గోదావరిఖని సమీపంలోని గోదావరినదిలో ఇసుక తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా తోడేస్తున్నాయి. భారీగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. స్థానిక అవసరాలకు ఇసుక తీసుకునే వెసలుబాటును అక్రమారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు. ఓవైపు స్థానిక అవసరాలకు అధిక ధరలకు విక్రయిస్తూనే, మరోవైపు రాత్రి వేళల్లో లారీలు, టిప్పర్లతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీనికి తోడు మరికొంతమంది నదిలోనే అనధికారికంగా క్వారీలు ఏర్పాటు చేసి వసూళ్లకు దిగుతున్నారు. ఈ దందా మొత్తం రూ.లక్షల్లో సాగుతున్నా.. మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, పైగా అక్రమార్కులకే వంత పాడుతున్నారనే ఆరోపణలున్నాయి.
పెద్దపల్లి, మే 6 (నమస్తే తెలంగాణ): గోదావరిఖని మల్కాపూర్ రోడ్‌లోని గోదావరి నదీతీరం వద్ద అనధికారికంగా క్వారీలు నిర్వహిస్తున్నారు. నిత్యం ఇక్కడి నుంచి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను ఎంపిక చేసుకొని, ఒక్కో చోట 50 ట్రిప్పుల వరకు ఇసుక నిల్వ చేస్తున్నారు. దీంతో కార్పొరేషన్ పరిధిలోని మల్కాపూర్, మేడిపల్లి, ప్రగతి కాలనీ, సప్తగిరి కాలనీ, మార్కండేయ కాలనీ, తిలక్‌నగర్, విఠల్‌నగర్‌లోని పలు ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని రహస్య ప్రాంతాల్లోనూ ఇసుక డంప్‌లు కనిపిస్తున్నాయి.
మల్కాపూర్ రోడ్డుకు ఎప్పుడు వెళ్లినా.. నిత్యం వందల ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తూనే ఉంటున్నాయి. ప్రతిరోజూ తెల్లవారు జామునుంచి మొదలయ్యే ఈ ఇసుక తవ్వకం, తరలింపు అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. అనధికారిక క్వారీల వద్ద ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతి రోజూ 150 ట్రాక్టర్లు ఒక్కొక్కటి 3 నుంచి 4 ట్రిప్పుల ఇసుక తరలిస్తుండగా, ఈ అక్రమ వ్యాపారం రూ.లక్షల్లో సాగుతున్నట్టు తెలిసింది. మరోవైపు ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఎవరు ఇసుక కావాలన్నా.. వారికి రూ.1200 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. ఇలా తరలిస్తున్న ఇసుకతో అక్రమార్కులు లక్షలు సంపాదిస్తున్నా.. ప్రభుత్వానికి మాత్రం ఒక్కరూపాయి కూడా ఆదాయం రావడం లేదు.

రాత్రి హైదరాబాద్‌కు
పగలంతా డంప్ చేస్తున్న ఇసుకను ప్రతిరోజూ రాత్రి లారీలు, టిప్పర్లలో ఎక్స్కవేటర్లతో లోడింగ్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి లోడింగ్ ప్రారంభించి, తమ అనుచరుల ఎస్కార్ట్‌తో సరిహద్దులు దాటిస్తున్నారు. నిత్యం 5 నుంచి 10 లోడ్లు హైదరాబాద్ తరలిస్తూ, ఒక్కో లోడ్‌కు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. స్థానిక చోటా నాయకులు, ట్రాక్టర్ యజమానులు ఇసుక మాఫియాకు పూర్తిగా తెలుస్తున్నది.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి
గోదావరి తీరం నుంచి ప్రతిరోజూ వందల ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా అవుతున్నది. కానీ, ప్రభుత్వానికి మాత్రం ఒక్క రూపాయి కూడా ఆదాయం రావడం లేదు. అక్రమ రవాణాకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి. ప్రైవేట్‌గా వసూళ్లను నిలిపివేసి ప్రభుత్వం లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు వసూలు చేయాలి. అలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వనరులు కొల్లగొట్టకుండా చర్యలు చేపట్టాలి. హైదరాబాద్‌కు ఇసుక తరలకుండా అధికారులు అడ్డుకట్ట వేయాలి.
– తాళ్ల చిన్నరాజయ్య, కార్పొరేటర్ (రామగుండం)