కరీంనగర్, జనవరి 3(నమస్తే తెలంగాణ): రైతన్న చేతికి పెట్టుబడి అందుతోంది. వరుసగా ఆరో రోజు బ్యాంకు ఖాతాల్లో జమవుతుండడంతో రైతాంగం నగదు విడిపించుకుంటున్నది. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సందడి కనిపిస్తుండగా, సర్కారు పంపిన పెట్టుబడి తీసుకున్న రైతుల ఇండ్లలో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా ఆనందం వెల్లివిరుస్తున్నది. సాగు ఖర్చులకు సాయం పంపిన సీఎం కేసీఆర్ తమకు కనిపించే దైవమని రైతాంగం కొనియాడుతున్నది. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ, కృతజ్ఞతలు చాటుతున్నది.
రైతు బంధు పైసలే ఆదుకుంటున్నయ్..
నాకు ఉన్నది ఎకరం భూమే. కానీ ఆనాడు సాగు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ ఉండకపోయేది. పెట్టుబడులు, మందు బస్తాలకు ఆడీడా పైసలు అడిగి తెచ్చుకుని నాట్లేత్తే, కరెంటు జెయ్యబట్టి మొత్తం పొలం ఎండిపోయింది. ఇత్తులు రాక అప్పులే దిక్కయినయ్. రైతు బిడ్డ కేసీఆర్ జెయ్యబట్టి మాకు రైతుబంధు రావట్టే. ఇప్పటికి పదిసార్లు వచ్చింది. గవే పైసలతోటి పెట్టుబడి ఎల్లదీత్తున్న. కరెంటు ఉండవట్టే, నీళ్లతోటి బంగారమసోంటి పంటస్తంది. గింజలొచ్చినంక అమ్మితే నాలుగు రోజులకే పైసలిచ్చినయ్. యవసం జెయ్యబట్టి కుటుంబమంతా బతుకుతున్నం. అందుకే నేను కేసీఆర్, కేటీఆర్ సార్లున్న అంగినే ఎప్పుడు వేసుకుంటూ మురిసి పోతా. మాఊరన్నీ పొలాలే అయినయ్. అందరం పొలం పనులు చేసుకుంటుంటే ఎంతో సంబరమని పిస్తుంది.
– వెల్పుల ఆనందం, రైతు(తంగళ్లపల్లి)
వ్యవసాయం పండుగలా మారింది..
నాకున్న భూమిలో వరితో పాటు మక్కజొన్న, కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేస్తున్న. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. దీనికితోటు 24 గంటల ఉచిత కరెంట్, పెట్టుబడి సాయంతో వ్యవసాయం పండుగలా మారింది. ఒకప్పుడు మా గ్రామంలో బీడు భూములు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు ఎక్కడా ఖాళీ ఉండడం లేదు. పండిన పంటను సైతం మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటున్నది. రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే దానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణం.
– పిల్లి మహేశ్‌గౌడ్, ఆసిఫ్‌నగర్ (కొత్తపల్లి)
రైతుబంధు ఆసరైతంది ..
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు మునిగె పోచయ్య. ఊరు తంగళ్లపల్లి మండలం తాడూరు. గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. నాడు కాలం లేక, కరెంటు రాక సాగుకు నోచుకోలేదు. మూడెకరాల్లో పంట వేస్తే ఎకరం కూడా పండకపోయేది. పెట్టుబడికి తెచ్చిన అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి ఉండేది. నాటు వేసేందుకు కైకిళ్లు, దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ కిరాయికి అక్కడ ఇక్కడ బాకీలు తెచ్చి కట్టేది. ఎవుసం విడిచి పెట్టి వేరే పనిచేద్దామంటే దొరకని దుస్థితి. గత్యంతరం లేక ఉన్న భూమిని పట్టుకొని బతుకుబడి లాగుకువచ్చేది. ఇగ జీవితం ఇంతే అన్న స్థితిలో తెలంగాణ వచ్చి, కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే జీవితం మీద ఆశ పుట్టింది. ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పినట్టే నిరంతర కరెంట్, సాగుకు పుష్కలంగా నీరందించడంతో కొంత స్వాంతన దొరికింది. ఇంకా రైతుబంధు సాయం కింద పెట్టుబడి డబ్బులు ఇస్తుండడంతో రంది లేకుండా పోయింది. అప్పటి నుంచి రూపాయి అప్పులేకుండా పంట సాగు చేస్తుండడం, ఇంకా పుష్కలమైన నీళ్లు, నిరంతర కరెంట్‌తో పసలుకు 90క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నాడు. చేసిన అప్పులన్నీ తీర్చాడు. భార్యా, పిల్లలు అందరూ కలిసి పండగులా సేద్యం చేసుకుంటున్నారు. ఇలా ఈ ఒక్క పోచయ్యే కాదు ప్రతి రైతు సిరుల పంట పండిస్తున్నాడు.
