మెట్పల్లి ప్రభుత్వ దవాఖానలో నిత్యాన్నదానం
చిన్నారులకు వేసవిలో శిక్షణ తరగతులు
అన్నార్తులకు మిగులు ఆహార పదార్థాల పంపిణీ
వేసవిలో చలివేంద్రం ఏర్పాటు
సామాజిక సేవలో సత్యసాయి సేవా సమితి సభ్యులు
సత్యసాయిసేవా సమితి సభ్యులు ఓ వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మరో వైపు సామాజిక సేవలో మునిగితేలుతున్నారు. మెట్పల్లి ప్రభుత్వ దవాఖానలో రోగుల సహాయకుల కోసం నిత్యాన్నదానం సత్రం నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండేండ్లు నిలిచిపోయిన నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఇటీవల మళ్లీ పునఃప్రారంభించారు. ఇక్కడ ప్రతి రోజూ మధ్యాహ్నం, సాయంత్రం దవాఖానలో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులకు కడుపు నిండా ఉచితంగా భోజనం పెడుతున్నారు. దాతలు అందించే ఆర్థిక సహాయంతో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మెట్పల్లి, జూలై 4 : ‘మానవ సేవే.. మాధవ సేవ’ అనే సూక్తిని అక్షరాలా నిజం చేస్తున్నారు మెట్పల్లి సత్యసాయి సేవా సమితి సభ్యులు. ఓ వైపు ఆధ్యాత్మిక సేవ.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖానలో నిత్యాన్నదానం ఏర్పాటు చేసి రోగుల సహాయకుల ఆకలి తీరుస్తున్నారు. వేసవిలో చలివేంద్రం, చిన్నారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుండడంతోపాటు ఫంక్షన్లలో మిగిలిన పదార్థాలను సేకరించి అభాగ్యులకు అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
మిగులు ఆహార పదార్థాల పంపిణీ..
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’అనే సూక్తిని ఆచరణలో పెడుతున్నారు సత్యసాయి సేవా సమితి సభ్యులు. శుభకార్యాలు, ఇతరత్రా ఫంక్షన్లలో మిగులు ఆహార పదార్థాలు (భోజనం) ఉన్నాయని సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి సేకరిస్తున్నారు. వాటిని తమ ఆటో ట్రాలీలో పేదలు, అనాథలు, యాచకులు ఉండే ప్రాంతాలకు తీసుకెళ్లి వారి కడుపు నింపుతున్నారు.
చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు..
వేసవి సెలవుల నేపథ్యంలో సత్యసాయి సమితి అనుబంధ విభాగం బాల వికాస్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా స్థానిక సత్యసాయి మందిరంలో వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇటీవల సుమారు పది రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. చిన్నారులకు యోగా, వ్యక్తిత్వ వికాసం, ప్రార్థన శ్లోకాలు, నీతి కథలు, స్పోకెన్ ఇంగ్లిష్, హనుమాన్ చాలీసా, చిత్రలేఖనం, క్విజ్తోపాటు మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సర్వమతాల సమానత్వం, సాంస్కృతిక ప్రదర్శనలు తదితర వాటిపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అదే విధంగా తల్లిదండ్రులు, గురువులకు ఇచ్చే గౌరవం, మన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన కల్పించారు.
సేవే సంతృప్తినిస్తుంది
ఆపదలో ఉన్నవారికి, పేదలు, అనాథలు, యాచకులకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది. సత్యసాయిబాబా ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. పిల్లల్లో మానసిక వికాసం, క్రమశిక్షణ, నైపుణ్యం పెంపొందించాలనే సదాశయంతో ఎండకాలంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా నిత్యాన్నదానం, వేసవిలో చలివేంద్రం ఏర్పాటు వంటి పలు కార్యక్రమాల నిర్వహణను మాధవ సేవగా భావిస్తున్నాం.
– బాస శ్రీనివాస్‌రావు, సత్యసాయిసేవా సమితి కోరుట్ల పట్టణ కన్వీనర్
మిగులు పదార్థాల సేకరణ
శుభకార్యాల్లో మిగిలిన ఆహార పదార్థాలను వృథా చేస్తారు. పేదలు, యాచకులు, అనాథలు, సంచార జీవులు అన్నం దొరకక ఆకలితో అలమటిస్తారు. అందుకే మిగిలిన పదార్థాలను వృథా కానివ్వకూడదనే ఉద్దేశంతో ఫంక్షన్ హాళ్లలో, పలు చోట్ల మిగులు పదార్థాలు ఉంటే సమాచార ఇవ్వాలని కోరుతున్నాం. ట్రాలీ ఆటో తీసుకెళ్లి మిగిలిన పదార్థాలు సేకరించి యాచకులు, అనాథలు, సంచార జీవులు ఉండే వివిధ కాలనీలకు వెళ్లి వాటిని అందజేస్తున్నాం.
– వాసాల శరత్చంద్ర, సత్యసాయి సేవా సమితి జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్