ముస్తాబాద్/ సిరిసిల్ల తెలంగాణ చౌక్, జూన్ 26: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. నిబంధనలకు విరుద్ధంగా సిరిసిల్లలోని మానేరు వాగు, వేములవాడలోని మూలవాగుల్లో తవ్వుతున్నది. నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నది. ఓవైపు ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రజలు అవస్థలు పడుతుంటే.. మరోవైపు కట్టడి చేసేందుకు వచ్చిన అధికారులపై దాడులకు తెగబడుతున్నది. శనివారం వేములవాడలో ప్రజలందరూ చూస్తుండగానే ఓ మైనింగ్ అధికారిపై డ్రైవర్ దాడికి యత్నించగా, రెండు రోజుల క్రితం నామాపూర్ శివారులో ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న ఓ కానిస్టేబుల్‌ను హతమార్చేందుకు యత్నించింది.
ట్రాక్టర్ ఇంజిన్ బానెట్‌పై కూర్చున్న కానిస్టేబుల్‌ను వాహనంతోసహా చెరువులో పడేసేందుకు డ్రైవర్ యత్నించగా.. పసిగట్టిన కానిస్టేబుల్ దూకడంతో గాయాలు కాగా.. ట్రాక్టర్ చెరువులో పడిపోయింది. ఈ ఘటన భ యోత్పాతం కలిగించగా.. ఇసుక మాఫియా బరితెగింపుపై జిల్లా అధికారులు సీరియస్ అయ్యారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రంగంలోకి దిగి, ఎగువ మానేరు వాగు పరిసర గ్రామాల నుంచి ఇసుక అక్రమ మార్గాలకు చెక్ పెట్టాలని, కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ముస్తాబాద్ తహసీల్దార్ సురేశ్‌కుమార్‌ను బుధవారం ఆదేశించారు. దీంతో తహసీల్దార్‌తోపాటు రెవెన్యూ అధికారులు, పోలీసులు రామలక్ష్మణపల్లె, కొండాపూర్ గ్రామాల శివారులోని మా నేరు వాగు ఒడ్డు పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వాగు నుంచి ఇసుక తరలించకుండా రహదారులకు అడ్డుకట్ట వేశారు. మార్గాల్లో జేసీబీలతో కందకాలు తీయించి ట్రాక్టర్లు వెళ్లకుండా చేశారు. ఇటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు చేశారు. ముస్తాబాద్, ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తనిఖీ నిర్వహించగా ఎనిమిది వాహనాలను సీజ్‌చేసి, 12మందిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 163 మందిపై కేసులు నమోదు చేసి, 161 వాహనాలను సీజ్ చేశారు. కాగా తరుచూ అక్రమ రవాణాకు పాల్పతున్న 14కేసుల్లో 21మందిని రిమాండ్‌కు తరలించారు.
ప్రభుత్వ నిబంధలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిని ఉపేక్షించేది లేదు. జిల్లా వ్యాప్తంగా కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం. ఇసుక దందాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న వ్యక్తులపై చర్యలు తప్పవు. రెండు సార్లకన్నా ఎక్కువ సార్లు పట్టుపడితే వాహనాలు జప్తు చేస్తాం. కఠినమైన చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ పనుల కోసం సబ్సిడీ తీసుకున్న ట్రాక్టర్లు ఇసుక రవాణా చేయద్దు. పట్టుపడితే ట్రాక్టర్లను సీజ్ చేసి, సబ్సిడీ రద్దుకు సిఫారసు చేస్తాం. అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారమున్న వెంటనే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురండి. దాడులను సహించం. శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం.
-అఖిల్ మహాజన్, సిరిసిల్ల ఎస్పీ