వానల్లేక వరదనీరు పారడం లేదు. ప్రాజెక్టుల కాలువల నుంచి సాగునీరు రావడమూ లేదు. ఫలితంగా చెరువులు, కుంటలు బోసిబోయి కనిస్తున్నాయి. ఈ కారణంగా భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. నిరుటి కంటే 2 నుంచి 3 మీటర్ల లోతుకు భూగర్భజలాలు అడుగంటాయి. ఎప్పటి మాదిరిగానే బోర్లు, బావుల కింద రైతులు వరినార్లు పోసి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. వాన జాడలేక జంకుతున్నారు. మరో వారం, 10 రోజుల్లో సరైన వాన లేకున్నా, భూగర్భజలాలు పెరుగకున్నా ఆ రైతుల పరిస్థితి అధోగతే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వానకాలం బోర్లు, బావుల కింద సాగు ప్రశ్నార్థకంగానే మారింది.-(మర్రి మహేందర్‌రెడ్డి)
నల్లగొండ ప్రతినిధి, జూలై18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జూన్‌తోపాటు జూలై నెలలో ఇప్పటికీ సరైన వర్షాలు కురువలేదు. ఎక్కడా కాలువలు పారక చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా భూగర్భజలాలు అంతకంతకూ పడిపోయి బోర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో గత జూన్‌తో పోలిస్తే లోటు వర్షపాతమే నమోదైంది. అత్యధికంగా మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 13.30 మీటర్ల దిగువకు నీటిమట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇకముందు కూడా వర్షాలు కురువకుంటే వచ్చే రెండు నెలలు పంటల సాగులో విచ్చలవిడిగా నీళ్లను తోడేస్తే ఇక ఆ తర్వాత భూగర్భజలాలు పాతాళంలోకి పడేపోయే ప్రమాద ఘంటికలే కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద, చిన్న రిజర్వాయర్లన్నీ కలిపి 107 ఉండగా వాటికి అదనంగా 28,678 చెరువులు, కుంటలు భూగర్భజలాలకు కీలక ఆధారాలుగా ఉన్నాయి. వీటిల్లో 78 లక్షల ఎకరాలకు రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందుతుంది. మరో 50 లక్షల ఎకరాలకు పైగా చెరువులు, కుంటల పరిధిలోని వ్యవసాయ బావులు, బోర్ల ద్వారా సాగునీరు పారుతుంది.
ఈ వానకాలంలో ఇప్పటికే గోదావరి, కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల్లో నీరు లేక బోసిబోతున్నాయి. సాగునీరు మాటేమో కానీ, కనీస అవసరాలు కూడా తీరే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే రెండు బేసిన్లలో కలిపి ప్రస్తుతం 42.18 టీఎంసీల నీరే అందుబాటులో ఉన్నదని, అది కూడా పూర్తిగా తాగునీటి అవసరాలకే సరిపోయేలా లేదు. కృష్ణాలో కీలకమైన నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజీకి పైన కేవలం 6.01టీఎంసీల నీరే లభ్యతగా ఉన్నది. వరదలు రాకపోతే వచ్చే రెండు, మూడు నెలల్లో హైదరాబాద్ జంటనగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తాగునీటి అవసరాలు కూడా తీరేలా లేదు. పంటలకు సాగునీటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఆయకట్టు ప్రాంతాల్లోని 75శాతం చెరువులు, కుంటల్లో ఇప్పటికీ ఎంతో కొంత నీరు ఉండగా, ఆయకట్టేతర ప్రాంతాల్లో నీళ్లు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. దీంతో భూగర్భజలాలు సైతం అంతకంతకూ పడిపోతున్నాయి.
30.53శాతం లోటు వర్షపాతం
ఈ వానకాలంలో ఎల్ నినో తీవ్రరూపం దాల్చడంతో మబ్బులే తప్ప చినుకు జాడలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో 30.53 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 27 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా 5 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. జూలైలో 25 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టులో 10 నుంచి 15శాతం, సెప్టెంబర్ లో 42శాతం, అక్టోబర్ నాటికి 55శాతానికి లోటు వర్షపాతం చేరుకోవచ్చని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. దీంతో వర్షాలు కురువక చెరువులు, కుంటలు నిండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ప్రభావం భూగర్భజలాలపై పడి బోర్లు, బావుల కింద సాగు తీవ్ర ప్రమాదంలో పడనున్నది. రానున్న రోజుల్లో బోర్లు వట్టిపోయి వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉన్నది.
