Financial support | ధర్మపురి, జూన్ 23: ట్రిపుల్ఐటీ బాసరలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తల్లిదండ్రులు లేని ఓ పేదింటి విద్యార్థిణి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చదువును మద్యలోనే అపివేసే పరిస్థితికి వచ్చింది. కానీ ఆ చదువుల తల్లికి ధర్మపురి ఎస్ఏపీ(స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం)సభ్యులు అండగా నిలిచారు. ట్రిపుల్ ఐటీలో ఆమె బీటెక్ చదువు పూర్తిచేసే వరకు అయ్యే ఖర్చు డబ్బులను సమకూరుస్తామని ముందుకువచ్చారు. బీర్పూర్ గ్రామానికి చెందిన గుండ నందిని ట్రిపుల్ ఐటి బాసరలో సీటు సాధించి ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో చదువును కొనసాగించలేని స్థితిలో ఉండగా.. బీర్పూర్ పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు ఆ విద్యార్థి పరిస్థితిని ధర్మపురికి చెందిన స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రామ్(ఎస్ఏపీ) కన్వీసర్ డాక్టర్ గొల్లపెల్లి గణేశ్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎస్ఏపీ నందిని చదువును దత్తత తీసుకోగా ధర్మపురికి చెందిన ఎన్నారైలు కొరిడె ఈశ్వర్, కొరిడె సాయి లు విద్యార్థికి అయ్యే ఖర్చు సంవత్సరానికి రూ.15వేల చొప్పున (5సంవత్సరాలు) చెల్లించడానికి ముందుకువచ్చారు.
వారు ఒప్పుకున్న ఐదు సంవత్సరాల్లో మొదటి సంవత్సరానికి గానూ రూ.15వేలను సోమవారం ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ సంగనబట్ల సీతాలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నందని ఎస్ఏపీ కన్వీనర్, దాతలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎస్ఏపీ కన్వీనర్ డాక్టర్ గొల్లపెల్లి గణేశ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెండ్యాల మహేందర్, బీర్పూర్ పాఠశాల పీడీ మంజుల తదితరులున్నారు.