Sarvai Papanna Jayanti | సిరిసిల్ల టౌన్, ఆగస్టు 18: సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నర్సింగ్ కళాశాల వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం అని కొనియాడారు. పాపన్న ఆశయ సాధన కోసం నేటి యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్, జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణ గౌడ్, గౌడ సంఘం అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.