కాంగ్రెస్ సర్కారు పాలన గాడి తప్పింది. వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నది. గ్రామీణ ప్రాంత నిరుపేద ప్రజలకు ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆనాటి కేసీఆర్ సర్కారు రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన దవాఖానలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. భర్తీ చేయాల్సిన పోస్టులను చూపకుండానే ఇటీవల సాధారణ బదిలీల ప్రక్రియ కంప్లీట్ చేయడం, తాజాగా రీ రిప్లయ్మెంట్లో ఈ హాస్పిటళ్ల ఊసెత్తకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 100 పడకల దవాఖానలు ఉండాలని సంకల్పించింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని చొప్పదండి, వేములవాడ, ధర్మపురిలో 100 పడకలు, మానకొండూర్, జమ్మికుంట, ఇల్లంతకుంటలో 50 పడకలు, గంగాధర, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో 30 పడకల వైద్యశాలలు నిర్మించింది. వీటిలో దాదాపు అన్ని దవాఖానలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ నిర్మించారనే అక్కసుతోనే ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడకుండా చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
సిబ్బందిని కేటాయించడంలో నిర్లక్ష్యం
ఈ దవాఖానలకు స్పెషాలిటీ వైద్యులు, సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. 100 పడకల దవాఖానలో వైద్యులు, ఇతర సిబ్బంది కలిసి కనీసం 84 మంది వరకు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఆయా జిల్లా కేంద్రాల్లో కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మించారు. అప్పటి వరకు వైద్య విధాన పరిషత్తు పరిధిలో ఉన్న జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానలు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వెళ్లాయి. ఇది జరిగిన తర్వాత వచ్చిన బదిలీల ప్రక్రియలో ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయిన 100, 50, 30 పడకల దవాఖానలకు సిబ్బందిని నియమించ లేదు. ఇటీవల ఆన్లైన్లో జరిగిన వైద్యులు, సిబ్బంది బదిలీల్లో ఈ దవాఖానల ఖాళీలను చూపకపోవడం శోచనీయం.
కాగా రీ- రిప్లయ్మెంట్ పేరిట మరోసారి శుక్రవారం సాయంత్రం ఆన్లైన్లో బదిలీ ప్రక్రియకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, ఇపుడు కూడా ఈ దవాఖానాలను ఆన్లైన్లో చూపలేదు. పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో ఉన్న 100 పడకల దవాఖానను చేర్చినా, ఇందులో భర్తీ కావల్సిన అన్ని పోస్టులను చూపలేదు. ఈ ప్రక్రియ ఆన్లైన్ బదిలీల ప్రక్రియ ఆదివారం సాయంత్రంతో ముగియనుండగా వైద్యులు, మెడికల్ సిబ్బందికి సోమవారం ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ, ఈ దవాఖానలను ఆన్లైన్లో చూపకపోవడంతో వైద్యులుగానీ మెడికల్ సిబ్బందిగానీ బదిలీల కోసం ఈ దవాఖానాలను ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది.
పట్టింపు లేకుండా ప్రభుత్వ వ్యవహారం
ఈ సారి జరిగే రీ- రిప్లయ్మెంట్ బదిలీల్లోనైనా 100, 50, 30 పడకల్లో ఉన్న ఖాళీ పోస్టులను చూపాలని ఒక పక్క ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా చొప్పదండిలో అన్ని హంగులతో పూర్తయిన 100 పడకల దవాఖానాకు తక్షణమే వైద్యులు, సిబ్బందిని నియమించాలని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతోపాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిసి ఈ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కాగా, ఈ దవాఖానలకు ఇప్పుడు వైద్యులు, సిబ్బందిని కేటాయించకుంటే మళ్లీ ఎప్పటికో వచ్చే సాధారణ బదిలీల వరకు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆన్లైన్లో చేపట్టిన రీ- రిప్లయ్మెంట్ బదిలీల గడువు పొడిగించి ఈ దవాఖానల్లోని ఖాళీలను చూపించాల్సిన అవసరం ఉంది.