కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 21 : విద్యార్థుల ప్రయోజనాల కోసం శాతవాహన యూనివర్సిటీని రాష్ట్రంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా.. ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని, ఒక గురుకులంలా మార్చుకుందామని ఎస్‌యూ నూతన వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇది అందరి సహకారంతోనే సాధ్యమవుతుందని, అందుకు కలిసి కట్టుగా ముందుకు సాగుదామన్నారు. సోమవారం ఉదయం యూనివర్సిటీలోని ఆయన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య, కుటుంబసభ్యుల సమక్షంలో విధుల్లో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సీనియర్ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ పొందినా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు ఈసీ మెంబర్‌గా, బన్సీలాల్ స్టేట్ యూనివర్సిటీ, హర్యానా, గవర్నర్ నామినీ వ్యవహరిస్తున్నానని చెప్పారు. యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు తీసుకు రావడమే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. దీంతోపాటు ఇంజినీరింగ్ కళాశాలకు ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. అందుకు కావాల్సిన స్థలం మనకు అందుబాటులో ఉన్నదని తెలిపారు.
కొత్త కోర్సులు, విద్యార్థులకు ఉపయోగపడే జాబ్ ఓరియంటెడ్, మల్టీ డిసిప్లేనర్ కోర్సుల ప్రవేశానికి ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు. అందులో ఏ కోర్సు నుంచి ఏ కోర్సుకైనా వెళ్లేలా అవకాశం ఉంటుందన్నారు. అలాగే, బీఈడీ, ఎంఈడీ కళాశాలల ఏర్పాటు విషయం కూడా పరిశీలిస్తామన్నారు. తాను రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలో యూనివర్సిటీలో స్నాతకోత్సవం నిర్వహించామని, గవర్నర్, చాన్స్‌లర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించి రెండో స్నాతకోత్సవం నిర్వహించుకుందామన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ సమస్యలను పలువురు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఇక్కడ రిజిస్ట్రార్ ఎం వరప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై కిశోర్, ప్రసాద్, పరీక్షల నియంత్రణాధికారి ఎన్వీ శ్రీరంగ ప్రసాద్, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎండీ జాఫర్ జారీ, యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ డీ హరికాంత్, యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జయంతి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత పలు కళాశాలల చైర్మన్లు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు వీసీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.