యూరియా కోసం నెల రోజులుగా రైతులకు తిప్పలు తప్పడం లేదు. సింగిల్ విండో కార్యాలయాలు, గోదాంల వద్దకు ఉదయమే వచ్చి క్యూలో పడిగాపులు కాయడం.. దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరగడం నిత్యకృత్యమైంది. శనివారం సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండలాల్లో యూరియా కోసం అవస్థలు పడ్డారు. ఆధార్ కార్డులు, పాస్‌బుక్ జిరాక్సులు, చెప్పులు క్యూలో పెట్టి పొద్దంతా నిరీక్షించినా దొరకకపోవడంతో ఆవేదనతో ఇంటిదారి పట్టారు. కొన్ని చోట్ల ఆగ్రహించిన రైతులు రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు.
మంథనిలో రైతన్న ఆగ్రహజ్వాల
మంథని, ఆగస్టు 30: మంథనిలో యూరియా కొరత, పంపిణీలో నిర్లక్ష్యంపై రైతులు భగ్గుమన్నారు. ఈ ప్రాంతానికి చెందిన రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుండడంతో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ శనివారం పాత పెట్రోల్ పంపు చౌరస్తాలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్లి నిర్వాహకుడితో మాట్లాడారు. సెంటర్లో 110 బస్తాలున్నట్లు గుర్తించామని, అయితే..
టోకెన్లు తీసుకున్న 40 మందికి 70 బస్తాలు ఇస్తామంటున్నారని, అంటే మిగిలిన 40 బస్తాల మాటేమిటని నిర్వాహకుడు, అధికారులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు యూరియా ఇచ్చే వరకు ఊరుకునే ప్రసక్తే లేదంటూ పాత పెట్రోల్ పంపు చౌరస్తాలో రైతులతో కలిసి బైఠాయించారు. పక్కనే ఉన్న వినాయక విగ్రహాల తయారీ కేంద్రం నుంచి ఒక ప్రతిమను తీసుకువచ్చి రోడ్డుపై పెట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
‘గణపతి బప్పా మోరియా.. కావాలయా యూరియా’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. పోలీసులు వచ్చి రైతులు, బీఆర్ఎస్ నాయకులను అక్కడి నుంచి లేపే ప్రయత్నం చేయగా, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బస్తాలన్నీ పంపిణీ చేసేదాకా ధర్నా విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో వ్యవసాయాధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో పుట్ట మధు సహా అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, యూరియా ఇవ్వడంలో అధికారులు ఇబ్బందులు పెట్టగా, విషయం తెలుసుకొని పుట్ట మధూకర్ క్షణాల్లోనే అక్కడికి వచ్చారు. అధికారులు, నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి, వారితో మాట్లాడి యూరియా ఇప్పించారు.
కాంగ్రెస్ సర్కారు ఎక్కువ కాలం ఉండదు
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
‘ఎద్దు ఏడ్చిన ఏవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడ్డది లేదు. ఇప్పుడు రైతును కన్నీళ్లు పెట్టించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని’ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంథనిలోని పాత పెట్రోల్ పంపు చౌరస్తాలో రైతులతో కలిసి ఆందోళన చేసి మాట్లాడారు. మంత్రి శుక్రవారం మంథనికి వస్తున్నాడంటే యూరియా బస్తాలు వస్తాయని అనుకున్నామన్నారు. కానీ, ఆయన వేల మంది పోలీస్ పహారాలో వచ్చి రైతులను కలువకుండా, వారి గోస వినకుండా మీటింగ్‌లు పెట్టుకుని వెళ్లిపోయాడన్నారు.
