Bus Accident | కోరుట్ల, జూన్ 16: కోరుట్లలో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ్డారు. స్థానికులు, ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి జగిత్యాల వైపు వెళ్తుండగా పట్టణంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌక్ ఆర్టీసీ అవుట్ గేట్ సమీపంలో లారీని వెనుక నుంచి అదుపుతప్పి ఢీకొంది. బస్సులో మొత్తం 29 మంది ప్రయాణిస్తుండగా ఇందులో పది మందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందు భాగం అద్దాలు ధ్వంసం కాగా,ఇంజన్ భాగం దెబ్బతింది.
దీంతో బస్సును మరో వాహనం సహాయంతో డిపోకు తరలించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు నుదురు, తల భాగంలో స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించారు. గాయపడ్డ వారిలో ఇర్ఫాన్, అయోష సుల్తానా, మంజుల, వనిత, పద్మ, గంగనర్సు, లక్ష్మి, శివకుమార్, కల్పన, సుజాత ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.