పడిపోతున్న భూగర్భ జలమట్టం
గతేడాది వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం 6.22 మీటర్లు కాగా, ఈ ఏడాది వేసవిలో ఏకంగా 9.26 మీటర్లకు పడిపోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. జూన్‌లో సగటు భూగర్భ జలమట్టం 9.46 మీటర్లు ఉండగా, 13 జిల్లాల్లో అంతకు మించి లోతుల్లోకి నీటిమట్టాలు పడిపోయాయి. గోదావరి నీళ్లు పారే ప్రాజెక్టుల పరిధి జిల్లాల్లోనే ఎక్కువ భూగర్భజలాలు లోతుల్లోకి చేరుకొన్నట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గత జూన్‌తో పోలిస్తే గోదావరి జలాలతో లింక్ ఉండే ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో నీటిమట్టం వేగంగా పడిపోవడం గమనార్హం. ఇక్కడ కాళేశ్వరం జలాలను సద్వినియోగం చేసుకొంటే పరిస్థిత మరోలా ఉండేది.
కానీ, రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధపడటమే లేదు. దీంతో ఆయా జిల్లాల్లోని చెరువుల్లో సైతం నీరు అడుగంటుతున్నది. ఖమ్మం జిల్లాలో 5.46 మీటర్ల లోతుల్లో నీరు అందుబాటులో ఉండగా, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత లోతుల్లో 13.30 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది. ఒక్క యాదాద్రి-భువనగిరి జిల్లాలో మాత్రమే గతంతో పోలిస్తే ఈ సారి అదనంగా 2.86 మీటర్ల ఎత్తుకు నీటిమట్టం పెరుగడం విశేషం. మొత్తంగా గత జూన్‌తో పోలిస్తే 17 జిల్లాల్లో నీటిమట్టాలు పడిపోయాయి. రానున్న రెండు నెలలు అత్యంత కీలకం కావడంతో బోర్లు, బావుల కింద పంటల సాగైతే అత్యంత వేగంగా నీటిమట్టాలు పడిపోయే ప్రమాదం పొంచి ఉన్నది.
వేల సంఖ్యలో కొత్త బోర్ల తవ్వకం
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా బోర్లు, బావుల తవ్వకం పెద్ద ఎత్తున సాగుతున్నది. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల పరిధిల్లోని ఆయకట్టు ప్రాంతాల్లో సాగునీరు రాదన్న అంచనాకు వచ్చిన రైతులు భూగర్భజలాలను తోడేందుకు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్, సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో కొత్త బోర్లు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ఈ వానకాలం ఇప్పటివరకు 1,500కు పైగా రైతులు కొత్తగా బోర్లు వేసినట్టు సమాచారం. గత పక్షం రోజుల్లో తనకున్న 3 బోరు బండ్లతో 40 బోర్లు వేస్తే కేవలం ఆరింటిలోనే నీరు పడినట్టు ఓ బోరుబండి యజమాని తెలిపారు. ఈ జిల్లాలో సుమారు 90 నుంచి 100 బోరుబండ్లు తవ్వకాలు జరుపుతున్నట్టు తెలిసింది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో 2,500 కొత్త బోర్లు వేసినట్టు అంచనా. 175కు పైగా బోరుబండ్లు గ్రామాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ సాగర్ జలాలు వస్తాయో? లేదో? అన్న అనుమానంతో రైతులు కొత్తగా బోర్లు వేస్తున్నారు.
గోదావరి బేసిన్లో ప్రమాద ఘంటికలు
గోదావరి జలాలతో ప్రాజెక్టులపై ఆధారపడి వ్యవసాయం చేసే జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీళ్లు లేక, ఉన్న నీటిని విడుదల చేయక, వర్షాలు సైతం పడకపోవడంతో వేగంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. మధ్యమానేరు, ఎగువ మానేరు, మలాపూర్ రిజర్వాయర్లు ఇప్పటికే డెడ్‌స్టోరేజీకి చేరాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు ఎత్తిపోయడం లేదు. దీంతో వాటి పరిధిలోని చెరువులు పూర్తిగా నీళ్లు లేక కళతప్పడంతో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే అదనంగా 1.02 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. బోర్ల కింద నార్లు పోసే రైతులు వెనుకాముందు ఆలోచిస్తున్నారు. ఇక్కడ 2లక్షల ఎకరాల సాగుకు గాను కనీసం 40వేల ఎకరాల్లోనూ సాగుకాలేదు. జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు కేవలం 11వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. చాలాచోట్ల వర్షాల కోసం, ఎస్సారెస్పీ నీటి కోసం, ఎత్తిపోతల కోసం రైతులు వేచి చూస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో గతేడాదితో పోల్చితే 1.33 మీటర్ల లోతుకు జలాలు పడిపోయాయి. జిల్లాలోని 1,090 చెరువుల్లో 50 శాతానికి పైగా చెరువులు పూర్తిగా ఎండిపోయాయి.
20 ఎకరాలు పత్తి వేస్తే మొలకెత్తలేదు..
