RTC Strike | చిగురుమామిడి, ఏప్రిల్ 24: సమస్యల పరిష్కారానికై ఆత్మహత్యకు పాల్పడిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అర్ధరాత్రి మృతిచెందడం బాధాకరమని ఆర్టీసీ జేఏసీ కరీంనగర్ జిల్లా నాయకుడు జున్నూరి శ్రీనివాస్ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మెలో భాగంగా శుక్రవారం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చాలాకాలంగా విన్నవించుకుంటున్నామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తప్పనిసరిగా సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం మోపుతుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళనలో పాల్గొని తీవ్రంగా గాయపడిన కార్మికులను ఆదుకోవాలన్నారు.