Field assistant |కరీంనగర్ కలెక్టరేట్ ఏప్రిల్ 21: ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులే కాదు.. ఉపాది కూలీలకు పనులు చూపే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా క్రమబద్ధీకరిస్తామని, వారికి పేస్కేలు అమలు చేయటంతో పాటు వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని బడాయి మాటలు చెప్పి, ఓట్లు కొల్లగొట్టిన నాటి కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా క్రమబద్ధీకరణ మాట దేవుడెరుగు… కనీసం తమకందించే నేసవారి వేతనాలు కూడా సక్రమంగా అందజేయటం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏనెలకానెల చెల్లించాల్సిన జీతాలు మూడు నెలలు దాటి నాలుగో నెల కావస్తున్నా, తమ బ్యాంకు ఖాతాల్లో జమచేయకపోవటంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. తమపై ఆధారపడ్డ వారికి బుక్కెడు బువ్వ కోసం బంధు, మిత్రుల వద్ద తెచ్చిన చేబదులు కూడా తిరిగి ఇవ్వక, అప్పు కోసం ఇతరుల వద్దకు వెళ్ళలేక పస్తులుండాల్సిన దుస్థితి దాపురిస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తాము పడుతున్న ఇబ్బందులు ప్రజావాణిలో నివేదించి అధికారులను వ్యక్తిగతంగా కలిసి తమ బాధలు తీర్చాలంటూ వేడుకున్నా ఫలితం కావరావటంతో రోడ్డున పడ్డారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట మూకుమ్మడి నిరసనకు దిగారు. అయినా, అధికారులు స్పందించకపోవటంతో ప్రధాన ద్వారం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు.
జిల్లా వ్యాసంగా 215 నుంచి 220 మంది క్షేత్ర సహాయకులు వివిధ గ్రామాల్లో ఎంఏనారీజిఎస్ విభాగంలో విదులు నిర్వహిస్తున్నారు. వీరికి రూ.7,500 నుంచి మొదలు రూ.12,400 వరకు ప్రతీ నెల వేతనాలు అందజేస్తున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వేతనాలు విడుదల చేయలేదు. వచ్చే నెలలో వస్తాయంటూ ఎప్పటికప్పుడు అధికారులు మభ్యపెడుతున్నారని, అప్పోసప్పో చేసి కుటుంబాలను పోషించుకుంటుండగా, ఈనెల అయినా వేతనాలు అందజేయాలని అధికారులను కోరితే ఉలుకూ పలుకూ లేకపోవటంతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగినట్లు ఫీల్డ్ అసిస్టెంట్స్ అండ్ అగ్రికల్ఫర్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అనంతరం పట్టించుకోకపోవటం శోదనీయమన్నారు. తమకు లాభం కలుగుతుందనే ఆశతో కాంగ్రెస్కు ఓట్లేసి, గలిపించుకుంటే అన్యాయమే జరుగుతోందంటూ మండిపడ్డారు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీ మేరకు తనుకు వేస్కేల్ వర్తంపజేస్తూ, నెలకు రూ.25వేల వేతనం అందజేయాలని ఆరోగ్య కార్డులు అందించి, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్సియేషియా విడుదల చేస్తూ, వారి కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగావకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సకాలంలో ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మద్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కలెక్టరేట్ ప్రధానద్వారం ఎదుట బైకాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారూ. ఈ ధర్నాలో సంఘం ప్రతినిధులు ఎండి. ఖలీషా, రవి, అంజిబాబు, హనుమాండ్ల యాదగిరి, సుజాత, వాణి, రమతో పాటు 50 మందికి పైగా క్షేత్రమహాయకులు పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేసినట్లు సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు.
కాంగ్రెసును నమ్మితే మా ఆశలు పుచ్చి బుర్రలయ్యాయి
– ఎండి.ఖలీషా, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా నాయకుడు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లేస్తే, మా ఆశలన్నీ పుచ్చిన బుర్రలైపోయాయి. మాకు పేస్కేల్ వర్తింపజేస్తామని, కన్ఫాల్డేటెడ్ పే కింద నెలకు రూ.25వేల వేతనమిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించటంతో మేమంతా ఏకపక్షంగా ఆపార్టీకి మద్దతు తెలిపాము. మాకుటుంబాలతో పాటు, బంధువులు, మిత్రుల ఓట్లు కూడా వేయించాము. ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చిన అనంతరం ఆపార్టీ నాయకులతో పాటు అధికార పదవులు అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా మమ్ములను పట్టించుకోవటం లేదు. వారి ఇళ్ళ చుట్టూ తిరిగి తిరిగి వెసారిపోయాము. కనీసం మా వేతనాలు కూడా సక్రమంగా విడుదల చేయకపోవటంతో, మా పిల్లల చదువుల ఫీజులు కూడా చెల్లించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాము. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మాకు తగిన బుద్ధి చెప్పింది. వెంటనే జీతాలు విడుదల చేయకపోతే వరుస ఆందోళనలకు కార్యచరణ రూపొందిస్తాం. ప్రభుత్వ వ్యతిరేక
ఉద్యమం మొదలుపెడుతాం.
ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది
– సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్, చేగుర్తి
మమ్మల్ని గెలిపించుండి.. మీకు పేస్కేల్ ఇస్తానంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపాది పనుల వద్దకొచ్చి వేడుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారంలోకి వచ్చినాక మమ్ములను మోసం చేశారు. అసలు పేస్కేల్, క్రమబద్ధీకరణ కాదు. కనీసం మా వేతనాలు కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా అందజేస్తలేదు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన మేనుంతా మాట మీద నిలబడి కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసినం. ఇప్పుడు అందుకు తగ్గ ఫలితం అనుభవిస్తున్నాం. ఇంట్లో ఎవరైనా ఆనారోగ్యం సాలైతే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. మా బాధలు చెప్పుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకెళ్ళినా మమ్మల్ని కలిసి, మాకు సమాదానం చెప్పేందుకు కూడా అంగీకరించడం లేదు. మాకు న్యాయం చేస్తామంటే నమ్మిన పార్టీ మమ్ముల్ని నట్టేట ముంచుతున్నది. వెంటనే జీతాలు విడుదల చేయాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేకుంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరును ఎండగడుతాం.