సంక్రాంతి పండుగ వేళ ఆర్టీసీ అదనపు చార్జీలతో బాదుతున్నది. స్పెషల్ బస్సుల పేరిట దాదాపు 50 శాతం వరకు టికెట్ల రేట్లు పెంచి దండుకుంటున్నది. మూడు రకాల సర్వీసుల ద్వారా అందుతున్న సేవలపై 110 నుంచి 170 వరకు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్, ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులపై భారం మోపుతున్నది. పండగకు ఇంటికి వెళ్లాలన్నా.. ఇంటి నుంచి తిరిగి వెళ్లాలన్నా మోత మోగుతుండగా, పురుష ప్రయాణికులపై ప్రభావం పడుతున్నది. ఓవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూనే.. ఈ రకంగా చార్జీలు పెంచడం విమర్శలకు తావిస్తున్నది. అయినా రద్దీకి తగినట్టు సర్వీసులు లేక ప్రత్యేక బస్సుల్లో కూడా నిలబడే ప్రయాణించాల్సి వస్తున్నది. అదనపు చార్జీలు చెల్లిస్తున్నా కనీసం సీట్లు దొరక్కపోవడంతో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. స్పెషల్ బస్సులు కాదు.. రెగ్యులర్ బస్సులు నడపాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్ : పండుగ పూట ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. అందులో ప్రత్యేకత కూడా ఏమీ లేదు. కానీ, బస్సుల్లో కనీసం సీటు కూడా దొరకని పరిస్థితి ఉన్నది. అయినా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఈ నెల 7 నుంచి అదనపు చార్జీలతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నది. ఇప్పటికే లక్షలాది మందిపై అదనపు చార్జీల భారం వేసింది. పండుగకు ముందే కాదు, తర్వాత కూడా ఇవే చార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ ప్రణాళికలు వేసినట్టు కనిపిస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావాలంటే ఎక్స్‌ప్రెస్ సర్వీసులో సాధారణ టికెట్ ధర 230 మాత్రమే ఉండగా, ఇప్పుడు 340 వసూలు చేస్తున్నారు. అదనంగా 110 తీసుకుంటున్నా రు. సూపర్ లగ్జరీలో సాధారణ సమయంలో 310 ఉంటే ఇప్పుడు 440 వసూలు చేస్తున్నారు. అంటే 130 అదనంగా బాదుతున్నారు. ఇక రాజధాని బస్సులో 390 ఉంటే.. ఇప్పుడు 560 వసూలు చేస్తున్నారు. అంటే 170 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక గోదావరిఖని నుంచి కరీంనగర్ రావాలన్నా, ఇక్కడి నుంచి గోదావరిఖని వెళ్లాలన్నా ప్రతి సర్వీసులో 40 అదనంగా వసూలు చేస్తున్నారు.
ఈ నెల 14న సంక్రాంతి ఉన్నది. ఈ నేపథ్యంలో పండుగకు ముందు అంటే.. ఈ నెల 7 నుంచే హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు ఎక్కువ మంది ప్రయాణికులు వస్తున్నారు. ఇది 13 వరకు కొనసాగుతుంది. ఇటు నుంచి అటు వెళ్లే ప్రయాణికులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వీరి కోసం ప్రత్యేక బస్సులు నడిపిస్తున్న ఆర్టీసీ.. ఒక్కో టికెట్‌పై అదనంగా బాదుతున్నది. అయితే తిరుగు ప్రయాణంలో కూడా ఇవే అదనపు చార్జీలను వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. పండుగ తర్వాత అంటే.. ఈ నెల 16 నుంచి 22 వరకు తిరిగి వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతూ ఇప్పటి మాదిరిగానే చార్జీలు వసూలు చేయబోతున్నది. పండగకు ముందు 770 ట్రిప్పులు, పండగ తర్వాత 970 ట్రిప్పులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించినట్తు తెలుస్తున్నది. సాధారణ సమయాల్లో అయితే కరీంనగర్ నుంచి 80 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారు. అందులో ఎక్కువగా హైదరాబాద్, కరీంనగర్ మధ్యన ప్రయాణించే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఆ సంఖ్య లక్షకు చేరింది. పండుగ దగ్గర పడిన కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశ ముంటుంది.
ప్రత్యేక బస్సుల పేరిట కరీంనగర్, హైదరాబాద్ మధ్య, గోదావరిఖని, కరీంనగర్ మధ్య నడుపుతున్న సర్వీసుల్లో ప్రత్యేకత ఏమీ కనిపించడం లేదు. నిజానికి ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసినప్పుడు కనీసం సీట్ల వరకైనా టికెట్లు ఇస్తే బాగుండేది. కానీ, ప్రతి స్పెషల్ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుండగా, చివరికి మహిళా ప్రయాణికులు కూడా నిలబడే ప్రయాణించాల్సి వస్తున్నది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినా.. ఇప్పుడు మాత్రం బస్సుల సంఖ్యను పెంచ లేదు. బస్సుల్లో 80 శాతం మంది మహిళలే ప్రయాణిస్తుండగా, ఇబ్బందిగా వెళ్లాల్సి వస్తున్నది. అదనపు చార్జీలు బాదినా కనీసం సుఖంగా ప్రయాణించే పరిస్థితి లేక పోవడంతో ప్రయాణికులు ఆగ్రహిస్తున్నారు. అదనపు చార్జీలు వసూలు చేసినప్పుడు తమకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా ఆర్టీసీదేనని స్పష్టం చేస్తున్నారు.