సొసైటీలకు వచ్చిన బస్తాలు పూర్తిగా రైతులకు పంపిణీ చేయడం లేదని, మిగిలిన బస్తాలను రాత్రికి రాత్రి కాంగ్రెస్ నాయకులకు ఇస్తే వాళ్లు బ్లాక్ మారెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కల్వచర్లలో అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాలు దొరికాయన్నారు. రైతు సేవా కేంద్రంలో జరిగిన వ్యవహారానికి మంథని ఎస్ఐ ప్రత్యక్ష సాక్షి అని, ఆయన ముందే నిర్ధారణ అయిందన్నారు. మంత్రి ఇలాకాలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడడం నిజంగా సిగ్గు చేటన్నారు. రైతుల కోసం ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమేనని, ఎన్ని కేసులైనా భరిస్తామన్నారు.
శంకరపట్నంలో అదే తండ్లాట
శంకరపట్నం, ఆగస్టు 30: యూరియా బస్తాల కోసం శంకరపట్నం మండలంలో రైతులు తండ్లాడాల్సి వస్తున్నది. శనివారం ఉదయం పూట గద్దపాక, తాడికల్ సింగిల్ విండో కార్యాలయాలకు 340 బస్తాల చొప్పున ఒక్కో లారీ లోడ్ రాగా, రెండు చోట్ల పురుషులతో పాటు మహిళా రైతులు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు. వ్యవసాయ అధికారుల సమక్షంలో విండోల సిబ్బంది ఒకటి, రెండు చొప్పున యూరియా బస్తాలు అందజేశారు. కాగా, రెండు చోట్ల చాలా మందికి యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
చెర్లభూత్కూర్‌లో రోడ్డెక్కిన రైతులు
కరీంనగర్ రూరల్, ఆగస్టు 30 : యూరియా కోసం మండలంలోని చెర్లభూత్కూర్‌లో రోడ్డెక్కి ధర్నా చేశారు. ఉదయం 5 గంటల నుంచి స్థానిక సింగిల్ విండో గోదాం వద్ద క్యూలైన్లో పాసుపుస్తకాలు పెట్టి ఎదురు చూశారు. అధికారులు 10గంటల వరకు కూడా రాకపోవడంతో రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. అనంతరం వచ్చిన ఏఈవో సుచరిత సోమవారం ఇచ్చిన వారి పాసుపుస్తకాలు పేర్లు చదువాలని, అందరూ క్యూ పాటించాలని సిబ్బందికి సూచించారు. పేర్లు చదువుతున్న సమయంలో రైతుల మధ్య తోపులాట జరగడం గొడవకు దారి తీసింది. ఇరువర్గాలను స్థానికులు శాంతింపజేశారు. పోలీసులు సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా పోలీసు పహారాలో బస్తాలు పంపిణీ చేశారు.
ధర్మారంలో పడిగాపులు
ధర్మారం, ఆగస్టు 30: ధర్మారం మండల కేంద్రంలోని సింగిల్ విండో గోదాం వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రతిరోజూ వచ్చి క్యూలో నిలబడుతున్నా సరిపడా యూరియా దొరక్కపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. శుక్రవారం 340 యూరియా బస్తాలు రాగా, 500కు పైబడి రైతులు వచ్చారు. 170 మంది మాత్రమే ఇవ్వడంతా మిగతా వారంతా వెనుదిరిగి, మళ్లీ శనివారం ఉదయమే వచ్చారు. వారితోపాటు కొత్తగా మరింత మంది రావడంతో బారులు తీరి నిల్చున్నారు. అయితే, గోదాంకు కేవలం 270 బస్తాలు మాత్రమే రాగా 148 మంది రైతులకు పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. తమ పేర్లు పిలుస్తారని ఉదయం నుంచి సాయంత్రం దాకా వేచి చూసి చాలా మంది తీవ్ర నిరాశతో ఇండ్లకు వెళ్లిపోయారు.
తిరుగుడే అయితంది..
యూరియా కోసం ప్రతి రోజూ తిరుగుడే అయితంది. ఆ షాపు కాడికి పోతే, ఈ షాపు కాడికి రమ్ముంటున్నారు. ఇవాల, రేపు, ఎల్లుండి వస్తయ్.. అంటూ చెప్పుకుంటూ తిప్పించుకుంటున్నరు. నేను నాలుగెకరాల్లో నాటు వేసిన. యూరియా చల్లే టైం దాటుతంది. కానీ ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు. ఈ యేడు పంట పండుతదో.. లేదో తెలుస్తలేదు. యూరియా ఇస్తనే చేతికస్తది. లేదంటే మునుగుడే.
