కార్పొరేషన్, మార్చి 26 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. బీఆర్టీయూ అనుబంధ సంఘం కరీంనగర్ మున్సిపల్ వరర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నగరపాలక సంస్థ నుంచి కార్మికులతో భారీ ర్యాలీ తీసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షుడు ఎల్ రూప్సింగ్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు నెలకు 26వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికులకు ఐటీ విధించకుండా చూడాలన్నారు.
నెలకు కనీసం 12చీపుర్లు ఇవ్వాలని, 60ఏండ్లు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలని కోరారు. జవాన్ల అరాచకాలను అరికట్టాలని, కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లలో వెంటనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిషరించకుంటే రాబోయే రోజుల్లో సమ్మెబాట పడుతామని హెచ్చరించారు. నగరపాలక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగికి శానిటేషన్ బాధ్యతలు అప్పగించడంతో, ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. అతడిని బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రావు రాజమల్లయ్య, నాయకులు గడ్డం సంపత్, పొన్నం లింగయ్య, కోనేటి సమ్మయ్య, మైలారం మంజుల, కాడ చంద్రకళ, గాలి రాజేశ్వరి, పద్మ, భద్ర, రవి పాల్గొన్నారు.