గంగాధర, జనవరి 13 : స్వరాష్ట్రంలో ఎవుసాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. రైతు బీమాతో కుటుంబాలకు భరోసానిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఆపద సమయంలో ‘నేనున్నా’ంటూ ధైర్యమిస్తున్నారు.
వివి ధ కారణాలతో రైతులు ర్యాలపల్లికి చెందిన తొందుర్తి నారాయణ, గంగాధరకు చెందిన కొండ వెంకటేశం, మంగపేటకు చెందిన అతికం ఆశాలు, కురిక్యాలకు చెందిన గుండారపు కనుకయ్య మృతి చెందగా, వారి పేరిట రాష్ట్ర సర్కారు రైతు బీమా పరిహారం మంజూరు చేసింది. అలాగే మూడు గుంటల భూమి ఉన్న కురిక్యాల గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త గుండారపు కనుకయ్య (30) అనారోగ్యంతో కొద్ది ఇరోజుల క్రితం చనిపోగా, ఆయన పేరిట కూడా పరిహారం మంజూరైంది. శుక్రవార చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా ఆ రైతుల ఇండ్లకు వెళ్లి, కుటుంబసభ్యులకు రైతు బీమా ప్రొసీడింగ్ పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలు చేయడం కాదు ఆపద సమయంలో అక్కున చేర్చుకుని ఆదుకోవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ మనస్తత్వమని చెప్పారు. రైతు బీమా కుటుంబాలకు భరోసానిస్తున్నదన్నారు. ఆపద సమయంలో రాష్ట్ర రైతులందరికీ సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడని గ్రామస్తులు కొనియాడారు. ఆయాచోట్ల ఎమ్మెల్యేకు రైతు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.