Indiramma house | చిగురుమామిడి, జూన్ 3: అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల జోక్యం తగదని, అర్హులను ఎంపిక చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అధికారులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అందే స్వామి అన్నారు. మండలంలో కేంద్రంలోని సీపీఐ భవన్ లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినప్పటికీ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో గ్రామ ప్రత్యేక అధికారులతో వేసినప్పటికీ, గ్రామ సభలు నిర్వహించకుండా అధికారులు కాంగ్రెస్ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీ వారికి అనుకూలమైన వారికి ఇండ్లు మంజూరు చేశారని అన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయడం లేదని, అనేకమంది కూడా లేక కిరాయి ఇళ్లలో ఉన్నప్పటికీ వారికి మంజూరు కాకపోవడం కాంగ్రెస్ పని తీరుకు నిదర్శనం అన్నారు.
గ్రామాల్లో కొంతమంది దళారులు లబ్ధిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామాల్లో అధికారుల నియంత్రణ కొరబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ వికాస పథకం వల్ల గ్రామాల్లో గందరగోల పరిస్థితి నెలకొన్నాయని అనేకమంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటి పరిశీలన కోసం గత వారం రోజులుగా మండల పరిషత్ కార్యాలయంలో అర్ధరాత్రి దాకా కాంగ్రెస్ నాయకులను చాంబర్లో కూర్చోబెట్టుకొని అధికారులు సెలక్షన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఒక జిల్లా అధికారి, మండలంలో ఉన్న అధికారులు ఎంపిక చేయకుండా ఎంపీడీవో కాంగ్రెస్ నాయకులు ఎంపిక చేయడంపై అర్హత అయిన వారికి రాకుండా కాంగ్రెస్ అనుకూల వ్యక్తులకు మాత్రమే ఈ పథకం వర్తించే అవకాశం ఏర్పడిందన్నారు.
పార్టీలకతీతంగా జరగాల్సిన ఎంపికలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని అన్నారు. అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్, జెడ్పి సీఈఓ కు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అందే చిన్నస్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, పైడిపల్లి వెంకటేష్, రైతు సంఘం మండల కార్యదర్శి గోలి బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.