గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడు వరుణుడు ముఖం చాటేయగా, పల్లెల్లో కరువు తాండవిస్తున్నది. చెరువులు, కుంటలు అడుగంటడం, పోసిన నారు, పెట్టిన విత్తనాలు తడిలేక భూమిలోనే మాడిపోతుండగా రైతాంగం గోసపడుతున్నది. వానలు లేక ఇబ్బంది పడుతున్న రైతు కన్నీటిని తుడిచేందుకు పల్లెల్లో కొద్దిరోజులుగా ‘వానలు పడాలి.. కరువుపోవాలని’ కాంక్షిస్తూ ప్రజలు ఆలయాల్లో పూజలు, జలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. శనివారం శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గూళ్ల రమేశ్ ఆధ్వర్యంలో గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వరదపాశం నిర్వహించారు. అనంతరం ఓ కర్రకు కప్పను కట్టుకుని గ్రామంలో ఇళ్లిళ్లూ తిరుగగా, ప్రజలు కప్పకు జలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం గూల్ల రమేశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు.
– శంకరపట్నం, జూలై 18