కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రభావం పాఠశాల విద్యారంగంపై కనిపిస్తున్నది. ముఖ్యంగా ప్రాథమిక విద్య చతికిల పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎటువంటి సెలవులూ లేకుండా పాఠశాలలు నడిచే ఈ నవంబర్‌లో ప్రైమరీ టీచర్లందరూ సర్వేలో పాల్గొనడం, ఒంటిపూట బడులు నిర్వహించడం వల్ల తల్లిదండ్రుల్లో ఒక అపనమ్మకం ఏర్పడే ప్రమాదముందనే అభిప్రాయం ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతున్నది. నిజానికి ప్రభుత్వం ముందుగా చెప్పిన ప్రకారం ఉపాధ్యాయులు సర్వేను పూర్తి చేసి ఈ నెల 18న పాఠశాలలకు హాజరు కావాల్సి ఉన్నా.. నేటి వరకు 75 శాతం మంది సర్వే పూర్తి కాకపోవడంతో ఈ నెలాఖరు వరకు కొనసాగించే అవకాశమున్నది. ఈ సమయంలో టీచర్లు ఎప్పుడొస్తారా..? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇటు విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాలను పరీక్షించేందుకు కేంద్రం వచ్చే నెల 4న నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్)పరీక్ష నిర్వహిస్తుండగా, సర్వే వల్ల పిల్లలను ప్రిపేర్ చేయించలేని పరిస్థితి ఎదురవుతున్నది. విద్యార్థుల ప్రతిభకు కొలమానంగా నిర్వహించే ఈ టెస్ట్‌లో ఈసారి కూడా నిరాశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశమున్నదని స్వయంగా ఉపాధ్యాయులే ఆందోళన వ్యక్తం చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కటుంబ సర్వే)ను ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ఈ నెల 6 నుంచి అధికారికంగా ప్రారంభమైనా.. సర్వే కోసం ఈ నెల ఒకటి నుంచే ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. నిజానికి సర్వేలో ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులను తీసుకోవద్దన్న డిమాండ్ వచ్చింది. ఈ విషయాన్ని దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో తేల్చిచెప్పాయి. అయినా, ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు ఒంటి పూట బడులు నడుపుతామని, ఉదయం స్కూల్‌కు హాజరయ్యే టీచర్లు సాయంత్రం సర్వేలు చేస్తారని పేర్కొన్నది. ఉమ్మడి జిల్లాలో 10.84 లక్షల నివాసాలుండగా, 7,330పైగా బ్లాక్‌లుగా విభజించారు. అందుకోసం 7,480 మంది ఎన్యుమరేటర్లను వినియోగిస్తున్నారు. అందులో మెజార్టీ ఉపాధ్యాయులే ఉన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,550 మందికి పైగా ప్రైమరీ టీచర్లు ప్రస్తుతం సర్వేలో పాల్గొంటున్నారు. వీరంతా దాదాపు ఈ నెల ఒకటి నుంచే సర్వే విధులకు హాజరవుతున్నారు. ముందుగా చెప్పిన ప్రకారం చూస్తే.. ఉపాధ్యాయులకు కేటాయించిన బ్లాక్‌లో సర్వేను ముగించుకొని, ఈ నెల 18 నుంచి పాఠశాల విధులకు హాజరు కావాల్సి ఉన్నది. కానీ, 75 శాతానికిపైగా ఉపాధ్యాయుల సర్వే పూర్తి కాలేదు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సర్వే ప్రశ్నాపత్రాల ఫార్మాట్ పెద్దగా ఉండడం.. ఒక్కో ఫారాన్ని పూర్తి చేసేందుకు 45 నిమిషాలకుపైగా పట్టడం.. చాలా చోట్ల ప్రజలు ఎన్యుమరేటర్లకు ఎదురు ప్రశ్నలు వేయడం.. వారిని సముదాయించి సమాచారం తీసుకునేందుకు నానాపాట్లు పడడం, అలాగే ఎన్యుమరేటర్లు వెళ్లినప్పుడు ఇంటి యజమానులు లేకపోవడం.. ఉన్నవారు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల సర్వే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తున్నదని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. ఫలితంగా సర్వేలో చాలా జాప్యం జరుగుతున్నదని, ఈ నేపథ్యంలోనే 75 శాతం మంది సర్వే పూర్తి కాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో సార్లు స్కూళ్లకు ఎప్పుడోస్తారోతెలియని పరిస్థితి ఉన్నది.
పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు కేంద్రం ఏటా నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) పరీక్ష నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష విద్యార్థుల ప్రతిభకు అద్దం పడుతున్నది. ఆయా పాఠ్యంశాల్లో విద్యార్థుల సామర్థ్యం ఏ మేరకు ఉందో తెలుపడంతోపాటు ఆ వివరాలను కేంద్రం వెల్లడిస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థుల చదువులకు ఇదో పెద్దకొలమానం! ఈ విద్యా సంవత్సరంలో కూడా అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు డిసెంబర్ 4న కేంద్రం నాస్ పరీక్షను నిర్వహిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 3, 6, 9 తరగతుల విద్యార్థులు ఈ సారి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఈ పరీక్షకు అనుగుణంగా ప్రిపేర్ చేయించాల్సిన అవసరముందని విద్యాశాఖ గతంలోనే ఆదేశించింది. ఎందుకంటే గతేడాది ఈ పరీక్షలో ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు చాలా వెనుకపడ్డారని, కనీస అభ్యాసన సామర్థ్యాలు లోపించాయని అప్పుడే విమర్శలు వచ్చాయి. ఈసారి ఆ విమర్శల నుంచి బయటపడేందుకు ఆయా పాఠశాలలు తమ కసరత్తు మొదలు పెట్టాయి. అంతలోనే సర్వే రావడంతో ఆ లక్ష్యానికి దెబ్బపడినట్టు అయింది. నిజానికి విద్యాసంవత్సరాన్ని పరిగణలోకి తీసుకొని చూస్తే ఏటా నవంబర్‌లో తరగతులు పరిపూర్ణంగా సాగుతాయి. ఎటువంటి సెలవులు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. మళ్లీ డిసెంబర్ వస్తే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు క్రిస్మస్ సెలవులు ఇస్తాయి.
జనవరిలో సంక్రాంతి సెలవులు వస్తాయి. అలాగే మార్చివరకు బడుల కొనసాగింపులో అనేక అవాంతరాలు వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌లో పకడ్బందీగా సాగే చదువులకు ఈ సర్వే దెబ్బకొట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాస్కు ఎలా ప్రిపేర్ చేయిస్తామని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, పదిహేను నుంచి నెల రోజుల పాటు సర్వేలో ఉంటే అకాడమిక్ క్యాలెండర్ ఎలా అమలు చేయాలని అడుగుతున్నారు. వీటితోపాటు పిల్లలు లేని పాఠశాలలల పరిధిలో ఇల్లిల్లూ తిరిగి తల్లిదండ్రులకు అభయం ఇచ్చి, ప్రైవేట్‌కు వెళ్లే పిల్లలను తమ బడిలో చేర్పించుకున్నామని, ఇప్పడు ఒంటిపూట బడులు నడుపడం వల్ల తమపై తల్లిదండ్రులు నమ్మకం కోల్పోతున్నారని, తద్వారా మళ్లీ విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశముందని కొంత మంది టీచర్లు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం వరి కోతలు, పత్తి ఏరుడు పనుల్లో తల్లిదండ్రులు బీజీగా ఉంటారని, ఈ సమయంలో విద్యార్థులు ఇంటి వద్ద ఉండడం అంత సురక్షితం కాదని, అందుకే బడులు ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మీరెప్పుడొస్తారో చెప్పాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మధ్యాహ్నభోజనం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
నిజానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చూస్తే చాలా పట్టణాల్లో ఇంకా స్టిక్కర్స్ అతికించే ప్రక్రియనే పూర్తి కాలేదు. ఇంకా వేలాది నివాసాలకు సిక్కరింగ్ వేయాల్సి ఉన్నది. అంతేకాదు, లక్షలాది నివాసాల్లో సర్వే చేయాల్సి ఉన్నది. ప్రధానంగా ఈ సర్వే అధికారుల అంచనాలకు భిన్నంగా కొనసాగుతున్నది. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అడుగుతున్న ప్రశ్నల్లో చాలా వాటికి కోడ్స్ వేయాల్సి ఉన్నది. వాటిని చూసి, నమోదు చేయడానికే సమయం పడుతున్నది. అలాగే 20 నుంచి 25 నిమిషాలకు ఒక ఇంటిని సర్వే చేయవచ్చని ముందుగా అధికారులు అంచనా వేశారు. కానీ, ఎన్యుమరేటర్ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ఒక ఇంటిని సంపూర్ణంగా సర్వే చేయాలంటే దాదాపు 45 నిమిషాలకుపైగా పడుతున్నదని చెబుతున్నారు. అదికూడా యజమానికి అన్ని రకాలుగా సహకరిస్తేనే సాధ్యమవుతుందని, లేదంటే ఇంకా అదనపు సమయం పడుతున్నదని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో సర్వే ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈనెలాఖరు వరకు సమయం పట్టే అవకాశమున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రాథమిక ఉపాధ్యాయులను విధుల నుంచి తప్పిస్తుందా..? లేక సర్వే పూర్తయ్యే వరకు కొనసాగిస్తుందా..? అన్నదానిపై ప్రస్తుతం ఉపాధ్యాయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఒక బ్లాక్‌లో సర్వే పూర్తి కాకుండా మధ్యలోనే నిలిపేస్తే కొత్త ఎన్యుమరేటర్ల వల్ల తప్పులు జరిగే అవకాశాలున్నాయని, అందుకే ఉపాధ్యాయులైనా లేదా ఇతర సిబ్బందైనా సర్వే కేటాయించిన బ్లాక్‌ల్లో సర్వే పూర్తయ్యేవరకు వారినే కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మెజార్టీ ఉపాధ్యాయులు ఈ నెలాఖరు వరకు తమ సర్వేను కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని, ఈ ప్రభావం విద్యార్థులపై కచ్చితంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.