మందు బస్తాలు కొంటున్నం ..
ఈ రోజుల్లో మంచిగ నడుస్తున్నదంటే అది ఒక్క వ్యవసాయమే. అందరూ వ్యవసాయ భూములుంటే బాగుండని ఆలోచిస్తున్నరు. నేను ఉన్నత చదువులు చదివినప్పటికీ సేద్యాన్నే ఎంచుకున్న. నాకు మా గ్రామంలో నాలుగెకరాల భూమి ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగలా మారిందని చెప్పుకోడానికి గర్విస్తున్నా. సమైఖ్య పాలనలో వ్యవసాయం దండగంటూ కరెంటు, నీళ్లు ఇవ్వక నిర్లక్ష్యం చేసిండ్రు. అదే కేసీఆర్ సీఎం అయినంక వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిండు. పేద రైతులు పంట పెట్టుబడికి అనేక ఇబ్బందులు పడేటోళ్లు. మందు బస్తాలకోసం దుకాణదారుడి వద్దకు వెళ్లి బతిలాడే పరిస్థితి ఉండేది. ఈ రోజు రైతుబంధు ఎంతో ఆదుకుంటుంది. మందులు, విత్తనాలు అన్ని క్యాష్ ఇచ్చి కొనుక్కుంటున్నరు. ఒకరిని ్న చేయిచాపే పరిస్థితి పోయింది. రైతుకు మంచి రోజులచ్చినయ్. నాణ్యమైన కరెంటు, పుష్కలంగా నీళ్లున్నయ్. పంటల విస్తీర్ణం బాగా పెరిగింది. ఏపంట ఎప్పుడు వేయాలన్నది వ్యవసాయ శాఖ అధికారులు పల్లెలకు వచ్చి చెబుతున్నరు. అన్నింటికన్నా వ్యవసాయమే మేలనిపిస్తున్నది.
– రంగు అనిల్, రైతు, తాడూరు(తంగళ్లపల్లి)
రైతు బంధుతో గొప్ప మేలు..
నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. నేను సాగు చేసేందుకు రైతు బంధుకు ముందు ప్రతిసారి చేబదలుకు డబ్బులు తెచ్చుకునేది. అలా పంట కోసి కుప్పలేసి అమ్మిన తర్వాత వారికి ఆ డబ్బులను చెల్లించేది. ఇప్పుడు ఆ చేబదలు బాధలు తప్పినై. భూమిని సాగుకు సిద్ధం చేయ్యంగనే టంచన్‌గా రైతు బంధు పైసలు పడుతున్నయ్. ఎవరికి చెయ్యి చాపకుండా పంట సాగు చేస్తున్న. లాభాలను పొందుతున్న. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– ఉప్పరి రవీందర్, సబ్బితం, పెద్దపల్లి మండలం
ఇప్పుడు ఏ బాధాలేదు..
మాది ధర్మారం మండలం నంది మేడారం. నాకు గ్రామంలో రెండున్నరెకరాల భూమి ఉంది. కేసీఆర్ ‘రైతు బంధు’ పెట్టినప్పటి నుంచి పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం ద్వారా సాయం అందుతుంది. పసలుకు ఎకరాకు రూ.12,500 వస్తున్నయ్. యేడాదికి రూ.25 వేల సాయం ఇస్తున్నరు. ఇప్పుడు ఏ బాధాలేదు. పెట్టుబడి ఖర్చులన్నీ ఎల్లుతున్నై. సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. రైతులంతా కేసీఆర్ వెంటనే ఉంటరు.
– కొండ వెంకటేశం, రైతు, నంది మేడారం (ధర్మారం)