RTC buses | వీణవంక, జూలై 9 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే మహిళలకే ఉచిత బస్సు ప్రయాణం కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కమిటీ సభ్యులు బుధవారం తహసీల్దార్ రజితకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 20 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 22 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరిలో 90 శాతం విద్యార్థులు వారు చదువుకుంటున్న పాఠశాలలకు దూరంగా నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి, విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
దీని ద్వారా సమయం, శక్తి వృథాకాకుండా ఉంటుందని, చదువుపై మరింత శ్రద్ధ పెడతారని పేర్కొన్నారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, మండలాల్లో ధర్నాలు, రాస్తారోఖోలు, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ వీణవంక మండల కమిటీ సభ్యులు బీ వీరస్వామి, గణేష్, తిరుపతి, శ్రీనివాస్, సాయికుమార్, మహంకాళి రమేష్, గాజుల కుమార్, పృథ్వీరాజ్, సదానందం, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.