Minister Adluri | ధర్మారం,ఆగస్టు22: తరచూ ఎక్కడికి వెళ్ళిన జైశ్రీరామ్.. జైశ్రీరామ్.. అని నినదించే కేంద్రమంత్రి బండి సంజయ్ అదే నినాదస్ఫూర్తితో కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన యూరియా తీసుకువచ్చి రైతులకు ఎందుకు మేలు చేయడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించారు. ధర్మారంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్ర నూతన భవనం, కస్తూరిబా బాలికల పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియాను తెప్పించడంలో పూర్తిగా విప్లవైనట్లు ఆయన ధ్వజమెత్తారు. ఇద్దరు మంత్రుల వలన రైతులకు జరిగిన మేలు ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఎక్కడికి వెళ్ళినా మతం పేరుతో జైశ్రీరామ్ అని జపించే కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రం రైతులు సరిపడా యూరియా లేకపోవడంతో వారు అరిగోస పడుతున్నా.. ఆయన మాత్రం పట్టించుకోవడంలేదని లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. తీరా తమ ప్రభుత్వంపైనే కేంద్ర బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రం యూరియా విషయంలో పనికిరాని ఆరోపణలు చేస్తూ రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
రైతుల మద్దతుతో ఎన్నుకోబడిన తమ ప్రభుత్వం అదే రైతులకు అన్ని విధాలుగా సహాయపడాలని ముఖ్యంగా యూరియా సరిపడా అందించాలని సంకల్పం తమకు ఉంటుందని విషయాన్ని కేంద్ర మంత్రులు గమనించాలని ఆయన హితవు పలికారు. తమ ప్రభుత్వం పూర్తిగా రైతులకు అండగా ఉంటుందని విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటాను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడంలో ఇద్దరు కేంద్ర మంత్రులు పూర్తిగా విఫలమైనారని ఆయన విమర్శించారు. రైతులపై ఆ ఇద్దరు మంత్రులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రాష్ట్రానికి రావలసిన యూరియా వాటాను తెప్పించాలని లక్ష్మణ్ కుమార్ వారికి సూచించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాదులో ఉండి మాట్లాడడం కాకుండా పల్లెలకు వచ్చి రైతుల పరిస్థితిని గమనిస్తే వారి కష్టాలు తెలుస్తాయని లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి సరిపడ యూరియా తెప్పించి రైతుల ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతరం ధర్మారం ప్రాథమిక పాఠశాల, కస్తూర్బా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. కస్తూరిబా పాఠశాల లో చదువుతున్న బాలికలతో లక్ష్మణ్ కుమార్ మాట మంతి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య పెద్దపల్లి డిపిఓ వీర బుచ్చయ్య, ఎంపీడీవో అయినాల ప్రవీణ్ కుమార్, ఎంఈఓ పోతు ప్రభాకర్, కస్తూరిబా పాఠశాల ప్రత్యేక అధికారి శోభ, స్థానిక ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ మల్లారెడ్డి, అంగన్వాడీ టీచర్ దేవి కళావతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగ్గిరెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ కొడారి హనుమయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆశోద అజయ్ కుమార్, ధర్మారం మండల శాఖ అధ్యక్షుడు సోగాల తిరుపతి, పార్టీ నాయకుడు చింతల ప్రదీప్ రెడ్డి, దాగేటి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.