– రాజయ్య, రైతు, ఎక్లాస్పూర్, మంథని
కురిక్యాలలో ముప్పు తిప్పలు
గంగాధర, ఆగస్టు 30 : మండలంలోని కురిక్యాలలో రైతులు ముప్పు తిప్పలు పడ్డారు. వ్యవసాయ పనులు వదులుకుని, చిన్నపిల్లలతో ఉదయం 6 గంటల నుంచే సొసైటీ వద్ద పడిగాపులు కాశారు. సొసైటీకి 350 బస్తాలు మాత్రమే రావడంతో ఎగబడ్డారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. అయినా, కొందరికి దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. 00
మనుమడితో పడిగాపులు
..ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కనుకవ్వ. గంగాధర మండలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన ఈమెకు గ్రామంలో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. యూరియా బస్తాల కోసం పది రోజులుగా కురిక్యాల సొసైటీకి వస్తోంది. యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకుని శనివారం ఉదయం 6 గంటలకే తన మనుమడిని తీసుకుని వచ్చింది. పది రోజుగా తిరుగుతుంటే రెండు బస్తాలే ఇచ్చారని కనుకవ్వ తెలిపింది. 10 రోజుల సంది కైకిలి లాస్ అయ్యానని, ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో మనుమడిని తీసుకుని వచ్చినట్లు చెప్పింది. ఇలా ఒక కనుకవ్వనే కాదు.. చాలా మంది మహిళలు సొసైటీల వద్ద రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు.
– గంగాధర, ఆగస్టు 30
అరిగోస పెడుతున్నరు.
నాకు, నా కొడుక్కి కలిపి ఊళ్ల్లె 10 ఎకరాల భూమి ఉంది. మొత్తం వరి పెట్టినం. తీగలగుట్టపల్లి డీసీఎంఎస్ షాపుల మా పాసు పుస్తకాలు ఇచ్చి నాలుగు రోజులైతంది. ఇయ్యాల యూరియా వస్తదంటే పొద్దుగాలనే వచ్చినం. రోజంతా పడిగాపులు గాసినా ఒక్క బస్తా ఇయ్యలే. టైం దాటిపోతంది. యూరియా చల్లకుంటే పంట ఎట్ల బతుకుతది. గత ప్రభుత్వంలో ఇసోంటి పరిస్థితిని ఎన్నడూ చూడలే. పంటకు మూడు దఫాలుగా సరిపడా యూరియా ఇచ్చిన్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అరిగోస పెడుతున్నరు. మొదటి దఫాలోనే చుక్కలు చూపిస్తున్నరు. రోడ్డెక్కించిన్రు. ఇప్పటికైనా రైతుల గురించి పట్టించుకొని సరిపడా స్టాక్ తెప్పించాలె. – కూర అమరేందర్‌రెడ్డి, రైతు (చెర్లభూత్కూర్)
15 రోజుల నుంచి తిరుగుతున్న
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవుసం చేయడం దండుగ అనిపిస్తంది. యూరియా కోసం మస్తు గోసైతంది. నేను చెర్ల భూత్కూర్‌లో ఐదెకరాలల్లో నాటు వేసిన. పనులన్నీ విడిచి పెట్టి 15 రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్న. వారం కింద ఒక బస్తా దొరికింది. అది ఎక్కడికీ చాలలే. ఒక బస్తాకే వారం రోజులైతే మిగిలిన వాటికోసం ఎన్నిరోజులు తిరగాలో అర్థమైతలేదు. రైతులకు టైంకు యూరియా అందిస్తేనే ఎవుసం చేసుడు సంబురమనిపిస్తది. గిట్లనే సతాయిస్తా అంటే వేరే పని చేసుకోవడమే మంచిది.
– ఐలేటి కొమురయ్య, రైతు (చెర్లభూత్కూర్)