పండుగకు ప్రత్యేక బస్సుల పేరిట ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రణాళికను రూపొందించింది. ఇది ఈ నెల 7 నుంచి 13 వరకు మొదటి దఫా అమలవుతున్నది. ఈ దఫాలో 770 ట్రిప్పులు నడపాలని నిర్ణయించుకున్నది. అందులో భాగంగా ఈ నెల 7న 35,8న 35, 9న 40 బస్సులు నడిపిన ఆర్టీసీ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రతి రోజూ 165 ట్రిప్పులు నడిపేందుకు నిర్ణయించింది. అంతే కాకుండా, పండుగ తర్వాత అంటే.. ఈనెల 16 నుంచి రెండో దఫాలో 970 ట్రిప్పులు నడిపించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా 16న 180, 17న 145, 18న 145, 19న 190, 20న 150, 21న 80, 22న మరో 80 ట్రిప్పులు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించుకున్నది. అయి తే ఒక్కో బస్సు కెపాసిటీ 50 సీట్లుగా లెక్కిస్తారు. పండగ పూట తప్పని పరిస్థితుల్లో అంతకంటే ఎక్కవ మందే ప్రయాణం చేస్తుంటారు. 50 సీట్లు వేసుకున్నా మొదటి దఫాలో 38,500 మందిని, తిరుగు ప్రయాణంలో 48,500 మందిని ప్రత్యేక బస్సుల్లో తమ గమ్య స్థానాలకు చేర్చాలని నిర్ణయించింది. రెండూ కలిపితే 87 వేల మంది ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే అవకాశం కనిపిస్తున్నది. అంటే అదనపు చార్జీల మోత ఎంత భారమవుతుందో దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు.
ఫ్రీ బస్సులతోని ప్రయాణం కష్టంగా మారింది. పండగ సందర్భంగా రేట్లు పెంచడం సామాన్యులకు భారమే. సరిపడా బస్సులు లేక నిల్చొని ప్రయాణిస్తు న్నాం. ఇప్పుడు గంట నుంచి బస్సుల కోసం ఎదురు చూ స్తున్నా. పండుగ రోజుల్లో అదనపు బస్సు లు వేయకపోవడం ఆర్టీసీ వైఫల్యమే. ప్ర త్యేక బస్సుల కన్నా రెగ్యులర్ బస్సులు నడపా లి. చార్జీలు పెంచడం కరెక్ట్ కాదు. ప్ర యాణికులపై అదనపు భారం పడుతుంది.
– గణేశ్, స్టూడెంట్ (గోదావరిఖని)
కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో నా కొడుకు ఇంటర్ చదువుతున్నడు. వాడిని తీసుకెళ్లడానికి ఆసిఫాబాద్ నుంచి వచ్చేటప్పుడు నిలబడే వచ్చిన. బస్టాండ్‌లో బస్సు కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్న. కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్లి అక్కడి నుంచి మా ఊరికి వెళ్తామని స్పెషల్ బస్సు ఎక్కిన. ఇంతకముందు ఇందులో 110 చార్జి ఉంటే ఇప్పుడు 150 తీసుకుంటున్నరు. ఈ బస్సు తప్పా మాకు వేరే బస్సులు అం దుబాటులో లేవు. ప్రత్యేక బస్సులు అంటే కనీసం సీట్లయినా ఉండాలి కదా! కూసుందామంటే సీట్లే లేవు. గోదావరిఖని వరకు నిలబడే పోవాలి. ప్రత్యేక బస్సుల కంటే రెగ్యులర్ బస్సులు నడపాలి. ప్రయాణికులపై అదనపు చార్జీలు వేయకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యానిదే.
– జలపతి రావు, ప్రయాణికుడు (ఆసిఫాబాద్)
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ప్రకటించి అందులో ఒక్క ఉచిత ప్రయాణం మాత్రమే అమలు చేసింది. కానీ, సరిపడా బస్సులు లేక నిత్యం ప్రయాణికుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఉచిత ప్రయాణాన్ని విద్యార్థులు, పేదలకు మాత్రమే వర్తింపజేస్తే బాగుండేది. ప్రభుత్వ వేతనాలు పొందుతున్న ఉద్యోగులు కూడా ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రభు త్వం ఆలోచించాలి. ఇలా పండుగరోజుల్లో అదనపు చార్జీల పేరిట భారం వేయద్దు.
– ఆకుల స్వామి వివేక్ పటేల్, ప్రయాణికుడు (పెద్దపల్లి)
పండగకు మా అమ్మ వాళ్ల ఇంటికి వరంగల్ వెళ్లేందుకు మా అమ్మ, నా కొడుకుతో బస్టాండ్‌కు వచ్చిన. ఇక్కడ చూస్తే బస్టాండ్ మొత్తం కిక్కిరిసిపోయింది. ఏ బస్సు కూడా ఎక్కేందుకు వీలు లేకుండా ఉన్నది. గంటన్నర నుంచి ఎదురుచూస్తున్నాం. ఉచిత ప్రయాణం పథకం పెట్టినప్పుడు ప్రభుత్వం అందుకు సరిపడా బస్సులు పెంచాల్సింది. అసలు ఉచిత ప్రయాణం కంటే ఉపాధి కల్పించే పథకాన్ని ప్రవేశ పెట్టాల్సింది. పండుగ సందర్భాల్లో ప్రయాణించే మాలాంటి వారికి సీట్లు దొరకకా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఉచిత ప్రయాణంపై పునరాలోచించాలి.
– సాహితి, ప్రయాణికురాలు (కరీంనగర్)