేక చదువులు చతికిల పడుతున్నాయన్న ఆవేదన ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతున్నది.
రిలీవ్కాని వారిపై చర్యలేవి?
క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఆయా జిల్లాల్లో జిల్లా విద్యాధికారులు కలెక్టర్ల అనుమతితో టీచర్లను సర్దుబాటు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు ఉపాధ్యాయులు వాళ్లకు కేటాయించిన పాఠశాలల్లో చేరి విధులు నిర్వర్తిస్తుండగా, ఉమ్మడి జిల్లాలో 72 మంది టీచర్లు జిల్లా విద్యాధికారులు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసినట్లుగా తెలిసింది. ఉత్తర్వులు అందగానే అధికారపార్టీ నాయకుల వద్దకు వెళ్లి, వాళ్ల ఉత్తర్వులు నిలుపుచేసేలా డీఈవోలతో పాటు మండల విద్యాధికారులపై ఒత్తిళ్లు చేయించారు. దీంతో సర్దుబాటు పూర్తిస్థాయిలో చేయలేని పరిస్థితి ఏర్పడింది.
అయితే కొన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులకు మాత్రం అధికారులు షోకాజ్ నోటీసులు అందించి, ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని, తమకు ఏమీ కాదులే అన్న భరోసా వారిలో వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితులో ఉన్నాధికారులు కూడా వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. రాజకీయ నాయకులను కాదంటే, తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బందవుతుందోనన్న నిబంధనలు బేఖాతరు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ అవకాశాన్ని పరిగణలోకి తీసుకొని, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేసే అవకాశం ఆయా జిల్లా విద్యాశాఖాధికారులకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు ధిక్కరిస్తూ యథాస్థానంలో కొనసాగుతున్న ఉపాధ్యాయులను ముందుగా రిలీవ్ అయ్యేలా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలి. అలా జరిగితేనే విద్యార్థులకు కొంత మేరకైనా బోధన అందే అవకాశం ఉన్నది. ఇదే సమయంలో టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించుకునేందుకు ప్రభుత్వానికి వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉందని, అలా జరిగితే కనీసం ఇప్పటి నుంచైనా చదువులు సజావుగాసాగేందుకు అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.