సాగును బంగారం చేయాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’ మళ్లీ వచ్చేస్తోంది. గత పది విడుతలుగా రెండు పసళ్లకు రైతన్న పెట్టుబడులు తీర్చిన రాష్ట్ర సర్కారు ముచ్చటగా పదకొండోసారి సాయం సోమవారం నుంచే ఖాతాల్లో జమచేయబోతున్నది. గత వానకాలం సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6,68,221 మంది రైతులకు రూ.656.17 కోట్లు సాయం ఇచ్చింది. అయితే, ఈసారి పాత వారితోపాటు కొత్తగా పాసు పుస్తకాలు పొందిన వారందరికీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా, వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్త రైతులను సంప్రదిస్తూ సమాచారం సేకరిస్తూనే, కర్షకులు తమకు సహకరించాలని కోరుతున్నది. వచ్చే నెల 3 వరకు వివరాలు సమర్పించిన వారికే సాయం అందుతుందని స్పష్టం చేస్తున్నది.
– కరీంనగర్, జూన్ 25 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 25(నమస్తే తెలంగాణ): పంట పెట్టుబడికి సాయం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘రైతు బంధువు’ మళ్లీ వచ్చేస్తున్నది. నేటి నుంచే పదకొండో విడుత ఖాతాల్లో జమకాబోతున్నది. అయితే పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతుకూ అందించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. జిల్లాలో కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు, గతంలోనే పట్టాదారు పాసు పుస్తకాలు పొంది ఇప్పటివరకు వివరాలు అందించని రైతులు వెంటనే సంబంధిత ఏఈవోలు, ఎంఏలను సంప్రదించి పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాసు పుస్తకం జిరాక్స్ కాపీలు అందించాలని కోరుతున్నారు. వివరాలు సమర్పించేందుకు వచ్చే నెల 3 వరకు గడువు ఇచ్చారు. ఈ గడువులోగా వివరాలు అందించిన రైతులకు ఈ సీజన్ నుంచే రైతుబంధు వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే వివరాలు ఉన్న రైతులకు ఈనెల 26 నుంచి వారి ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేస్తామని వ్యవసాయాధికారులు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో..
ప్రతి సీజన్లో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. గత వానాకాలంలో చూస్తే 1,93,330 మంది రైతులు ఉండే వారు. వీరికి రూ.181.89 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ఆ సీజన్లో వివరాలు అందుబాటులో ఉన్న 1,81,908 మంది రైతులకు రూ.177.78 కోట్లు జమ చేశారు. ఈ సీజన్లో మరో 6,745 మంది రైతులు పెరిగి ప్రస్తుతం 2,00,075 మందికి చేరుకున్నారు. ఈ వానకాలం సీజన్లో ఈ రైతులంరికీ రూ.182.04 కోట్ల దాకా మంజూరయ్యాయి. కానీ వ్యవసాయ అధికారుల వద్ద ఇప్పటి వరకు 1,82,885 మంది రైతుల వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే ఇంకా 17,190 మంది రైతుల వివరాలు సేకరించాల్సి ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
ప్రతి సీజన్లో రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. అయితే కొత్తగా పాసు పుస్తకాలు పొందిన వారందరికీ రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించగా, జిల్లాలో ఇప్పకే వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలన్నీ ఆన్లైన్లో చేర్చారు. గత సీజన్లో జిల్లాలో 1,19,328 మంది రైతులకు రూ.130 కోట్లు సాయం అందించింది. అయితే ఈ సీజన్లో కొత్తగా 11,626 మందిని చేర్చింది. ఈ లెక్కన 1,30,954 మంది రైతులు రూ.131, 13,40,247 అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
జగిత్యాల జిల్ల్లా..
ప్రతి సీజన్లో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. అయితే కొత్తగా పాసు పుస్తకాలు పొందిన వారందరికీ రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించగా, జిల్లాలో ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలన్నీ ఆన్లైన్లో చేర్చారు. గత వానకాలం సీజన్లో జిల్లాలో 2,17,702 మంది రైతులకు రూ. 209.39 కోట్లు సాయం అందించింది. అయితే ఈ సీజన్లో కొత్తగా 12,864 మందిని చేర్చింది. ఈ లెక్కన 2,36,269 మంది రైతులకు సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
పెద్దపల్లి జిల్లాలో..
ప్రతి సీజన్లో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. గత వాన కాలంలో చూస్తే 1,37, 861 మంది రైతులు ఉండే వారు. వీరికి రూ.139 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఈ సీజన్లో రైతుల సంఖ్య పెరిగి ప్రస్తుతం 1,53,104 మందికి చేరుకున్నారు. ఈ వానకాలం సీజన్లో ఈ రైతులందరికీ రూ.145 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. అంటే ఇంకా 15,243 మంది రైతుల వివరాలు సేకరించాల్సి ఉంది.
వచ్చే నెల 3 వరకు గడువు..
కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు, గతంలో పొంది రైతుబంధుకు దరఖాస్తు చేసుకోని రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ప్రతి రైతు నుంచి వివరాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరికీ వర్తించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకొని వచ్చే నెల 3 వరకు గడువు విధించుకున్నారు. రైతుల ఆధార్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంక్ అకౌంట్ పాసు పుస్తకం జిరాక్స్ ప్రతులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు వివరాలు ఇవ్వని రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు ఇతర విధుల్లో ఉన్నట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు అందించాలని డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ కోరుతున్నారు. అలాగే ముందుగా నగదు జమై ప్రస్తుతం ఏదైనా కారణం చేత బ్యాంకు వివరాలు మార్చుకోదలచిన వారు, ఇంకా డీబీటీ ఫెయిల్ అయి నగదు జమకాని వారు కూడా వెంటనే వ్యవసాయ సంబంధిత అధికారులను సంప్రదించాలని డీఏవో కోరుతున్నారు.
నేటి నుంచే ఖాతాల్లోకి..
వానకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నగదును ఈ నెల 26న నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ధరణి పోర్టల్ ప్రామాణికంగా జిల్లాలో వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య 2,00,075 మందికి పెరిగారు. వీరి పరిధిలో 3,64,078 ఎకరాలు భూమి ఉంది. ప్రతి ఎకరాకు రూ.5 వేల చొప్పున ఈ సీజన్లో రూ.182.04 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాధాన్యతా క్రమంలో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
వివరాలు అందించాలి..
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రై తులు, అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న రై తులందరూ తమ వివరాలను వచ్చేనెల 3లోగా సంబంధిత అధికారులకు అందించాలి. కొంద రు ఏఈవోలు ఇతర విధుల్లో ఉన్నందున వారు అందుబాటులో లేనిచోట మండల వ్య వసాయ అధికారులకు వివరాలు అందించా లి. వచ్చే నెల3 వరకు ఆధార్ కా ర్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంక్ పాసు పుస్తకం జిరాక్స్ ప్రతులు సమర్పించినట్లయితే ఈసీజన్లో మంజూరైన రైతుబంధు నగదు పొంద అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని రైతులందరూ అర్థంచేసుకొని సహకరించాలని విజ్ఞప్తి.
– వాసిరెడ్డి శ్రీధర్, కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి
మాకు కేసీఆర్ కొండంత ధైర్యం
ఒకప్పుడు పంటపెట్టుబడి సాయానికి ఊళ్లే శావుకారి దగ్గరి అప్పు తెచ్చేది. తీరా అప్పు తీర్చడానికి వడ్లు ఆయనకే అమ్మేటోళ్లం. లాభం కింద బుడ్డెడు వడ్లు వట్టిగనే తీసుకునేది. గిట్టుబాటు ధర కూడా వచ్చేది కాదు. నాడు నీళ్లు, కరెంటు గోసను ఎల్లదీయలేక ఎంతత్తే గంతే అనుకుని తక్కువకే వడ్లను అమ్మినం. కేసీఆర్ సార్ వచ్చినంక పుల్ కరెంటు ఉం టుంది. పంట మంచిగైంది. రైతు బంధు జెయ్యవట్టి ఇంకొకరిని చేయి చాపే అవసరం లేకుండా పోయింది. కేసీఆర్ మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఆయన ఉన్నన్ని రోజులూ మాలాంటి రైతులకు ఢోకాలేదు.
– బోయిని అంజయ్య, రైతు, మల్కపేట, కోనరావుపేట మండలం
రైతు బంధే ఆదుకుంటుంది
యాసంగి సీజన్ పోగానే వానాకాలం సీజన్ వత్తుండే. నాటి రోజుల్లో విత్తులు, యూరియా కోసం అప్పు కోసం తిరిగని జాడంటూ లేదు. అప్పు ఇచ్చేటోళ్ల దగ్గర ఏదైనా కుదువపెడితే తప్ప ఇయ్యక పోయే ది. గిట్ల నానా తిప్పలు పడ్డం. నీళ్లగోస, కరెం టు సక్కగా రాక, పంట చేతికి రాక పడరాని పాట్లు పడ్డం. మాకు ఒక్క ఎవుసమే ఆధారమాయె. ఇది లేకుంటే మాబతుకులే లేవాయే. తుట్టికైనా సరే ఎవుసం చేసుకున్నం. కేసీఆర్ సల్లంగుండా పదేండ్ల కిందనే వస్తే మంచిగుండు. మాకు గిన్ని కష్టాలుండకపోవు. రైతుబంధు జెయ్యవట్టి జేబులో నాలుగు పైసలుంటున్నయ్. గీతొమ్మిదేండ్లలో విత్తుల కోసం ఏనాడు అప్పు తేలేదు. టైంకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్న దేవుడు.
– ఉత్తెం భూమయ్య, రైతు, మల్కపేట, కోనరావుపేట మండలం