ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే నెల 7 మొదటి బస్సు నుంచి సమ్మెకు దిగేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని, యాజమాన్యం చెబుతున్న కల్పితాలను నమ్మి ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని మండి పడుతున్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని తదితర 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీస్‌ను జనవరి 27 ఆర్టీసీ అధికారులకు సమర్పించామని, ఫిబ్రవరి 9 వరకు యాజమాన్యంగానీ, ప్రభుత్వంగానీ స్పందించాలని అందులో స్పష్టం చేశారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక సమ్మె తప్పదని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో పోరుబాటకు రంగం సిద్ధమవుతున్నది. ఆర్టీసీ యాజమాన్య వైఖరిపై కార్మికులు, సమ్మె నోటీస్ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మెకు సన్నద్ధమవుతున్నది. 2023 సెప్టెంబర్ 15న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రక్రియను కొనసాగించాలని, తదితర 21 డిమాండ్లతో జనవరి 27న ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు.
ఫిబ్రవరి 9వరకు ప్రభుత్వంగానీ, యాజమాన్యంగానీ స్పందించాలని, లేని పక్షంలో సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కానీ, ఇప్పటి వరకు ఈ రెండు పక్షాల నుంచి చర్చలకు ఆహ్వానించకపోవడంపై మండిపడుతున్నారు. ఈ విషయాన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇచ్చిన గడువు కూడా మీరడంతో సమ్మె అనివార్యంగా భావిస్తున్నారు. ఆర్టీసీలోని వివిధ సంఘాలతో ఏర్పడిన జేఏసీ నాయకులు ఈ మూడు నెలల కాలంలో అనేక రకాలుగా విజ్ఞప్తులు కూడా చేస్తూ వచ్చారు.
గేట్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి యాజమాన్యం తప్పుతోవ పట్టించాలని చూసినా ఒక్కతాటిపై నిలిచారు. జేఏసీ ఆధ్వర్యంలో కూడా కార్మికులను సన్నద్ధం చేసేందుకు సమావేశాలు, చర్చలు నిర్వహిస్తూ వచ్చారు. అలాగే మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కూడా సమ్మెకు వెళ్లాలనే తీర్మానం తీశారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే నెల 7న మొదటి బస్సుతో సమ్మె మొదలవబోతున్నది.
కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమైనట్టు?
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని జేఏసీ నాయకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాము సమ్మెకు దిగాల్సి వస్తున్నదని స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేస్తామని కాంగ్రెస్ చెప్పి ఏడాదిన్నర గడుస్తున్నా ఉలుకు పలుకు లేకపోవడంపై మండిపడుతున్నారు.
నిజానికి ఈ ప్రక్రియ బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైనప్పటికీ యాజమాన్యం ఇచ్చిన తప్పుడు సమాచారంతో ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆరోపిస్తున్నారు. వెంటనే విలీన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులపై పనిభారం తీవ్రంగా పడుతున్నదని, ఒక్కో డిపోలో 25 నుంచి 30 మంది డ్రైవర్లు, కండక్టర్ల లోటు ఉన్నదని, ఉన్నవారితోనే సేవలు నెట్టుకొస్తున్నారని, ఈ కారణంగా కార్మికులు రోజుకు 12 నుంచి 16 గంటలు పనిచేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి కోట్లలో లాభాలు వస్తున్నాయని ప్రకటనలు ఇస్తున్న యాజమాన్యం, రిటైర్మెంట్ ఉద్యోగుల సెటిల్మెంట్లు ఎందుకు చేయలేక పోతున్నదని ప్రశ్నిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల చివరి వేతనా లు కూడా ఇవ్వలేక పోతున్నారని, హెచ్ఆర్ తగ్గించడం వలన కార్మికులు తీవ్రం గా నష్టపోతున్నారని చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 400 కో ట్లు చెల్లించాల్సి ఉంటుందని ఈ విషయంలో కూడా స్పష్టత లేదని జేఏసీ నాయకులు చెబుతున్నారు.
