Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 20 : జిల్లాలో చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే తప్ప వాటి సంరక్షణ చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో బృహత్తరమైన ఈ కార్యక్రమం స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాటు నిరాటంకంగా కొనసాగగా, రెండేళ్ల నుంచి మొక్కుబడిగా మాత్రమే చేపడుతుండటం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. నిర్దేశించిన మేరకు మొక్కలు నాటడమే గగనం అవుతుండగా, నాటిన వాటిని రక్షించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
వర్షాకాలం ఆరంభంలోనే చేపట్టాల్సిన వనమహోత్సవం ఈసారి ఆలస్యంగా ప్రారంభించిన, నాటిన మొక్కల పెంపకం బాధ్యతలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనే ఆగ్రహం పెళ్ళు బికుతున్నది. మొక్కలు నాటిన వెంటనే ట్రీగార్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, పట్టించుకోకపోవటం వెనుక అధికార యంత్రాంగం పర్యవేక్షణ కొరవడమేననే విమర్శలు తీవ్రమవుతున్నాయి. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న ముసురు వర్షాలతో జిల్లాలో 8,98,513 మొక్కలు నాటినట్లు అధికార యంత్రాంగం పేర్కొంటుండగా, కనీసం ఒకశాతం మొక్కలకు కూడా ట్రీ గార్డులు ఏర్పాటు చేయలేదని తెలుస్తున్నది. సపోర్టుగా కర్రలు పాతి చేతులు దులుపుకుంటుండగా, నాటిన మొక్కలు జంతువులకు మేతగా మారుతున్నాయి.
మరికొన్ని ఎండిపోతున్నాయి. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటకుండా అలాగే వదిలేస్తుండగా, వన మహోత్సవం మూన్నాళ్ళ ముచ్చటగా మారుతుందని ప్రజలు మండిపడుతున్నారు. పేరుకే అన్నట్లుగా కొనసాగుతున్న మొక్కలు నాటే కార్యక్రమంతో జిల్లాలో అటవీ శాతం పెంపు లక్ష్యం కాగితాల్లోనే మగ్గుతోందనే చర్చ కొనసాగుతున్నది.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో హరిత విప్లవం
సీమాంధ్రుల పాలనలో తెలంగాణలో తగ్గిన అటవీ విస్తీర్ణాన్ని, స్వరాష్ట్రంలో పెంపొందించే దిశగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నడుం బిగించింది. 2015 నుంచి హరితహారం కార్యక్రమం పేర మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు అంకురార్పణ చేసింది. ప్రజాప్రతినిధులతో పాటు అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేసింది. యజ్ఞంలా కొనసాగించిన హరితహారం వరుసగా తొమ్మిదేళ్లపాటు నిర్విరామంగా ఏటా వర్షాకాలం ఆరంభంలో మొదలై మూడు నెలల వరకు కొనసాగించి, తెలంగాణలో హరిత విప్లవానికి నాంది పలికింది. మైదాన ప్రాంతాలతో పాటు రోడ్ల కిరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల్లో, వ్యవసాయ భూముల్లో, కాలువ గట్లు, చెరువు కట్టలపై కూడా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వ శాఖలకు జిల్లా యంత్రాంగం అప్పగించేది. మొక్కలు నాటిన వెంటనే ట్రీ గార్డులను అమర్చడం, నిత్యం నీరందించడంలాంటి పనులు గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు చూసుకునేవారు.
నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేసి, నిరంతరం పర్యవేక్షణ చేసేవారు. అనుమతులు లేకుండా హరితహారం మొక్కలు నరికే వారిపై చర్యలు కూడా తీసుకోవడంతో ఏపుగా పెరుగుతుండేవి. తద్వారా మైదానాలను తలపించిన అటవీ ప్రాంతం పూర్వ వైభవాన్ని సంతరించుకోగా, కాలుష్య శాతం సైతం క్రమేపి తగ్గింది. రహదారుల చుట్టూ నాటిన మొక్కలు మానులై రోడ్లకు తోరణాలుగా మారాయి. 2014 ముందు జిల్లాలో నామమాత్రానికే పరిమితమైన అటవీ విస్తీర్ణం, గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన హరితహారం కార్యక్రమం మూలంగా అనూహ్యంగా పెరిగింది.
అయితే, గతేడాది నుంచి మాత్రం మొక్కలు నాటడం లెక్కలకే పరిమితం కాగా, నాటిన వాటి సంరక్షణలో పట్టింపులేనట్లు వ్యవహరిస్తుండటంతో, అటవీ శాతం పెంపు లక్ష్యం మళ్లీ మొదటికొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పర్యావరణ పరిరక్షకులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, నాటిన మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి, వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.