సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 22: రైతు బంధు సాయం వచ్చేసింది. జిల్లా రైతులకు ముందుస్తుగా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సా యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవల సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇక్కడి రైతుల విజ్ఞప్తి మేరకు వారం రోజుల ముం దుగానే రైతు బంధును అందిస్తున్నారు. ఈనెల 21 నుంచే రైతులకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఆర్బీఐ హైదరాబాద్ నుంచి నెఫ్ట్ ద్వారా ఖాతాల్లోకి జమ చేస్తుండగా, జిల్లాలోని రైతులు, ప్రజాప్రతినిధులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, సంబురాలు జరుపుకుంటున్నారు.
జిల్లాలో 1.26లక్షలకు మందికి లబ్ధి..
వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. 2018 వానకాలం సీజన్ నుంచి 2022 వానకాలం సీజన్ వరకు మొత్తం 1076.17కోట్లు నగదును జిల్లా రైతులకు ప్రభుత్వం అందజేసింది. ప్రతి సీజన్లో 1.26లక్షల మందికి 131 కోట్లు అందజేస్తున్నారు. ఈ యాసంగి పంట సాయంతో కలిపి మొత్తం సాయం సుమారు 1208 కోట్లకు పైగా అందింది.
కర్షకుల హర్షాతిరేకం
ముందస్తు రైతు బంధు సాయం విడుదలపై జిల్లా వ్యాప్తంగా రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం సంబురాలు జరుపుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో వేడుకలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొనియడారు. రైతు బంధు సాయం వారం రోజుల ముందుగా ఖాతాలకు రావడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఎరవెల్లి వెంకటరమణారావు, కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ, వైద్య శివప్రసాద్, షేక్ అలీ, మాజీ కౌన్సిలర్ బుర్రనారాయణగౌడ్, విడుగురాళ్ల బాలరాజుగౌడ్, తిరుపతినాయక్, లడ్డుబాయ్, జెట్టి దేవయ్య, వెంకన్న ఉన్నారు.
తంగళ్లపల్లిలో..
తంగళ్లపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. రైతుబంధును వారం ముందుగానే ఖాతాల్లో జమ చేయడం హర్షనీయమని బీఆర్ఎస్ సీనియర్ నేత, తంగళ్లపల్లి సెస్ డైరెక్టర్ స్థానం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చిక్కాల రామారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, ఎంపీపీ పడిగెల మానస, పుర్మాణి రాంలింగారెడ్డి, పడిగెల రాజు, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, మండలాధ్యక్షుడు వల్లకొండ వేణుగోపాలరావు, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్‌గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, అబ్బాడి అనిల్‌రెడ్డి, మోతె మహేశ్, సిలువేరి సంజీవ్, జనార్దన్‌రెడ్డి, నులుగొండ శ్రీనివాస్, కొత్త సంతోష్‌గౌడ్, బండిజగన్, రషీద్, గుగ్గిల్ల అంజయ్య, సద్ద రోజ ఉన్నారు.
ముందుగానే వేసిండ్రు
నాకు మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఐదేండ్లుగా రైతు బంధు పైసలు వస్తున్నయ్. ఈ సారి రైతు బంధు పైసలు ముందుగాళ్లే వచ్చినయ్. పెట్టుబడికి రంది లేకుండా పోయింది. ఈ నెల 28న వస్తయ్ అని కేసీఆర్ చెప్పిండు. మా మంత్రి కేటీఆర్ సార్ దయతో ముందుగానే వచ్చినయ్. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్లకు రుణ పడి ఉంట.
– ఐలయ్య, రైతు (గోపాలరావుపల్లె)
రైతులు సంబురపడుతుండ్రు..
పెట్టుబడి సాయం ఖాతాల్లో పడడంతో రైతులు సంబురపడుతుండ్రు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా రైతులకు వారం రోజుల ముందు గా పైసల్ జమ చేయడం సంతోషకరం. మెట్ట ప్రాంత రైతులు త్వరగా వ్యవసాయ పనులు ప్రారంభించారు. యాసంగి పనులు ఊపందుకున్నాయి. రైతులకు ముందుగా రైతుబంధు సాయం అందాలనే ఉద్దేశంతో పైసల్ ముందుగా పంపించారు. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
– పబ్బతి విజయేందర్‌రెడ్డి, రైతు, మాజీ సింగిల్‌విండో చైర్మన్ (నేరేళ్ల)