2021 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ జరగ లేదని, మస్టర్ పే స్కేల్ విధానం వర్తింప జేయడం లేదని కార్మికులు వాపోతున్నారు. పదేళ్లుగా ఆర్టీసీలో నియామకాలు చేపట్టడం లేదని, ఈ పదేళ్లలో 16 వేల మంది రిటైర్డ్ అయినా ఉన్నవారితోనే విధులు నిర్వర్తిస్తున్నారని చెబుతున్నారు. కార్మికులకు రావాల్సిన ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించకపోవడంతో ఆర్థిక భారం పడుతున్నదని, అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు.
ఎలక్ట్రికల్ బస్సులతో ప్రైటీకరణ?
ఆర్టీసీ యాజమాన్యం కొత్త ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశ పెట్టడంతో ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నదని జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ బస్సు ల కొనుగోలులో ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యంగానీ ఒక్క పైసా పెట్టుబడి పెట్ట లే దని, ప్రైవేట్ సంస్థలైన జేబీఎం, ఒటేక్ట్రాల గుత్తాధిపత్యమే నడుస్తున్నదని కార్మికులు వాపోతున్నారు.
ఈ బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు, ఆర్టీసీ సంబంధం లేదని, ఈ బస్సుల మీద ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మొత్తం ప్రైవేట్ వ్యక్తులకే చెందుతున్నదని చెబుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీనే తీసుకొని నడపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల తర్వాతి కాలంలో ఆ బస్సులు సంస్థకే చెందుతాయని భావిస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులపై ప్రైవేట్ గుత్తాధిపత్యం ఉండొద్దని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ బస్సుల ప్రవేశంతో తమకు ఉద్యోగ భద్రత కరువవుతుందని వాపోతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులకు కిలో మీటర్‌కు 58 సంస్థ చెల్లించడం వల్ల కొన్ని రూట్లలో ఆర్టీసీ నష్టపోయే ముప్పు ఉన్నదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమ్మె చేస్తేనే సంస్థ మనుగడ
ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చి మూడు నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు స్పందించ లేదు. సమ్మె చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఇతర ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ప్రభుత్వం మా ఆర్టీసీపైన మాత్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నది. ఈ విధానం మారాలని కోరుకున్నాం. కానీ, మూడు నెలలుగా యాజమాన్యం చర్చలకు పిలువ లేదు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవడం లేదు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తారేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా ఈ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకుంటున్నది. ఈ పని ఆర్టీసీ యాజమాన్యమే చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ యాజమాన్యాలకు వీటిని అప్పగించి ఆర్టీసీ ఆస్తులకు కట్టబెడుతున్నారు. వీటి వల్ల కార్మికుల, భద్రతకు, ఆర్టీసీకి ముప్పువాటిల్లే ప్రమాదం ఉన్నది. అలాగే ఉద్యోగ నియామకాలు లేకుండా ఆర్టీసీలో ఉన్న కార్మికులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో కార్మికులపై పని భారం పెరుగుతున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్ర ధాన హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చి పోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె ఒక్కటే మార్గమని భావిస్తున్నాం. సమ్మె చేయడం వల్లనే ఆర్టీసీ సంస్థకు మనుగడ ఉంటుందని భావిస్తున్నాం. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి 7న మొదటి బస్సుతో సమ్మె ప్రారంభిస్తున్నాం. మంగళవారం హైదరాబాద్‌లో జేఏసీ మరోసారి సమావేశమైంది. ప్రతి కార్మికుడినీ సమ్మెలో పాల్గొనేలా చేయాలని నిర్ణయించింది. ఏ కార్మికుడిని కదిలించినా సమ్మెకు సిద్ధమనే చెబుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు.
– మారంరెడ్డి థామస్ రెడ్డి, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్
21 డిమాండ్లు ఇవే..
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
ఆర్థికపరమైన అంశాలను అమలు చేస్తూ, ప్రస్తుత సౌకర్యాలను కొనసాగిస్తూ, ప్రభుత్వంలో విలీనం చేయాలి 2021 వేతన సవరణ అమలు చేయాలి. ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి. 2017 వేతన సవరణ బకాయిలను చెల్లించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలి. కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీని అభివృద్ధి చేసి, ఆధునీకరించాలి.
