మంథని, జనవరి 20 : దూరప్రాంతాలు, ఇతర రాష్ర్టాలకు ఉమ్మడి జిల్లా నుంచే వెళ్లే ఆర్టీసీ బస్సులు రద్దవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ చేసిన తర్వాత.. డైరెక్ట్ సర్వీసులు ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి. పదిహేను ఏండ్లుగా మెట్పల్లి నుంచి గుంటూరు జిల్లాలోని కనిగిరి- పామూరు వరకు నడిచిన మెట్పల్లి డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ను పది రోజుల క్రితమే రద్దు చేయగా, ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని మంథని నుంచి చంద్రాపూర్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. దీంతో ఈ రూట్లో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాలకు చెందిన అనేక మంది ఉపాధి కోసం చంద్రాపూర్, బాహుపేట, వని, బల్లార్ష వంటి ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో మంథని నుంచి చంద్రాపూర్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో ఈ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసీ అధికారులు ప్రతి రోజూ ఉదయం 6:30 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 1:30 గంటలకు రెండు సర్వీసులను నడిపించారు.
కాగా, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావడం.. మహిళలు ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ సేవలను వినియోగిస్తున్న నేపథ్యంలో బస్సులు సరిపోక ఆర్టీసీ సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చంద్రాపూర్‌కు నడుపుతున్న రెండు బస్సు సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం ఆ రెండు బస్సు సర్వీసులను మంథని-సికింద్రాబాద్‌కు నడిపిస్తున్నారు. కాగా, మంథని నుంచి నేరుగా చంద్రాపూర్‌కు బస్సు లేక మంథని నుంచి మంచిర్యాలకు, అక్కడి నుంచి ఆసిఫాబాద్‌కు, అక్కడి నుంచి చంద్రాపూర్‌కు వెళ్తున్నారు.
ఇలా రెండు మూడు చోట్లలో చిన్న పిల్లలు, లగేజీతో బస్సులు ఎక్కి దిగుతూ ఇబ్బం దికర ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి చంద్రాపూర్‌కు బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అదే విధంగా మంథని డిపో నుంచి భద్రాచలం వెళ్లే రెండు బస్సు సర్వీసులను సైతం నిలిపి వేసి వాటిని కూడా మంథని-సికింద్రాబాద్‌కు నడిపిస్తున్నారు. ఈ విషయమై డీఎం రాజశేఖర్‌ను సంప్రదించగా, ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంథని-చంద్రాపూర్‌కు వెళ్లే రెండు బస్సు సర్వీసులను, భద్రాచలానికి వెళ్లే రెండు బస్సు సర్వీసులను నిలిపివేసి, సికింద్రాబాద్‌కు నడిపిస్తున్నామని చెప్పారు.