నేను గతంలో 20 ఎకరాలు పత్తి వేయడంతోపాటు ఐదు ఎకరాలు వరి సాగుచేసిన, ఈ యేడు కూడా 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి విత్తనాలు వేసిన. కానీ మొలకలు రాలేదు. సకాలంలో వర్షాలు కురువనందుకు మొత్తం 20 ఎకరాలకు పెట్టిన పెట్టుబడి వృథా అయ్యింది. వరి పండించాలని నారు పోసిన. వర్షాలు కురుస్తలేవు. పంట వస్తుందో లేదోనని భయంగా ఉన్నది. పెట్టుబడి మీదపడితే పూర్తిగా నష్టపోతా. ఇప్పటికే రూ.లక్షకుపైగా పెట్టబడి పెట్టి మొత్తం నష్టపోయిన. నీళ్లు ఉంటే కరెంటు ఉండదు. కరెంటు ఉంటే యూరియా దొరకదు. పండిన పంటను అమ్ముకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కేసీఆర్ పాలనలో కరెంటు, యూరియాకు ఎలాంటి ఇబ్బందులుండేవి కాదు. పెట్టుబడి సాయం కూడా వచ్చేది. కానీ ఇప్పుడు వ్యవసాయం అంతా నష్టమే. రైతుల బతుకులు బజారున పడే పరిస్థితి వచ్చింది.
-వెంకట్రాములు, రైతు, నందిపేట, మూసాపేట మండలం, మహబూబ్‌నగర్
రెండున్నర ఎకరాల కోసం 14 బోర్లు
తిప్పర్తి, జూలై 18: నల్లగొండ జిల్లాలో తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు దొమ్మాటి సైదులు. రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ భూమి సాగుకోసం తెలంగాణ రాకముందు తొమ్మిది బోర్లు వేశాడు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్కబోరు కూడా వేయలేదని గర్వంగా చెప్తున్నాడు. కాంగ్రెస్ వచ్చాక నిరుడు రెండు బోర్లు వేసి పొలం పారించుకొన్నాడు. ఈసారి ఎల్ నినో ప్రభావంతోపాటు సాగర్ నీళ్లు రాక ఈ నెల 14వ తేదీన ఒక్క రోజే మూడు బోర్లు వేశాడు. మొదటి బోరు 200 ఫీట్లు, రెండోబోరు మరో 200 ఫీట్లు వేసినప్పటికీ నీరు పడలేదు. దీంతో మూడోబోరు కూడా వేశాడు. వీటి కోసం రూ.70 వేలు ఖర్చు చేసినట్టు సైదులు వాపోయాడు.
5 లక్షలు పెట్టి 6 బోర్లు వేస్తే ఒక్కటీ పడలేదు
మాది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణ పరిధిలోని ఒకటో వార్డు నెల్లిబండ తండా. నాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. కేసీఆర్ హయాంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరు వచ్చి చెరువులు, కుంటలు నిండి ఒక్క బోరు మొత్తం భూమికి సాగునీరు అందించేది. కాంగ్రెస్ వచ్చాక ఈ రెండేండ్ల నుంచి చెరువులు, కుంటల్లోకి నేరు చేరనేలేదు. కాలువలకు నీళ్లు సరిగా వదలడం లేదు. భూమి లోతుల్లోకి నీరు ఇంకిపోతున్నది. బోరు ఆగిఆగి పోస్తుండటంతో సాగునీరు కోసం రూ.5 లక్షలు ఖర్చు పెట్టి కొత్తగా 6 బోర్లు వేసినా ఒక్కబోరు పడలేదు. 200 ఫీట్ల కింద కూడా నీటి చెమ్మ కనిపిస్తలేదు.
– ఆంగోతు రాములు, రైతు, నెల్లిబండ తండా, తిరుమలగిరి మండలం, సూర్యాపేట జిల్లా
కండ్ల పొంటి ఏడుపొస్తున్నది
నేను 8 ఎకరాల్లో వరి సాగుచేస్తున్న. నాలుగెకరాలు నా సొంత భూమి. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్న. వానాకాలం వచ్చిందని ఆశతో గతం మాదిరే పుటం వేసి నాట్లు కూడా వేసిన బోరుబావుల నుంచి నీళ్లు వస్తలేవు. గిప్పుడే గిట్లుంటే ఇక మున్ముందు పంటల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. పెట్టిన ఖర్చులైనా వస్తాయో? రావో? అన్న భయమైతుంది. ఈసారి కాలం గురించి ఆలోచిస్తే కండ్ల పొంటి నీళ్లొస్తున్నయ్.
– గంగాధర్, రైతు, పోతంగల్ శివారు, నవీపేట మండలం, నిజామాబాద్ జిల్లా