సంస్థ అప్పులను ప్రభుత్వమే టేకోవర్ చేసి, రాయితీలకు, సంస్థ అభివృద్ధికి ఏటా బడ్జెట్లో 3 శాతం కేటాయించాలి.
విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొని సంస్థకు ఇవ్వాలి.యాజమాన్యం వాడుకున్న సీసీఎస్, ఎస్ఆర్ఎస్, పీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలి. సీసీఎస్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఆఫీసు సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి.
మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలి. రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ఈ స్కీంలో జరుగుతున్న సీ, టీ కేసుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఉద్యోగాలు రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. ప్రస్తుతం కన్సాలిడేటెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. ప్రభుత్వ జీవో ఎంఎస్ నంబర్ 30, తేదీ 8 జూలై 2024 ప్రకారం వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలి. ఈ స్కీంలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ వంటి పోస్టులను కూడా ఇవ్వాలి. అన్ని కేటగిరిల్లో ఖాళీలను భర్తీ చేసి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి.
ప్రతి కార్మికుడికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్ ఇవ్వాలి. బస్ బాడీ బిల్డింగ్తోపాటు మిగిలిన వర్షాపులను బలోపేతం చేయాలి. ప్రొడక్షన్ యూనిట్లలో 2013 నుంచి రావాల్సిన మ్యాన్ అవర్ రేటు అమలు చేయాలి. తార్నాక హాస్పిటల్లో అన్ని విభాగాల్లో సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. రోగులు, వారి వెంట వస్తున్న అటెండెంట్లకు భోజనం, వసతి సౌకర్యం కల్పించాలి.
ఉద్యోగులకు తార్నాక హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలి. ఉద్యోగి ఫ్యామిలీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వారి తల్లిదండ్రులకు కూడా వైద్య సౌకర్యం కల్పించాలి.
సంస్థలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సరిపడా మందులు సరఫరా చేయాలి. వైద్య పరీక్షలకయ్యే ఖర్చు యాజమాన్యమే భరించాలి.
రిటైరైన ఉద్యోగులకు రావాల్సిన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలి. రిటైర్ కాబోతున్న ఉద్యోగులకు అదే రోజు అన్ని సెటిల్మెంట్ల మొత్తాలను చెల్లించాలి.అకౌంట్స్ విభాగంలో సెంట్రలైజేషన్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలి.
అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న రిటైర్డ్ అధికారులు, సూపర్వైజర్లను తీసివేసి వారి స్థానంలో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. అవుట్సోర్సింగ్ ద్వారా కన్సల్టెన్సీల పేరు మీద జరుగుతున్న ఆర్థిక దుబారాను అరికట్టాలి.
అన్ని యూనిట్లలో మహిళలతో పాటు పురుషులకు కూడా అన్ని వసతులతో పాటు తాగునీరు, వాహనాల పారింగ్కు సరిపడా షెడ్స్ నిర్మించాలి.
పాత రెగ్యులేషన్స్ సమూలంగా మార్చి డ్రైవర్, కండక్టర్, మెయింటెనెన్స్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అక్రమ సస్పెన్షన్, రిమూవల్ అయినవారిని, అప్పీల్ రిజెక్ట్ అయినవారిని విధులలోకి తీసుకోవాలి. జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాసైన వారికి పోస్టింగ్ ఇవ్వాలి. మిగిలిన ఖాళీలకు డిపార్టుమెంట్ టెస్టు నిర్వహించి భర్తీ చేయాలి. 2019వ సంవత్సరం సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీస్ కేసులను ఎత్తేయాలి.అద్దె బస్సు డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈఎస్ఐ దవాఖానల్లో వైద్య సౌకర్యం కల్పించాలి. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రికవరీ చేయాలి. ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం 8 గంటల పనిదినాలు (సిటీ సర్వీసులలో 7 గంటలు) అమలు చేసి మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల లోపు డ్యూటీలు పూర్తయ్యేలా డ్యూటీలు ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి నెలకు 3 రోజులు సెలవులు మంజూరు చేయాలి.