RTC Driver Shankar Goud | కోరుట్ల, ఏప్రిల్ 24: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కోరుట్ల ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి శుక్రవారం వారు నివాళులర్పించారు. కోరుట్ల డిపో నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ తీసిన కార్మికులు జాతీయ రహదారిపై మానవహారంగా నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం కాలయాపన కారణంగా మనస్థాపానికి గురైన శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన చెందారు. మృతుడి కుటుంబాన్నీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందన్నారు.
ఆర్టీసీ ఆవరణలో సమ్మె చేస్తున్న టెంటును తొలగించి ఇబ్బందుల గురి చేయడం సరికాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం మోపుతుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేనిచో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, కండక్టర్లు, డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.